ఆశ్రమపాఠశాలకు వల్లేపల్లి దంపతుల ఆర్థిక సహాయం...స్కాలర్ షిప్ ల పంపిణీ

Vallepalli Sasikanth Family Donates Groceries and Scholarships to School Children

హైదరాబాద్‍లోని హయత్‍ నగర్‍ మునగనూరులో ఉన్న సెంటర్‍ ఫర్‍ సోషల్‍ సర్వీస్‍ ఆశ్రమ పాఠశాలకు  ప్రముఖ పారిశ్రామికవేత్త క్వాలిటీ మ్యాట్రిక్స్ సంస్థలఅధిపతి, తానా ఫౌండేషన్‍ కోశాధికారి శశికాంత్‍ వల్లేపల్లి, వారి సతీమణి క్యూబ్‍ సంస్థాపకురాలు, సీఈవో శ్రీమతి ప్రియాంక నిత్యావసర సరకులను విరాళంగా అందజేశారు. దాంతోపాటు 30 మంది విద్యార్థినులకు 5 లక్షల ఉపకార వేతనాలను కూడా తానా ఫౌండేషన్‍ చేయూత కార్యక్రమం కింద అందజేశారు.

ఈ సందర్భంగా శశికాంత్‍ మాట్లాడుతూ, జీవితంలో ఎదగడానికి చదువు, లోకజ్ఞానం ఎంతో అవసరమని చెప్పారు. శ్రీమతి ప్రియాంక మాట్లాడుతూ తన జీవితంలో జరిగిన రెండు ముఖ్య సంఘటనలను వివరించి, మహిళా సాధికారత గురించి, ఇష్టంగా చేస్తే అది ఎంత కష్టమైన పనైనా సాధించవచ్చని పిల్లలకు వివరించారు. వచ్చే విద్యా సంవత్సరంలో  సి ఎస్‍ ఎస్‍ న్యామ్‍ స్కూల్‍ లోని ఒక తరగతిని దత్తత తీసుకుని నిర్వహణ ఖర్చును తాము భరిస్తామని కూడా వారు ఈ సందర్భంగా ప్రకటించారు.

సి ఎస్‍ ఎస్‍ సంస్థాపకురాలు శ్రీమతి వేమూరి విజయలక్ష్మి మాట్లాడుతూ, తమ హోమ్‍, స్కూల్‍ కరోనా సమయంలో ఎంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొందని ఈ సమయంలో సహాయం అందించిన  శశికాంత్‍కు, శ్రీమతి ప్రియాంకకు, తానా సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

సి ఎస్‍ ఎస్‍ హోమ్‍ లోని పిల్లలు విజయ, బిందు, గాయత్రి మరియు నవీన ఆశ్రమానికి వచ్చాక తాము చదువుకుని ఎలా ప్రయోజకులు అయ్యారో ఈ?సందర్భంగా వివరించారు. సి ఎస్‍ ఎస్‍ పిల్లలు ఆటపాటలతో కార్యక్రమం ఆహ్లాదంగా కొనసాగింది. స్కూల్‍ విద్యార్థిని స్వాతి వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.

Click here for Photogallery