
మజ్లిస్ తలుచుకుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం రెండు నెలల్లో కూలిపోతుందని చార్మినార్ మజ్లిస్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న మొన్న రాజకీయాల్లోకి వచ్చి కళ్లు తెరిచిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ చిలుక పలుకులు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా చార్మినార్ నియోజకవర్గంలోని డివిజన్లలో మజ్లిస్ అభ్యర్థుల తరపున ఆయన ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మజ్లిస్ పార్టీ ఇలాంటి నాయకులను ఎంతో మందిని చూసిందన్నారు. మజ్లిస్ పూర్వ అధినేత సుల్తాన్ సలాఉద్దీన్ ఒవైసీ చెప్పినట్లుగా రాజకీయం మా ఇంటి గుమస్తాతో సమానం అని అన్నారు. తమకు రాజకీయాల్లో ఒకరిని కుర్చీమీద కూర్చోబెట్టడం తెలుసు.. కుర్చీ నుంచి దించడం సైతం తెలుసు అని టీఆర్ఎస్ నేతలనుద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు.