'పుష్ప' షూటింగ్ స్పాట్ నుండి ఈ షాట్ ఎలా లీక్ అయ్యిందో చెప్మా?

allu-arjun-s-rugged-avatar-leaked-photo-pushpa-sets-internet-fire

షూటింగ్ లొకేషన్ నుండి చిత్ర యూనిట్  ఫొటోస్ గాని  వీడియోస్ గాని ఏవైనా లీక్ చేస్తే లక్ష రూపాయల వరకు జరిమానా విధిస్తామని ఇటీవల వకీల్ సాబ్ నిర్మాతలు హెచ్చరించారు. మరి మైత్రి మూవీ మేకర్స్  టీం కి వర్తించదో ఏమో గాని  అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘పుష్ప’ సినిమా నుంచి  లీకులు మొదలైపోయాయి.  షూటింగ్ స్పాట్ నుంచి బన్నీ లుక్ ఒకటి లీకైంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘పుష్ప’ సినిమా షూటింగ్‌లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల పాల్గొన్న సంగతి తెలిసిందే. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి సమీపంలో ఉన్న మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ‘పుష్ప’ షూటింగ్ జరుపుతున్నారు. సినిమాకు కీలకమైన సన్నివేశాలను అల్లు అర్జున్‌పై ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. 

అల్లు అర్జున్ సెట్స్‌లో జాయిన్ అయినట్టు తెలియజేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఒక పోస్టర్‌ను కూడా విడుదల చేసింది.అయితే, ఇప్పుడు అల్లు అర్జున్ రగ్డ్ లుక్ ఒకటి బయటికి వచ్చింది. షూటింగ్ లొకేషన్ నుంచి ఈ లుక్ లీక్ అయ్యింది. ‘పుష్ప’ షూటింగ్ స్పాట్ నుంచి లీకైన ఫస్ట్ ఇమేజ్ ఇది. ఈ పిక్చర్‌లో అల్లు అర్జున్ మాసిపోయిన జుట్టు, బట్టలుతో చాలా రఫ్‌గా కనిపిస్తున్నారు. అలాగే, బన్నీ పక్కన ఒక నీలం రంగు జీపు కూడా కనిపిస్తోంది. బహుశా దట్టమైన అడవిలో యాక్షన్ సీక్వెన్స్ ఏదైనా ప్రస్తుతం షూట్ చేస్తున్నారేమో.కాగా, ఈ చిత్రంలో బన్నీ పుష్ప రాజ్ అనే ఎర్రచందనం దుంగల స్మగ్లర్‌గా కనిపించబోతున్నారు. ఆయన సరసన రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తున్నారు. తిరుపతి రీజియన్‌లోని శేషాచలం అడవుల్లో జరుగుతోన్న ఎర్రచందనం దుంగల అక్రమ రవాణా నేపథ్యంలో సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

‘అల వైకుంఠపురములో’ చిత్రంలో డిఫరెంట్ లుక్‌లో కనిపించిన బన్నీ.. ఈ సినిమా కోసం మరింతగా తన లుక్‌ను మార్చేశారు. అలాగే, రష్మిక మందన చిత్తూరు జిల్లాకు చెందిన అమ్మాయిగా ఈ చిత్రంలో కనిపించనున్నారు. తన పాత్రకు స్వయంగా డబ్బింగ్ చెప్పుకోబోతున్నారు. ఈ సినిమాకోసం ఈ లాక్‌డౌన్ సమయంలో ఆమె చిత్తూరు యాసను నేర్చుకున్నారట. కాగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రూపొందుతోంది. సుకుమార్, బన్నీ కాంబినేషన్‌లో వస్తోన్న మూడో సినిమా కావడంతో ‘పుష్ప’పై భారీ అంచనాలున్నాయి.