తిరుపతి ఫలితం... రిఫరెండమా? కాదా?

Tirupati Lok Sabha By Election

వైసీపీ ఎంపి బల్లి దుర్గాప్రసాద్‌ ఆకస్మిక మరణంతో జరుగనున్న తిరుపతి లోక్‌సభ స్థానానికి జరుగుతున్న ఉపఎన్నిక ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక జరుగుతున్న తొలి అతిపెద్ద రాజకీయ సమరంగా చెప్పాలి. 

రిఫరెండమ్‌ అనొచ్చా?

ఏడాదిలోనే మంచి సిఎంగా పేరు తెచ్చుకుంటానని మాట ఇచ్చిన వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఏడాదిన్నర పైగా తన దైన ప్రత్యేక శైలిలో పాలన చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఆయన నిర్ణయాలతో వ్యతిరేకిస్తూ రాష్ట్రం వెనక్కి పోతోందంటూ ప్రతిపక్షం దుమ్మెత్తి పోస్తోంది. మరోవైపు అధికార విపక్ష వాదనల్లో ఏది నిజమో తేల్చాల్సిన బాధ్యతను మీడియా సరిగా నిర్వర్తించలేకపోతోంది. అత్యధిక శాతం మీడియా కూడా పార్టీల వారీగా విడిపోయింది. తమ తమ పార్టీలకు మద్ధతు పలుకుతోంది. ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో నిజంగా ప్రజలు ఏమనుకుంటున్నారు? కొత్త ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారా? సానుకూలంగా ఉన్నారా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరి..నిజంగా ఈ ఎన్నిక ఫలితాలు ఈ ప్రశ్నలకు సమాధానం అవుతాయా? 

కావచ్చా? కాకపోవచ్చా?

ఉపఎన్నిక ఏదైనా సరే ఫలితాలు సహజంగా అధికార పార్టీకి అనుకూలంగా ఉండడం తెలిసిందే. ఓటర్లలో ఉప ఎన్నిక కూ, ప్రధాన ఎన్నికకూ మధ్య వ్యత్యాసంపై పూర్తి అవగాహన ఉందనేది గతంలో జరిగిన ఎన్నో ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. అందుకే సాధారణంగా ఉప ఎన్నిక ను రిఫరెండెంగా పేర్కొనడానికి అధికార పార్టీలు సై అంటుంటాయి, అదే సమయంలో విపక్షాలు మాత్రం విముఖత చూపుతాయి. 

అయితే ఆంధ్రప్రదేశ్‌ విషయానికి వచ్చేసరికి దాన్నే ప్రామాణికంగా తీసుకోలేం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఇప్పుడో కొత్త రకమైన పాలనానుభవాన్ని చవిచూస్తోంది. సాధారణంగా ఒక పార్టీ ఓడిపోయి మరో పార్టీ గెలిచి  కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాక ఒకటో రెండో కొత్త నిర్ణయాలు తప్ప దాదాపు అన్నీ పాత ప్రభుత్వ నిర్ణయాల మేరకే కొనసాగించడం  జరుగుతుంటుంది. అయితే వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయిన దగ్గర్నుంచి పరిశీలిస్తే... ఆయన తీసుకున్న నిర్ణయాల్లో 80శాతం అనూహ్యమైనవి, ఎవరూ ఊహించనివి. ఆయన దాదాపుగా పాత ప్రభుత్వ నిర్ణయాలన్నీ తిరగదోడారు. వాటిలో అత్యధిక శాతం రద్దు చేశారు. అంతేకాదు ఊహించనన్ని సంక్షేమ పధకాలు అమలు చేశారు. గ్రామ సెక్రటేరియట్స్‌ లాంటి కొత్త కొత్త కార్యక్రమాలు చేపట్టారు. వీటన్నింటికన్నా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ఎంతో కీలకమైన రాజధాని విషయంలో కూడా అనూహ్య నిర్ణయాలు తీసుకున్నారు.

దేశంలో ఎప్పుడూ ఎక్కడా కని వినని విధంగా 3 రాజధానుల ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అలాగే రివర్స్‌ టెండరింగ్‌ విధానం, ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం అమ్మకాలతో పాటు మద్యం రేట్లు ఆకాశాన్నంటేలా పెంచడం... ఇలా ఎన్నో మార్పు చేర్పులు చేశారు. దీంతో ఆయన పాలనా తీరు విపరీతంగా చర్చనీయాంశం అవుతోంది. తాజాగా న్యాయ వ్యవస్థతో సైతం తలపడడం ద్వారా ఆయన తనదైన వివాదాస్పద పంధాను కొనసాగిస్తూన్నారు. ఈ నేపధ్యంలో ఆయన కొత్త నిర్ణయాలు,పద్ధతులను తీవ్రంగా వ్యతిరేకించేవారికి తమ అభీష్టాన్ని వెల్లడించేందుకు తిరుపతి ఉప ఎన్నిక ఒక అవకాశం కావచ్చు కాబట్టి ఈ తిరుపతి ఎన్నిక ఫలితాన్ని పూర్తిగా రిఫరెండం కాదని కొట్టేయడానికి వీల్లేదు. 

అలాగని దీన్నే జగన్‌ పాలనపై నిఖార్సైన తీర్పుగా కూడా భావించలేం. ఎందుకంటే... మిగిలిన పరిస్థితులెలా ఉన్నా అధికార పార్టీకి  ఉప ఎన్నికల్లో  కొంత మేరకు ఎడ్జ్‌ ఉండడం సహజం. అధికారంలో ఉండడం, వ్యయానికి వెనుకాడే పరిస్థితి లేకపోవడం, శ్రేణుల్లో ఉత్సాహం...వంటి ఎన్నో సానుకూల అంశాలు ఎన్నికల్లో గెలుపును సులువు చేసే అంశాలే. ఏదేమైనా ఈ ఎన్నికకు సంబంధించి విపక్షాల పొత్తులు కూడా తేలాల్సి ఉంది. ఎన్నిక పూర్తియి, ఫలితం వెలువడాలి. అప్పుడు కూడా గెలుపోటములను బట్టి పాలనపై ప్రజల ఆలోచనను నిర్ణయించడం సాధ్యం కాదు. ఓటింగ్‌ సరళి, పార్టీలకు వచ్చిన ఓట్లు,  మెజారిటీలో  హెచ్చుతగ్గులు, .. వీటన్నింటి బట్టి మాత్రమే కొత్త ప్రభుత్వం పట్ల ప్రజల ఆలోచనలెలా ఉన్నాయనేదాన్ని  విశ్లేషించడం, సూత్రప్రాయంగా ఒక అభిప్రాయం ఏర్పరచుకోవడం సాధ్యపడుతుంది.