పవన్..తడబాటే..నీ బాటా?

ghmc-polls-jana-sena-extends-support-to-bjp-asks-its-candidates-to-withdraw-nominations

ఆయ‌న త‌డ‌బ‌డుతూనే ఉన్నాడు. ప‌డి లేచే అవ‌కాశం త‌న‌కు తానే ఇచ్చుకోకుండా ప‌డిపోతూనే ఉన్నాడు. తెలుగు రాష్ట్రాల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓ ప్ర‌భంజ‌నంలా మార‌తాడ‌నుకున్న‌వారి ఆశ‌ల‌ను అంత‌కంత‌కూ నీరు కారుస్తూ.. పొలిటిక‌ల్ ప‌వ‌ర్ గేమ్‌లో ప‌వ‌ర్ స్టార్ నానాటికీ తీసిక‌ట్టుగా మారిపోతున్నాడు. 

తాజాగా జిహెచ్ఎంసి ఎన్నిక‌ల విష‌యంలో జ‌న‌సేన పార్టీ వ్య‌వ‌హ‌రించిన తీరు ఏ మాత్రం ఆ పార్టీ భ‌విష్య‌త్తుపై న‌మ్మ‌కం పెంచేలా లేదు. జిహెచ్ఎంసి ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌లైన ద‌గ్గ‌ర్నుంచీ ఆ పార్టీ త‌డ‌బాటుకు గుర‌వుతూనే ఉంది. తన రాజ‌కీయ అజ్ఞానాన్ని నిస్సిగ్గుగా చాటుకుంటూనే ఉంది. తొలుత అభిమానుల‌, కార్య‌క‌ర్త‌ల ఒత్తిడి మేర‌కు గ్రేట‌ర్‌ల పోటీ చేయాల‌ని నిర్ణ‌యించామ‌ని జ‌న‌సేనాని ప్ర‌క‌టించారు. దీంతో జంట‌న‌గరాల్లో ఉన్న ప‌వ‌న్ అభిమానుల్లో ఊపు క‌నిపించింది. ఏపీలో దారుణ‌మైన‌ ఓట‌మి, ప‌వ‌న్ సినీ రంగ పునఃప్ర‌వేశం వంటి ప‌రిణామాల‌తో స్త‌బ్ధుగా మారిపోయిన క్యాడ‌ర్‌కు ఈ ప్ర‌క‌ట‌న జోష్ నిచ్చింద‌నేది వాస్త‌వం. గెలుపోట‌ముల సంగ‌తెలా ఉన్నా... ఈ ఎన్నిక‌ల్లో పొటీ చేయ‌డం ద్వారా ఒక రాజ‌కీయ పార్టీగా ఉనికిని చాటుకోవ‌చ్చ‌ని వారు సంబ‌ర ప‌డ్డారు. దాంతో జ‌న‌సేన త‌ర‌పున పోటీ చేయ‌డానికి హైద‌రాబాద్  లోని‌ ప‌వ‌న్ వీరాభిమానులు కొంద‌రు ఉత్సాహం చూపించారు.

వారి ఉత్సాహానికి మ‌రింత ఊపునిస్తూ భాజాపాతో స‌ర్ధుబాటు చ‌ర్చ‌లు జ‌ర‌ప‌నున్నామ‌ని జ‌న‌సేన పార్టీ ప్ర‌క‌టించింది. అంతేకాదు క‌నీసం 60 సీట్ల‌లో అభ్య‌ర్ధుల‌ను నిలుపుతామంది. భాజాపా రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ త‌మ నేత‌ను క‌ల‌వ‌నున్న‌ట్టు లీకులిచ్చింది. వీటిలో ఏవీ జ‌ర‌గ‌లేదు. ఓ వైపు మిగ‌తాపార్టీల నుంచి అభ్య‌ర్ధుల పేర్లు ప్ర‌క‌టించ‌డం, నామినేష‌న్ల దాఖ‌లు చేస్తుండ‌డం జ‌రిగిపోతోంది. త‌మ పార్టీ త‌ర‌పున 60 అని మొద‌లుపెట్టి  20 దాకా ఆ సంఖ్య‌ను త‌గ్గించుకుంటూ వ‌చ్చిన జ‌న‌సేన‌.. చివ‌రి నిమిషంలో చేతులెత్తేసింది. నామినేష‌న్ల  గ‌డువు ముగిసిన రోజునే జ‌న‌సేన జిహెచ్ఎంసి డ్రామా కూడా ముగిసింది. అది కూడా అత్యంత అవ‌గ‌మాన‌క‌రంగా.

నిజ‌మైన ప‌వ‌న్ అభిమానుల‌కు ఇది మింగుడుప‌డ‌ని అవమాన‌మే.  జిహెచ్ఎంసి ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీకి భార‌తీయ జ‌న‌తా పార్టీ వీస‌మెత్తు విలువ కూడా ఇవ్వ‌లేదు. జ‌న‌సేన పార్టీతో  అది కూడా నామినేష‌న్ల గ‌డువు ముగ‌య‌డానికి ఇంకా 2గంట‌ల ఉంద‌న‌గా భాజాపా నేత‌లు చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డం ద్వారా తాము జ‌న‌సేన‌కు ఇస్తున్న విలువ ఏ పాటితో తేల్చి చెప్పారు. అంతగా త‌మ‌ను తీసిపారేసిన పార్టీకే మ‌ద్ధ‌తు ప‌లకాలంటూ ప‌వ‌న్ పిలుపివ్వ‌డం రాజ‌కీయంగా ఆయ‌న విలువ‌ను మ‌రింత దిగ‌జార్చ‌డ‌మే. పైగా హైద‌రాబాద్ విశాల ప్ర‌యోజ‌నాలు, క‌రోనా ప‌రిస్థితులు, దేశ సామాజిక ప‌రిస్థితులు... అంటూ ప‌వ‌న్ ప్ర‌వ‌చించిన‌ సాకులు ఎవ‌రిని క‌న్విన్స చేయ‌లేక‌పోయాయి. ప‌వ‌న్‌ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తామ‌ని ప్ర‌క‌టించిన వారం రోజుల్లోనే ఏమంత గ‌డ్డు ప‌రిస్థితులు దాపురించాయో ప‌వ‌న్ అండ్ కో మాత్ర‌మే చెప్పాలి.

ఒక రాజ‌కీయ పార్టీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌వ‌చ్చు చేయ‌క‌పోవ‌చ్చు కానీ... త‌న‌కంటూ ఒక నిర్ధుష్ట‌మైన విధానం లేక‌పోవ‌డం మాత్రం క్ష‌మార్హం కాదు. ఇప్ప‌టికే ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో ఓ పార్టీ ఆట‌లో పావుగా మారిపోయి ప్ర‌జ‌ల తిర‌స్కారాన్ని చ‌విచూసిన ప‌వ‌న్‌.. ఇప్పుడు మ‌రో పార్టీ త‌న చెవిలో" పువ్వు" పెడుతున్నా తెలుసుకోలేక‌పోతున్న‌ట్టు క‌నిపిస్తోంది. 

త‌మ‌కు ఉనికి కూడా లేని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కాస్తో  కూస్తో త‌మ‌కు ఉప‌యోగ‌ప‌డ‌తాడు కాబ‌ట్టే  ప‌వ‌న్ తో జోడీ క‌ట్టి, అంతో ఇంతో  బ‌లంగా ఉన్న తెలంగాణ‌లో మాత్రం ప‌వ‌న్‌ని క‌నీసం దగ్గ‌ర‌కి కూడా రానివ్వ‌కపోవ‌డం ద్వారా కాషాయ పార్టీ త‌న నైజం స్ప‌ష్టంగా బ‌య‌ట పెట్టుకుంది. 

త‌మ‌ను స‌వ్యంగా న‌డిపించ‌గ‌ల‌డు అంటూ ఒక  నేతను జ‌నం న‌మ్మాలంటే ముందు ఆ నేత త‌న శ‌క్తి యుక్తులు తాను నిరూపించుకోవాలి. త‌ద్వారా జ‌నం లో న‌మ్మ‌కం క‌లిగించాలి. అంతే త‌ప్ప చీటికీ మాటికీ ఇత‌ర నాయ‌కులు, పార్టీల ద‌గ్గ‌ర ప‌ల‌చ‌న అవుతూ ప్ర‌యాణిస్తుంటే.. ఇక జ‌నం ఏ  విధంగా స‌ద‌రు నేత‌ను న‌మ్ముతారు? ఇప్ప‌టికైనా ప‌వ‌న్ రాజ‌కీయ వ్యూహాలు మార్చుకుంటారా?  లేక ఇదే ర‌క‌మైన త‌డ‌బాట‌లోనే ప్ర‌యాణిస్తూ... పొలిటిక‌ల్ గా నిల్‌ అవుతారా అనేది ఆయ‌నే నిర్ణ‌యించుకోవాలి.

 


                    Advertise with us !!!