
పార్టీలు ప్రత్యక్షంగా పొత్తులు పెట్టుకోవడం, సీట్లు పంచుకోవడం. కలిసి పోటీ చేయడం.. ఇవన్నీ మనకి తెలిసినవే. గత కొంతకాలంగా జరుగుతున్నవే. అయితే ఇటీవల రాజకీయ పొద్దుపొడుపులో కొత్త రకం పొత్తులు పొడుచుకొస్తున్నాయి. ఈ పొత్తులు ఏ స్థాయిలో ఉంటున్నాయంటే సాధారణ ప్రజలకు నమ్మశక్యం కాకుండా ఆ పొత్తు గురించి వినగానే ఆశ్చర్యపోయేలా ఉంటున్నాయి.
ఈ పొత్తులు ఓ రకంగా చెప్పాలంటే బయటకు కనపడని ఎత్తులు. బహిరంగంగా కత్తులు దూసుకుంటూ అనధికారికంగా పెట్టుకునే పొత్తులు. గత కొన్నేళ్లుగా బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన ఈ తరహా అనఫియల్ అలయన్స్లపైనే ఇప్పుడు రాజకీయవర్గాల్లో చర్చోపచర్చలు నడుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో గత అసెంబ్లీ ఎన్నికల నుంచి ఈ తరహా ఎత్తుగడలకి బాగా ఊపొచ్చింది. ఆ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షపార్టీతో కేంద్రంలో ఉన్న అధికార పార్టీ అనధికారిక పొత్తు పెట్టుకుందని గట్టిగానే ప్రచారం జరిగింది. ప్రతిపక్ష వైసీపీ అధికారంలోకి రావడానికి ఆ పొత్తు ఇతోధికంగా ఉపకరించిందనేది తర్వాత తర్వాత బహిరంగ రహస్యమే.
సంప్రదాయంగా తమకున్న ఓటు బ్యాంకులకు గండి పడకుండా పార్టీలు ఈ తరహా కొత్త రకం పొత్తులకు దిగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ రకమైన పొత్తులు పెట్టుకున్నపార్టీలు ‘లోకం కోసం తిట్టు లోపాయికారీగా జట్టు’ అన్నట్టుగా వ్యవరిస్తుంటాయి. ఈ నేపధ్యంలో గ్రేటర్ ఎన్నికల సందర్భంగా ఇప్పుడు అదే తరహా విచిత్రమైన పొత్తు గురించి ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అత్యంత కీలకమైన హైదరాబాద్ స్థానిక ఎన్నికలు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ ఎన్నికల్లో గెలుపు అధికార పార్టీ అయిన తెరాసకు చాలా అవసరం. తెలంగాణకు రాజధాని నగరంలో తమ పట్టు సడలడం అనేది ఆ పార్టీకి ఎంత మాత్రం మింగుడుపడే అంశం కాదు.
మరోవైపు దుబ్బాక విజయంతో అకస్మాత్తుగా ప్రతిపక్ష పార్టీ హోదాకు ఎదిగిపోయిన భారతీయ జనతాపార్టీ ఆ దూకుడును కొనసాగించాలని కృతనిశ్చయంతో ఉంది. నాయకత్వ లేమితో సతమతమవుతున్న కాంగ్రెస్ పనైపోయిందనే ఉత్సాహంతో.. గ్రేటర్లో తెరాసను చావు దెబ్బ కొట్టాలని తీర్మానించుకుంది. దుబ్బాక ఓటమితో ఖంగుతిన్న తెరాస కూడా అప్రమత్తమైంది. జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా భంగపాటు తప్పదని గ్రహించి నీటి పన్ను రద్దు సహా నగరవాసులకు పలు వరాలు కూడా ప్రకటించేసింది.
మరో నాలుగైదు రోజుల్లో పోలింగ్ జరగనుండగా భాజాపా, తెరాస పార్టీలు నువ్వా నేనా అన్నట్టుగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. అదే సమయంలో కాషాయం పార్టీ వైపు నుంచి రకరకాల కవ్వింపు వ్యాఖ్యానాలు మొదలయ్యాయి. ముఖ్యంగా మత భావాలను రెచ్చగొట్టేలా నేతల ప్రసంగాలు సాగుతున్నాయి. మరోవైపు ఇలాంటి స్పీచ్‌లకు కేరాఫ్‌గా పేరుపడ్డ ఎంఐఎం నాయకులు కూడా తమ వంతగా నోటికి పనిచెబుతున్నారు. పాతబస్తీపై సర్జికల్ స్ట్రయిక్ చేస్తాం, దారుస్సలాం కూల్చేస్తాం అంటూ భాజాపా నేతలు ఊపగిపోతుంటే ఎన్టీయార్, పివి సమాధులు కూల్చాలంటూ ఎంఐఎం నేతలు మాటల తూటాలు వదుల్తున్నారు.
గత కొంత కాలంగా హైదరాబాద్‌లో ఈ తరహా ప్రకటనలు గానీ, ప్రసంగాలు గానీ భాజాపా వైపు నుంచి పెద్దగా వినిపించలేదు. ఒక్క గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మాత్రమే తరచుగా ఇలాంటి విషయాల్లో దూకుడుగా ఉండేవారు. అయితే అకస్మాత్తుగా భాజాపా రాష్ట్ర నేతలు స్వరాలు పెంచి గ్రేటర్ ఎన్నికల్లో ఎంఐఎంని టార్గెట్ చేయడం విశేషం. అదే విధంగా ఎంఐఎం నేతలూ ప్రతిస్పందిస్తుండడం కనిపిస్తోంది. ఈ నేపధ్యంలోనే నగరంలో భాజాపా–ఎంఐఎం మధ్య ఒక అనధికారిక పొత్తు పొడిచినట్టు వినవస్తోంది. ఇటీవల ముగిసిన బీహార్ ఎన్నికల్లో ఇదే రకమైన పొత్తుల ఎత్తులు అనుసరించిన ఇరు పార్టీలు అక్కడ విజయ వంతం కావడంతో అదే వ్యూహాన్ని హైదరాబాద్‌లో కూడా అమలు చేస్తున్నట్టు సందేహాలు రేగుతున్నాయి. ఎంఐఎం అగ్రనాయకత్వంతో భాజాపా అగ్రనాయకత్వం ఇప్పటికే ఒక అంగీకారానికి వచ్చిందని, ఎవరి సంప్రదాయ ఓటు బ్యాంకులను వారు పటిష్టం చేసుకోవడం, తటస్థ ఓటర్లను కూడా సంప్రదాయ ఓటింగ్ వైపు మళ్లించడం ద్వారా తెరాస ఓట్లకు గండి కొట్టాలనే ప్లాన్‌ను ఈ ఇరు పార్టీలు ఎంచుకున్నాయని అంటున్నారు.
ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల్లో ఈ అనధికారపొత్తు అనుమానాలే హాట్ టాపిక్‌గా మారాయి. అదే నిజమైతే ఈ వ్యూహాన్ని తెరాస ఎలా చిత్తు చేస్తుందో హైదరాబాద్ ఓటర్లను ఎలా మెప్పించి, ఒప్పిస్తుందో వేచి చూడాల్సి ఉంది.