
సాధారణంగా ఓ హ్యాండ్ బ్యాగు ఖరీదు 500 రూపాయల నుంచి ప్రారంభమై వేలల్లో ఉంటుంది. కానీ ఇటలీకి చెందిన ఓ బ్యాగుల కంపెని ఇటీవల తయారు చేసిన బ్యాగు విలువ తెలిస్తే అందరూ నోళ్లు వెల్లబెట్టాల్సిందే. అలిగేటర్ (మెసలి జాతికి చెందిన) చర్మంతో తయారు చేసిన ఈ చిన్న బ్యాగు విలువ రూ.53 కోట్లు అంట. దీంతో ప్రస్తుతం ఇది ప్రపంచంలోనే అంత్యంత ఖరీదైన బ్యాగు అయ్యింది. అయితే దానికి ఎందుకు అంతా ఖరీదు అని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఈ బ్యాగును వజ్రాలు, మరకత మాణిక్యాలతో పాటు విలువైన రాళ్లతో అలంకరించారు. దీనిని బోరిని మిలానేసి అనే లగ్జరీ లెదర్ హ్యండ్ బ్యాగుల కంపెనీ తయారు చేసింది. చూడగానే కళ్లు చెదరిలా తయారు చేసిన ఈ బ్యాగును అలిగేటర్ చర్మంతో తయారు చేసిన ఈ బ్యాగుపై తెల్లరంగు బంగారంతో తయారు చేసిన 11 సీతాకోక చిలుకలను అమర్చారు.
ఈ సీతాకోక చిలుకలపై మొత్తం 30 క్యారట్ల వజ్రవైఢూర్యాలు, అరుదైన మరకత మాణిక్యాలను పొదిగారు. అయితే ఈ బ్యాగు తయారు చేసేందుకు దాదాపు 1000 గంటలకు పైగా సమయం పట్టిందని ఈ సంస్థ వెల్లడించింది. దీనితో పాటు ఇలాంటివే మరో రెండు బ్యాగులను కూడా ఈ సంస్థ తయారు చేసింది. కాగా ఖరీదైన ఈ హ్యాండ్ బ్యాగులను మహాసముద్రాల కాలుష్యంపై అవగాహన కలిగించేందు కోసమే తయారు చేసినట్లు బోరిని మిలానేసి సంస్థ తెలిపింది. వీటి అమ్మకాల ద్వారా వచ్చిన డబ్బును సముద్ర కాలుష్య నివారణకు వినియోగిస్తామని ఈ సంస్థ వెల్లడించింది.