
ప్రజా రవాణా వాహనాల్లో మహిళల రక్షణ కోసం రూపొందించిన అభయం యాప్ను ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రయాణ సమయంలో మహిళలు, చిన్నారుల రక్షణకోసం ఈ యాప్ దోహదపడుతుందని చెప్పారు. ఆటోలు, ట్యాక్సీలు, ఇతర ప్రయాణ వాహనాల్లో అభయం యాప్ పరికరాన్ని అమర్చనున్నట్టు తెలిపారు. తొలి విడతగా విశాఖలో వెయ్యి ఆటోల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్టు వెల్లడించారు.
వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి 5 వేల వాహనాలకు, జులై 1 నాటికి 50 వేల వాహనాలకు నవంబరు నాటికి లక్ష వాహనాలకు అభయం యాప్ను విస్తరిస్తామని చెప్పారు. ప్రయాణంలో మహిళలకు ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే పానిక్ బటన్ నొక్కితే పోలీసులకు సమచారం అందుతుందని వివరించారు. మహిళల భద్రతకు అనేక చర్యలు తీసుకుంటున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. మహిళలకు ఆర్థిక స్వావలంభన కల్పించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం వివరించారు.
నామినేటెడ్ పదవులు, కాంట్రాక్టుల్లో 50 శాతం మహిళలకు ఇవ్వాలని చట్టం చేశామని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. దేశంలోనే తొలిసారిగా దిశ బిల్లును రాష్ట్రంలో ప్రవేశపెట్టామని వెల్లడించారు. దిశ యాప్ను పోలీసు శాఖ నిర్వహిస్తే, అభయం యాప్ను రవాణాశాఖ నిర్వహిస్తుందని సృష్టం చేశారు. ఉబర్, ఓలా ఆటోలు, ట్యాక్సీల్లోనూ ఇదే తరహా పరికరాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.