వ్యవసాయ శాస్త్రవేత్త ఎన్.మీరాకు అరుదైన గౌరవం

Hyderabadi scientist appointed tech expert in UN agency

ఆంధప్రదేశ్‍ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాకు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్తకు అంతర్జాతీయ పదవి దక్కింది. భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్‍)లో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్న డాక్టర్‍ షేక్‍ ఎన్‍.మీరాను ఐక్యరాజ్య సమితికి చెందిన అంతర్జాతీయ వ్యవసాయ అభివృద్ధి నిధి (ఐఫాడ్‍)లో డిజిటల్‍ విభాగానికి సీనియర్‍ సాంకేతిక నిపుణుడిగా (ఎస్‍టీఈ) భారత ప్రభుత్వం నియమించింది. ఉత్తర ఆఫ్రికా, తూర్పు ఐరోపా దేశాల ప్రభుత్వాలకు వ్యూహాత్మక సలహాలు ఇవ్వడానికి సీనియర్‍ శాస్త్రవేత్తగా ఆయన పని చేస్తారు.

మొత్తం 20 దేశాల్లో డిజిటల్‍ వ్యవసాయ ప్రాజెక్టులను పర్యవేక్షిస్తారు. కొన్నేళ్లుగా ఆయన వివిధ దేశాల్లో డిజిటల్‍ వ్యవసాయ ప్రాజెక్టులను సలహాలిస్తున్నారు. ఆయనకు గతంలో 12 జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు వచ్చాయి. అవసరమైతే తెలంగాణ, ఆంధప్రదేశ్‍ ప్రభుత్వాలకు కూడా సహకారం అందిస్తానని మీరా తెలిపారు. రైతుల అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలను పూర్తిస్థాయి డిజిటల్‍ విధానంలో అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. కృష్ణా జిల్లా నందిగామలో పుట్టిన మీరా బాపట్ల వ్యవసాయ కాలేజీలో వ్యవసాయ డిగ్రీ చదివారు. ఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధనా సంస్థలో పీజీ, పీహెచ్‍డీ చేశారు.