
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శ్వేత సౌధంలో థ్యాంక్స్ గివింగ్ డే కు ముందు జరిగే నేషనల్ థ్యాంక్స్ గివింగ్ టర్కీ వేడుకలో ఉత్సాహంగా పాల్గొన్నారు. రోజ్‌గార్డెన్‌లో జరిగిన కార్యక్రమంలో కార్న్ అనే టర్కీ కోడిని క్షమించి ప్రాణభిక్ష పెట్టారు. దీనితోపాటు కోబ్ అనే కోడికి కూడా స్వేచ్ఛను ప్రసాదించారు. జీవించేందుకు దానిని వదిలేశారు. ఈ రెండు కోళ్లు ఐయోవాస్టేట్ యూనివర్శిటీ సంరక్షణలో తమ శేష జీవితాన్ని గడపనున్నాయి. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో ట్రంప్ ఉత్సాహంగా కనిపించారు. కార్న్ నీకు పూర్తి క్షమాభిక్ష ప్రసాదిస్తున్నాను అని ప్రకటించారు. కోబ్కు కూడా జీవితాన్ని ప్రసాదిస్తున్నట్లు చెప్పారు.
ప్రతి ఏటా థ్యాంక్స్ గివింగ్ డేకు ముందు అధ్యక్షుడికి ది నేషనల్ టర్కీ ఫెడరేషన్ రెండు భారీ టర్కీ కోళ్లను బహుకరిస్తుంది. వీటిని శ్వేతసౌధం విందులోకి వినియోగించరు. జార్జి డబ్ల్యూబుష్కు ముందు అధ్యక్షులు చాలా వరకు బహుమతిగా వచ్చే టర్కీకోళ్లను విందులో వినియోగించేవారు. జాన్ ఎఫ్ కెనడీ, రిచర్డ్ నిక్సన్, జిమ్మీ కార్టర్ వంటి వారు మాత్రం వీటిని తినకుండా వదిలేయడమో.. లేదా అసలు స్వీకరించకపోవడమో చేశారు. రోనాల్డ్ రీగన్ స్వీకరించినా, వాటిని జీవించేందుకు వదిలేశారు. 1989లో అధికారికంగా జార్జి హెచ్ డబ్ల్యూ బుష్ అధ్యక్ష క్షమాభిక్ష అనే పదాన్ని వాడి ఆ టర్కీ కోడిని జీవించేందుకు వదిలేశారు. అప్పటి నుంచి ఇది సంప్రదాయంగా కొనసాగుతోంది.