
ముంబయి పేలుళ్ల గాయాలను యావత్ భారత్ ఎన్నటికీ మరువదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సరికొత్త పంథాలో ఉగ్రవాదంపై భారత్ పోరు కొనసాగిస్తుందన్నారు. ముంబయి పేలుళ్లు జరిగి 12 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఆ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులు, పౌరులకు ప్రధాని మోదీ నివాళులర్పించారు. దేశంలోనే అతిపెద్ద ఉగ్రవాద ఘటన జరిగిన రోజు ఇది. 2018లో పాకిస్థాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు ముంబయిపై దాడి చేశారు. ఆ ఘటనలో ఎంతో మంది భారతీయులతో పాటు విదేశీయులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఆ దాడిలో మరణించిన వారందరికీ నివాళులు అర్పిస్తున్నాను. ముఖ్యంగా ముంబయి వంటి దాడులను సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఉగ్రవాదాన్ని తిప్పికొడుతున్న మన భద్రతా సిబ్బందికి నమస్కరిస్తూన్నా అని మోదీ పేర్కొన్నారు. రాజ్యాంగ వార్షికోత్సవం సందర్భంగా శాసన వ్యవహారాల ప్రిసైడింగ్ ఆఫీసర్లతో గుజరాత్లో జరిగిన సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించారు.