టీఆర్ఎస్ మేనిఫెస్టోను విడుదల చేసిన సీఎం కేసీఆర్

CM KCR release TRS manifesto for GHMC elections

హైదరాబాద్‍ ప్రజలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‍ వరాల జల్లు కురిపించారు. 20 వేల లీటర్ల లోపు వాడుకునే వారికి డిసెంబర్‍ నెల నుంచి ఉచితంగా తాగునీరు సరఫరా అందించనున్నట్లు ప్రకటించారు. వినియోగదారులు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. పేదలు, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతివారు నివసించే ఈ నగరంలో ప్రజల మీద కొంత భారాన్ని తీసేయాలని యోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. దీని ద్వారా దాదాపు 97 శాతం మందికి లబ్ది చేకూరనున్నట్లు వెల్లడించారు. గ్రేటన్‍ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్‍ టీఆర్‍ఎస్‍ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెలూన్లు, లాండ్రీలు, దోబీఘాట్‍లకు డిసెంబర్‍ నుంచి ఉచిత విద్యుత్‍ అందిస్తామన్నారు. హైదరాబాద్‍ నగరాన్ని ముందుకు తీసుకుపోయే అజెండాను టీఆర్‍ఎస్‍ ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. ఇందులో చాలావరకు సఫలీకృతం అయ్యామన్నారు. ఇంకా చేయాల్సింది ఉందన్నారు. అన్నిటికిమించి జంట నగరాల్లో నేడు మంచినీటి కొట్లాటలు లేవన్నారు.

గతంలో శివారు ప్రాంతాల్లో వారం రోజులకు, పది రోజులకు, పద్నాలుగు రోజులకు నీళ్లు వచ్చే పరిస్థితులను మస్తు చూశామన్నారు. వాటర్‍ ట్యాంకర్‍ల వద్ద యుద్ధాలను చూశామన్నారు. అవన్నీ కూడా మిషన్‍ భగీరథ పుణ్యమా అని కనుమరుగై పోయాయన్నారు. కేవలం నగరం వరకే కాకుండా ఔటర్‍ రింగ్‍ రోడ్డు లోపల ఉండేటువంటి హెచ్‍ఎండీఏ ప్రాంతానికి కూడా పుష్కలంగా మంచినీటి సరఫరా జరుగుతున్నట్లు తెలిపారు.

హైదరాబాద్‍ ప్రజలు నీళ్ల కోసం కొట్లాడుకునే రోజులను పొగొట్టినట్లు చెప్పారు. ప్రస్తుతానికే కాకుండా భవిష్యత్తు తరాలాక్షేమం కోసం ఆలోచించి రాబోయే 50 ఏండ్లకు సరిపడా తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని రిజర్వాయర్ల నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో భాగంగానే కేశవాపురంలో రిజర్వాయర్‍ నిర్మాణానికి అన్ని రకాల అనుమతులు తీసుకొచ్చినట్లు అతి త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

 


                    Advertise with us !!!