తిరుపతి బీజేపీ అభ్యర్థిగా దాసరి శ్రీనివాసులు?

Dasari Sreenivasulu Name Came on BJP Tirupati Lok Sabha Candidate

తిరుపతి పార్లమెంటు స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో బీజేపీ తరుపున రిటైర్డు ఐఎఎస్‍ అధికారి దాసరి శ్రీనివాసులు పోటీ చేయనున్నట్లు తెలిపింది. ఉప ఎన్నికలో తిరుపతి సీటును కైవసం చేసుకోని సత్తా చాటాలని భావిస్తున్న బీజేపీ నాయకత్వం శ్రీనివాసులును పోటికి దించాలనే యోచనలో ఉంది. దాదాపు ఆయన పేరు ఖరారైనట్లేనని, ఇక ప్రకటించడమే తరువాత అని బీజేపీ నేతలు చెపుతున్నారు. దాసరి శ్రీనివాసులు పార్టీ క్రమశిక్షణా సంఘం ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆ సమయం లోనే కేంద్ర బీజేపీ నేతలు, ఆర్‍ఎస్‍ఎస్‍ అగ్రనేతలతో సన్నిహిత సంబంధాలు ఏర్పడినట్లు తెలిసింది. ఆ పరిచయాల నేపధ్యంలో తిరుపతి ఉప ఎన్నికలో శ్రీనివాసులుకే సీటు ఖాయమని బీజేపీ వర్గాలు చెపుతున్నారు.

రానున్న ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు ఆ పార్టీ నేతలు తీవ్రంగా కృషి చేస్తున్నారు. కొద్ది రోజులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ప్రధాన కార్యదర్శి ఎస్‍.విష్ణువర్ధన్‍ రెడ్డి తదితరులు తిరుపతి పార్లమెంట్‍ పరిధిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. గతంలో తిరుపతి అభివృద్ధికి బీజేపీ చేసిన కృషిని, సాధించిన అభివృద్ధిని సైతం వీరు ప్రజలకు వివరిస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే తిరుపతి పార్లమెంటు జరిగే ఉప ఎన్నికల్లో బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి పేరును ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.