
ఎట్లాగైనా హైదరాబాద్ లో పాగా వేయాలని భారతీయ జనతా పార్టీ గట్టి పట్టుతో ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ అవకాశం మళ్లీ రాదన్నట్టుగా ఆ పార్టీ పావులు చకచకా కదుపుతోంది. అచ్చివచ్చిన సంప్రదాయ అస్త్రాలతో పాటు కొత్తగా పలు రకాల వ్యూహాత్మక ఆయుధాలు సైతం చేతబూనింది. గులాబీ పార్టీకి షాక్ ఇవ్వడమే లక్ష్యంగా, తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం అందుకునే దిశగా బలమైన అడుగులు వేస్తోంది.
ఆశావాహంగా పరిస్థితులు...
కరోనా కట్టడి విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై వెల్లువెత్తిన వైఫల్యం ఆరోపణలు, పలువురు హైదరాబాదీలు నగరం నుంచి స్వంత ఊర్లకు వలస వెళ్లిపోయిన ఉదంతాలు, ఆ తర్వాత పులి మీద పుట్రలా నగరాన్ని వరదలు అతలా కుతలం చేయడం... వంటివి తెరాస సర్కార్‌కి ఇబ్బంది కరంగా పరిణమించాయి. ఇది కూడా భాజాపాలో గ్రేటర్‌పై ఆశలు పెంచుకునేందుకు కారణమైంది. అంతేకాకుండా హైదరాబాద్ లో నిన్నా మొన్నటి దాకా ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, కాంగ్రెస్ లలో నైరాశ్యం నెలకొనడం కూడా భాజాపాలో మరింత నమ్మకాన్ని పెంచాయి. ఇవన్నీ ఒకత్తెయితే... ఎన్నికకు కొన్ని రోజులకు ముందుగా జరిగిన దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నిక గెలుపుతో భాజాపాలో ఎక్కడ లేని ధీమా ఏర్పడింది. తెరాసకు తామే ప్రత్యామ్నాయమనే నమ్మకంతో భాజాపా గ్రేటర్లో పోటీకి సన్నధ్ధమైంది. దుబ్బాక విజయం కేడర్‌కు కూడా మంచి స్పూర్తిని అందించింది. దీంతో భాజాపా టిక్కెట్లకు డిమాండ్ ఏర్పడింది.
పావులెన్నో...పాచికలూ అన్ని..
పరిస్థితులన్నీ కలిసి వస్తున్న సూచనలతో భాజాపా చకచకా పావులు కదుపుతోంది. బండి సంజయ్ వంటి నేతల దూకుడు పుణ్యమాని, సహజంగానే ఉండే ప్రభుత్వ వ్యతిరేక ఓటుకు తానే సోల్ ప్రొప్రయిటర్ అనే భావం కల్పించడం భాజాపా కు తొలి విజయం అనే చెప్పాలి. అలాగే సెటిలర్ల ఓట్లు మళ్లకుండా పవన్ కళ్యాణ్‌ను ఒప్పించి జనసేన పార్టీని పూర్తిగా పోటీ నుంచి తప్పించడం కూడా చెప్పుకోదిన విజయమే. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ కి సంప్రదాయంగా మద్ధతు పలికే ఓ సామాజిక వర్గాన్ని తనవైపు తిప్పుకునేందుకు గాను తేదేపా నాయకత్వాన్ని ఒప్పించిందనే మాట కూడా ఆఫ్ ద రికార్డ్ వినవస్తోంది. ఓ వైపు ఇలాంటి రాజకీయ వ్యూహాలతో పాటు ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టడానికి కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే మజ్లిస్ పార్టీని కవ్విస్తోంది. కయ్యానికి కాలు దువ్వుతోంది. మరోవైపు నీటి బిల్లుల రద్దు, సెలూన్లకు ఉచిత కరెంటు వంటి హామీలతో ప్రజల్ని తమవైపు తిప్పుకోవాలని చూస్తున్న తెరాసకు థీటుగా ఊహించనన్ని వరాలు గుప్పించింది. వరదసాయం రూ.25వేలకు పెంపు, వాహనాల చలాన్ల రద్దు, ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తు దారుల తరపున తామే జిహెచ్ఎంసికి చెల్లింపులు చేస్తామంటూ ఖరీదైన హామీలను ఎడా పెడా కుమ్మరించేసింది.
తరలివస్తున్న నేతలు..మోడీ సైతం?
ఆంధ్రప్రదేశ్ నుంచి సోము వీర్రాజు వంటి నేతలు హైదరాబాద్‌లో మకాం వేసి ప్రచారం నిర్వహిస్తుంటే మరోవైపు పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపినడ్డా, మంత్రి స్మ్రతి ఇరానీ, పలువురు భాజాపా జాతీయ నేతలు గ్రేటర్ ఎన్నికల్లో తమ వంతు పాత్ర చురుకుగా పోషిస్తున్నారు. అయినప్పటికీ సరిపోదన్నట్టుగా ఏకంగా ప్రధాని మోడీని కూడా హైదరాబాద్ నగరానికి వచ్చేలా చేయడం భాజాపా వేసిన బ్రహ్మాస్త్రం అనే చెప్పాలి. అయితే ఒక స్థానిక ఎన్నికల కోసం ఏకంగా ప్రధాని ప్రచారం అనేది సముచితం కాదు కాబట్టి ఎన్నికల సమయంలోనే ప్రధాని పర్యటన ఉండేలా జాగ్రత్తపడినట్టు సమాచారం. భారత్ బయోటిక్ సంస్థ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ పరిశీలన కోసమే మోడీ వస్తున్నారనేది నిజమే అయినా... ఈ పర్యటన సరిగ్గా ఈ సందర్భంలో జరిగేలా చూడడం భాజాపాకు ఉపకరించే అవకాశాల్ని కొట్టిపారేయలేం. నిజానికి ప్రధాని , రాష్ట్రపతి వంటి వారి పర్యటనలు కనీసం 2 వారాల ముందుగానే ఖరారవ్వడం ఆనవాయితీ... అయితే ఇంత ఆకస్మికంగా ప్రధాని పర్యటన ఫిక్సవ్వడం భాజాపా ఎన్నికల ఎత్తుగడేనని తెరాస వర్గాలు చేస్తున్న ఆరోపణలు కొట్టిపారేసేలా లేవు. ఏదేమైనా.. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటిదాకా ఎన్నడూ లేనంత సమరోత్సాహంతో కనిపిస్తున్న కాషాయ పార్టీ ఉత్సాహం డిసెంబరు నెల తర్వాత కూడా కొనసాగుతుందా లేదా? అనేది మరో పక్షం రోజుల్లో తేలిపోనుంది.