
అమెరికాలో కరోనా విజృంభణతో యూనివర్సిటీల్లో విద్యార్థులు తగ్గడంతో విశ్వవిద్యాలయాలు ఆర్థికంగా నష్టపోయాయి. పెరిగిన డ్రాపవుట్లు, లాక్డౌన్లు, ఆంక్షలకు తోడు ట్రంప్ సర్కారు వీసా నిబంధనలతో కొత్త విద్యార్థులు తగ్గిపోయారని పేరుగాంచిన విశ్వవిద్యాలయాలు పేర్కొంటున్నాయి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ చేపట్టిన సర్వే ప్రకారం.. అమెరికా వర్సిటీల్లో కొత్త దరఖాస్తులు 43శాతం తగ్గాయి. అమెరికా వర్సిటీలకు ప్రధాన ఆదాయవనరు విదేశీవిద్యార్థులే. కొత్త అడ్మిషన్లలో మిషిగాన్(20శాతం), టెక్సస్(17శాతం), అరిజోనా, ఓహియో, మిన్నెసోట వర్సిటీల్లో (15శాతం) చొప్పున తగ్గుదల నమోదైంది.
గత విద్యాసంవత్సరం(2019-20)లో అమెరికాలోని 4,500 గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లో 10 లక్షల మంది విదేశీ విద్యార్థులు చేరగా.. వారిలో భారతీయుల సంఖ్య 2 లక్షలు. అయితే.. కొవిడ్ నేపథ్యంలో.. కరోనాతో చనిపోయిన తమవారి అంత్యక్రియల కోసం, ఇతర కారణాలతో భారత్కు వచ్చిన వారు వీసా నిబంధనలు లేదా విమానాల రద్దు వల్ల ఇండియాలోనే ఉండిపోయారు. వీరు అమెరికా విద్య నుంచి డ్రాపవుట్ అవ్వడమో.. ఆన్లైన్ క్లాసుల వైపు మొగ్గుచూపడమో చేస్తున్నారు. మరికొందరు విద్యార్థుల తల్లిదండ్రులు వారిని అమెరికా పంపేందుకు ఇష్టపడడం లేదు. దీంతో విశ్వవిద్యాలయాలు విద్యార్థులు లేక నష్టపోతున్నాయి.