
తానా ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది అందరి దృష్టి తానా అధ్యక్ష పదవికి పోటీ పడే అభ్యర్థులు ఎవరా అన్నదానిపై పడుతుంది. తానా సభ్యులతోపాటు, ఇతర తెలుగు సంఘాలవారు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎన్నారైల బంధువులు, మిత్రులు ఇతరుల్లో కూడా తానా అధ్యక్ష పదవికి ఎవరు పోటీ పడుతున్నారో, ఎవరు గెలుస్తారో అన్న విషయమై ఆసక్తిగా తెలుసుకుంటారు. ఏడూ-ఎనిమిది ఎల్ళ్ల క్రితం వరకు తానా అధ్యక్ష పదవి ఎన్నిక సాదాసీదాగా నామమాత్రంగా సాగేవి. దానికితోడు తానాలో కార్యదర్శి పదవిని చేపట్టినవారు అధ్యక్షునిగా ఎన్నికవడం సంప్రదాయంగా ఉండేది. ఇతర ఎగ్జిక్యూటివ్ కమిటీ పదవుల్లో కూడా ఎన్నికలు పెద్దగా ఉండేవి కావు. కింది పదవులను నిర్వహించిన వారు తరువాతి పదవిని చేపట్టడం జరిగేది. అందువల్ల అప్పుట్లో ప్రెసిడెంట్‌గా ఎవరూ వస్తారన్న ఆసక్తి, ఊహగానాలు లేవు. కాలం మారింది. కాలంతోపాటు అన్నీచోట్లా మార్పులు వచ్చినట్లు తానాలో కూడా మార్పులు వచ్చాయి. పెద్దల ఆధిక్యం తగ్గింది. యువతరం ఆధిక్యత పెరిగింది. దీంతో ఎన్నికల సరళిలో కూడా మార్పులు వచ్చాయి.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో అధ్యక్ష ఎన్నికలపై ఆ ప్రభావం బాగా పడింది. అప్పటి నుంచి కార్యదర్శి పదవిలో ఉన్నవారు ఆటోమేటిక్‌గా అధ్యక్షునిగా ఎన్నికయ్యే వ్యవహారానికి తెరపడింది. దీంతో అధ్యక్ష పదవికి పోటీపడే వారి సంఖ్య పెరిగిపోయింది. దాంతో ఎన్నికలు అనివార్యమైంది. దీంతో తానా పెద్దలు జోక్యం చేసుకుని అభ్యర్థుల మధ్య రాజీ కుదిర్చి ఎన్నికలు ప్రశాంతంగా, ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నిస్తూ వస్తున్నారు. ఒక్కోసారి అభ్యర్థుల పట్టుదల వల్ల తానా ఎన్నికలు బహిరంగ రచ్చకు దారి తీసిన సంఘటనలు కూడా ఈ మధ్య జరిగాయి.
తానాలో రెండేళ్ళకోమారు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి ఎన్నికలు జరుగుతాయి. ఇప్పుడు ఎన్నికైన ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రెండేళ్ళ తరువాత ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ వైస్‌ప్రెసిడెంట్‌గా ఉన్న అంజయ్య చౌదరి లావు వచ్చే సంవత్సరం జరిగే తానా మహాసభల సమయంలో అధ్యక్షునిగా బాధ్యతలను స్వీకరిస్తారు. అదే సమయంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన వ్యక్తి, ఆయనతోపాటు ఇతర కార్యవర్గ సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రస్తుతం జరిగే ఎన్నికలు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి జరగనున్నాయి. కాకపోతే అందరూ అధ్యక్ష ఎన్నికలుగానే దీనిని పేర్కొంటారు.
తాజాగా 2021 సంవత్సరంలో జరిగే అధ్యక్ష ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగేలా కనిపించడం లేదు. అభ్యర్థుల మధ్య పోటీ ఉండేటట్లుగానే ప్రస్తుతానికి కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఈ అధ్యక్ష పదవికి దాదాపు ఆరుగురు పోటీపడుతున్నారు.
సాధారణంగా తానాలో అధ్యక్ష పదవికి పోటీపడే వ్యక్తులు గతంలో కార్యదర్శిగా, ఫౌండేషన్ చైర్మన్‌గా, కాన్ఫరెన్స్ కన్వీనర్‌గా పదవులు నిర్వహించినవారు ఉంటే మంచిదని ఒక భావన వుంది. అనుభవం ఉన్నవారు అధ్యక్ష పదవుల్లో ఉంటే కార్యక్రమాలు సజావుగా నడుస్తాయని భావించతమ్ సబబే! ఎందుకంటే వారు పైన చెప్పిన పదవులను నిర్వహించినప్పుడు తానాలో ఎవరు బాగా పనిచేస్తారో, ఎవరు పనిచేయరో, ఎవరికి ఏ బాధ్యతలు అప్పగిస్తే విజయవంతమవుతుందో, ఎవరూ ఏ పనిచేయగలరోనన్న విషయాలపై అవగాహనను వారు కలిగి ఉంటారని, అందువల్ల వారు తానా అధ్యక్ష పదవిలో ఉంటే సంఘాన్ని సరైన దిశలో నడిపించగలరని భావిస్తారు. అందుకే అనుభవానికి పెద్దపీట వేస్తూ తానా అగ్ర నాయకత్వం నిర్ణయాలు తీసుకునేవారు.
కరోనా సమయం చాలామందికి అనుకూలంగా మారిందా?
అధ్యక్ష పదవికి పోటీ పడాలనుకున్న అభ్యర్థులకు కరోనా సమయం బాగా ఉపయోగపడిందని, ఈ సమయంలో వారు చేసిన సేవా కార్యక్రమాలతో, వారి సమర్థత, సేవాగుణం అందరికీ తెలిసిందంటున్నారు.
కరోనా సమయంలో ఏ తెలుగు సంఘం చేయనంతగా తానాలోని నాయకులు సేవా కార్యక్రమాలను ముమ్మరంగా చేశారు. ఎంతోమంది పేదలను, అనాథ ఆశ్రమాలను ఆదుకున్నారు. మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్ళి కరోనా సహాయం అందించారు. అన్నదానం కార్యక్రమాలను రోజులతరబడి చేస్తూ వచ్చారు. దానికితోడు తానా కార్యక్రమాలను కరోనా కారణంగా ఆన్లైన్ వేదికగా నిర్వహించడంతోపాటు ప్రపంచంలోని తెలుగు వారిని, తెలుగు సంఘాలను తమ కార్యక్రమంలో భాగస్వాములను చేయడం ద్వారా ప్రపంచంలోని తెలుగు సంఘాల్లో తానా ప్రతిష్ట మరింత పెరిగేలా చేశారు. చాలామంది సభ్యులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుండటం వల్ల తానా సేవా కార్యక్రమాల్లో ముమ్మరంగా పాల్గొనేందుకు అవకాశం కలిగింది.
ప్రెసిడెంట్ జయ్ తాళ్ళూరి, ఫౌండేషన్ చైర్మన్ నిరంజన్ శృంగవరపు, బోర్డ్ చైర్మన్ హరీష్ కోయ ఒక్కమాట మీదే ఉండటం వలన అధ్యక్షుడు జయ్ తాళ్ళూరి తన కార్యవర్గ సహచరులకు సలహాలు, సూచనలు చేసి సేవా కార్యక్రమాలను, ఇతర కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు.
వచ్చే కార్యవర్గంలో ఉండాలనుకునేవారు తప్పనిసరిగా ఇప్పుడు సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని, తానా కార్యక్రమాలన్నింటిని విజయవంతం చేయాలని అలా పనిచేసే వారికే సభ్యుల నుంచి, తానా పెద్దల నుంచి మద్దతు ఉంటుందని బహిరంగంగానే జే తాళ్ళూరి పేర్కొనడంతో ఇప్పుడు ఉన్న కార్యవర్గ సభ్యులంతా వివిధ కార్యక్రమాల్లో ముమ్మరంగా పాల్గొని విజయవంతం చేశారు.
ప్రస్తుతం ఎవరు బరిలో ఉన్నారు?
తానా అధ్యక్ష పదవికి ప్రస్తుతం ఆరుగురు బరిలో ఉన్నట్లు తెలుస్తోంది. నిరంజన్ శృంగవరపు, నరేన్ కొడాలి, శ్రీనివాస్ గోగినేని, రవి పొట్లూరి, మురళి వెన్నం, సతీష్ వేమూరి బరిలో ఉన్నట్లు సమాచారం.
నిరంజన్ శృంగవరపు
ప్రస్తుతం తానా ఫౌండేషన్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. తానాలో అనేక సంవత్సరాలుగా డిట్రాయిట్ నుంచి క్రియాశీలకపాత్రను నిరంజన్ శృంగవరపు పోషిస్తున్నారు. వివిధ కమిటీల్లో సభ్యునిగా ఉంటూ తానా అభివృద్ధిలో పాలుపంచుకున్నారు. మెంబర్షిప్ వెరిఫికేషన్, బైలాస్ కమిటీ, తానా ఫౌండేషన్ ట్రెజరర్‌గా, ఫౌండేషన్ చైర్మన్‌గా వివిధ పదవులను ఆయన నిర్వహించారు. 2015 డిట్రాయిట్లో జరిగిన తానా కాన్ఫరెన్స్‌లో నాదెళ్ల గంగాధర్ కాన్ఫరెన్స్ చైర్మన్‌గా ఉన్నప్పుడు నిరంజన్ శృంగవరపు కాన్ఫరెన్స్ ట్రెజరర్‌గా ఉన్నారు. ఆ కాన్ఫరెన్స్ నిర్వహణలో సమర్థవంతంగా పనిచేశారని మంచి పేరు తెచ్చుకున్నారు. ఐటీ ఎంట్రప్రెన్యూరర్‌గా ఉంటూనే ఆయన సేవా కార్యక్రమాలను చేస్తున్నారు. తానాలో ఎన్నో కార్యక్రమాలకు ఆయన విరాళాలను ఇచ్చారు. కోవిడ్ సమయంలో తానా సేవా కార్యక్రమాలకోసం లక్షడాలర్లను విరాళంగా ఇచ్చి అందరిచేత శభాష్ అనిపించుకున్నారు. కోవిడ్ సమయంలో తానాఫౌండేషన్ చైర్మన్‌గా తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది రూపాయలతో కార్యక్రమాలను చేశారు. తానా అధ్యక్షుడు జయ్ తాళ్ళూరి మద్దతు నిరంజన్‌కు ఉందని అనుకుంటున్నారు.
నరేన్ కొడాలి
వాషింగ్టన్ డీసి నుంచి తానాకి గత 20 ఏళ్ళుగా సేవలను అందిస్తున్న డా. నరేన్ కొడాలి ఒక విద్యావేత్తగా, కలిసిపోయే వ్యక్తిగా అందరిదగ్గర మంచిపేరు తెచ్చుకున్నారు. తానా బోర్డ్‌కి చైర్మన్‌గా కూడా ఆయన వ్యవహరించారు. బోర్డ్ మీటింగ్ నిర్వహించడంలోనూ, మీటింగ్ మినిట్స్ తయారు చేయడంలోనూ, వాటిని ఆచరణలో పెట్టడంలో ఆయన సమర్థవంతమైన పాత్రను పోషించారు.
2017లో వాషింగ్టన్ డీసీలో జరిగిన తానా మహాసభలు విజయవంతంగా జరపడంలో కాన్ఫరెన్స్ చైర్మన్‌గా డా. నరేన్ కొడాలి ఎంతో కృషి చేశారని పలువురు పేర్కొంటారు. డా. నరేన్ కొడాలికి తానా నాయకుడు, మాజీ అధ్యక్షుడు సతీష్ వేమన మద్దతు ఉందని చెబుతున్నారు.
శ్రీనివాస్ గోగినేని
డిట్రాయిట్ నుంచి ఎన్నో సంవత్సరాలుగా తానాలో సేవలందిస్తున్న శ్రీనివాస్ గోగినేని ఈసారి కూడా అధ్యక్ష పదవి బరిలో ఉన్నట్లు చెబుతున్నారు. శ్రీనివాస్ మొదటి నుంచి కూడా తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పడంలోనూ, చెప్పిన పనులను చేసి చూపించడంలో ముందుంటారని అంటారు. శ్రీనివాస్ గోగినేని తానా ఫౌండేషన్ చైర్మన్‌గా తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించారని, అమెరికాలో ప్రతి పట్టణంలోనూ 5కె రన్ చేసి ప్రతిచోట్లా తానాఫౌండేషన్ పేరును వ్యాపింపజేశారని ఎంతోమంది ఆయనను ప్రశంసిస్తుంటారు. గతంలో ఓసారి శ్రీనివాస్ గోగినేని తానా అధ్యక్ష పదవికి పోటీపడి గెలవలేకపోయారు. అయితే గెలుపుఓటములు సహజమే అయినా, తరువాత జరిగిన తానా కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొనలేదు.
రవి పొట్లూరి
ఫిలడెల్ఫియా నుంచి గత 25 ఏళ్ళుగా తానాకి తన సేవలు అందిస్తూ, ప్రస్తుతం కార్యదర్శి పదవిలో ఉన్న రవి పొట్లూరి కూడా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న వారిలో ఒకరిగా ఉన్నారు. తానా కార్యవర్గంలో అన్నీ పదవులు నిర్వహించి, మంచిపేరును తెచ్చుకున్న వ్యక్తిగా రవి పొట్లూరికి గుర్తింపు ఉంది. రాబోయే ఎన్నికలలో రవి పొట్లూరి అధ్యక్ష ఎన్నికలకు ముందుగానే ఆ పదవికోసం ప్రయత్నాలు చేశారు. ముందుగానే ఆ పదవికి ఖర్చీప్ వేశారు. అయితే తానా పెద్దలు నాదెళ్ళ గంగాధర్, జయరామ్ గారు ఇచ్చిన సలహాతో 2021లో జరిగే తానా కాన్ఫరెన్స్‌కి కన్వీనర్‌గా బాధ్యతలు తీసుకుని తన అధ్యక్ష పదవికి పోటీ చేయాలన్న ఆలోచనను వాయిదా వేసుకున్నారు. అయితే కోవిడ్ కారణంగా కాన్ఫరెన్స జరుగుతుందో లేదో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో కొందరు మిత్రులు కాన్ఫరెన్స్ లేని కారణంగా ప్రెసిడెంట్ పదవికి పోటీ చేయమని రవి పొట్లూరిపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రవి పొట్లూరి మాత్రం తానా పెద్దలు ఇచ్చిన సలహా మేరకు ప్రెసిడెంట్ పదవికి ప్రయత్నించడం లేదని చెబుతున్నట్లు సమాచారం.
కరోనా సమయంలో దాదాపు 30,000 మందికి రవి పొట్లూరి అన్నదానం కార్యక్రమం నిర్విరామంగా చేశారు. కోవిడ్ ప్రారంభం నుంచి ఆయన సేవా కార్యక్రమాలతో ఎంతోమంది పేదలను ఆదుకున్నారు. పుష్కరాల సమయంలో కూడా ఆయన భక్తులకు అన్నదానం చేస్తున్న సంగతి తెలిసిందే.
మురళి వెన్నం
డల్లాస్ నుంచి తానా సేవా కార్యక్రమాల్లో ముమ్మరంగా పాల్గొనడంతోపాటు అటు పెద్దలతోనూ, ఇటు సభ్యులతోనూ కలిసిపోతున్న మురళీవెన్నం ఈసారి కూడా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా అధ్యక్ష పదవికి పోటీపడి పెద్దల మాటతో వెనక్కి తగ్గిన మురళీ వెన్నం ఈసారైనా తనకు అవకాశం ఇప్పించాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. 2013లో ప్రెసిడెంట్‌గా ఉన్న ప్రసాద్ తోటకూర ఆధ్వర్యంలో డాలస్‌లో జరిగిన తానా కాన్ఫరెన్స్‌కు కన్వీనర్‌గా మురళీ వెన్నం వ్యవహరించారు. ఆ కాన్ఫరెన్స్ విజయంలో మురళి వెన్నం కీలకపాత్ర పోషించారు. 2019-21కి ఫౌండేషన్ ట్రస్టీగా ఉంటున్నారు. ఫౌండేషన్ కార్యక్రమాల్లో కూడా ఆయన ముమ్మరంగా పాల్గొన్నారు.
సతీష్ వేమూరి
ప్రస్తుతం తానా ట్రెజరర్‌గా ఉన్న సతీష్ వేమూరి కూడా అధ్యక్ష పదవికి పోటీపడుతున్నవారిలో ఉన్నారని చెబుతున్నారు. 2009-11లో జయరామ్ కోమటి తానాకు ప్రెసిడెంట్‌గా ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు 10 సంవత్సరాలు తరువాత తానా అధ్యక్ష పదవి వెస్ట్‌కోస్ట్ వాళ్ళకి దక్కాలని, ఇక్కడ నుంచి ప్రస్తుతం తానాకి కీలకమైన ట్రెజరర్ పదవిలో ఉన్న సతీష్ వేమూరిని అధ్యక్షునిగా ఎంపిక చేయాలని ఇక్కడ ఉన్న తానా అభిమానులు కోరుతున్నారు. కాగా 5-6 ఏళ్ళ క్రితం వరకు తానా పదవుల్లో వెస్ట్ కోస్ట్ ప్రాంతం వాళ్ళు ఎవరూ లేరని, ఇటీవలనే రజనీకాంత్ కాకర్ల, సతీష్ వేమూరి, వెంకట్ కోగంటి, భక్తబల్లా, రామ్‌తోట తానాలో వివిధ పదవులను నిర్వహిస్తున్నారని దానికి క్కారణం వెస్ట్ కోస్ట్ ప్రాంతం లో పెరిగిన తానా సభ్యులు, జరుగుతున్నా కార్య క్రమాలు అను చెపుతున్నారు.
అయితే చివరి సమయం లో జయాప జయాలు బేరీజు వేసుకొని కొందరు, పెద్దల మాట విని మరి కొందరు పోటీ ని విరమించు కోవచ్చు అన్న సంగతి అందరికి తెలిసిందే!
అసలు తానా ఎగ్జిక్యూటివ్, తానా ఫౌండేషన్‌కి వున్న తేడా ఏమిటి? ఎవరు ఎందులోకి వెళ్ళాలి? అన్న విషయాలను 3వ పార్ట్‌లో చర్చిద్దాం.
-సి.వి. సుబ్బారావ్