
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్ ఖండించారు. తెలుగు ప్రజల గౌరవాన్ని నిలబెట్టిన ఆ ఇద్దరు నేతలపై అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు అనుచితమన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఒకరు ప్రధానిగా, మరొకరు సీఎంగా సుదీర్ఘకాలం ప్రజాసేవలో ఉన్నారని పేర్కొన్నారు. అటువంటి మహా నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం గర్హనీయమన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి మాటలకు చోటులేదని చెప్పారు. అక్రమ కట్టడాలను కూల్చేస్తామంటున్న రాష్ట్ర ప్రభుత్వం దుమ్ముంటే హుస్సేన్‌సాగర్‌పై ఉన్న స్మారకాలను కూల్చివేయాలంటూ తాజాగా అక్బరుద్దీన్ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో పీవీ, ఎన్టీఆర్‌పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.