
తెలుగు జాతికి గర్వకారణమైన మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు, ఉమ్మడి ఆంధప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ లాంటి మహనీయులను రాజకీయ ప్రయోజనాల కోసం రచ్చకీడుస్తారా? అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. జాతీయ రాజకీయాలకు వన్నెతెచ్చిన తెలుగు వెలుగులు వారని కొనియాడారు. హైదరాబాద్ అభివృద్ధిలో టీడీపీ పాత్ర అందరికీ తెలుసు. ఆ పార్టీ వ్యవస్థాపకులైన ఎన్టీఆర్ సమాధిని కూల్చాలని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా అని ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ ప్రజల హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయే పథకాలను ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. ఎన్నో సంస్కరణలు తెచ్చి దేశ ఆర్థిక రంగాన్ని పరుగులు పెట్టించిన మేధావి పీవీ నర్సింహారావు అని కొనియాడారు.