
విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఆహార పదార్థాలకు జన్యు మార్పిడివి కాదు అన్న ధ్రువీకరణ పత్రం సమర్పించాలన్న భారత్ నిర్ణయంపై అమెరికా అభ్యంతరం తెలిపింది. దీనిపై ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)కు ఫిర్యాదు చేసింది. ధ్రువీకరణ సమర్పణను రానున్న జనవరి ఒకటో తేదీ నుంచి తప్పనిసరి చేస్తూ భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డస్ అథారిటీ ఆఫ్ ఇండియా-ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఆదేశాలు ఇచ్చింది. గోధమలు, బియ్యం, బంగాళదుంపలు, టమాటా సహా 24 పంటలకు దీన్ని వర్తింపజేస్తూ ఆగస్టు నెలలో ఉత్తర్వులు జారీ చేసింది.
ఎగుమతి చేసే దేశాలపై ఇది అనవసర భారం మోపుతుందని అమెరికా ఆరోపించింది. సాంకేతికంగా సంప్రదాయ పంటలకు, జన్యుమార్పిడి పంటలకు మధ్య ఎలాంటి తేడాలు లేవని, కానీ భారత్ ఇవి సురక్షితమైనవి కావంటోందని తెలిపింది. దీనిపై భారత్ వివరణ ఇస్తూ మానవ వినియోగం కోసం ఉపయోగించే జన్యుమార్పిడి పంటలను వద్దంటున్నామే తప్ప, ఇతర అవసరాల కోసం ఉపయోగించేవాటిని కాదని సృష్టం చేసింది.