తానా ఎన్నికల సందడి ప్రారంభం

TANA Elections on Feb 2021

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)లో ఇప్పుడు ఎన్నికల సందడి కనిపిస్తోంది. ఫిబ్రవరి 2021లో జరిగే ఎన్నికల వేడి నవంబర్‌ నెలలోనే వచ్చింది. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లు బహిరంగంగా రాకపోయినా, లోలోపల మాత్రం పోటీ పడుతున్న వాళ్ళు తాము పోటీ చేస్తున్నట్లు తెలియజేస్తూ, తమను గెలిపించాల్సిందిగా కోరుతూ ప్రచారాన్ని  ఇప్పటికే ప్రారంభించినట్లు సమాచారం. కీలకమైన తానా అధ్యక్ష పదవికి దాదాపు నలుగురైదుగురు పోటీ పడుతున్నట్లు కనిపిస్తోంది.

అమెరికాలోని తెలుగువారికి పెద్ద దిక్కుగా కనిపించే తానాలో పదవులు నిర్వహించడం ప్రతిష్టాత్మకంగా భావించే వారి సంఖ్య బాగా పెరిగింది. తానాలో ప్రతి రెండేళ్ళకోమారు జరిగే ఈ ఎన్నికలపై చాలామందిలో ఆసక్తి ఉంటుంది. తానా ఎన్నికల ప్రకటన వస్తుందన్న విషయం తెలియగానే పోటీలో నిలబడాలనుకునే వాళ్ళు ఆరునెలల ముందు నుంచే తమకు అనుకూలంగా పరిస్థితులు ఉండేలా చేసుకుంటారు. అందరి దృష్టిలో పడేందుకు వీలుగా కార్యక్రమాలను నిర్వహించడం వంటివి చేస్తారు.

ఇప్పుడు కూడా తానా ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న చాలామంది ఆరునెలల ముందే చాపకింద నీరులా ప్రచారాన్ని ప్రారంభించారు. ముఖ్యంగా ప్రెసిడెంట్ ఎలక్ట్ పదవికి పోటీపడాలనుకునే వాళ్ళు పెద్దఎత్తున తమ తమ అనుయూయుల ద్వారా వివిధ నగరాల్లో ఉన్న తానా సభ్యులకు తమ వివరాలను తెలియజేస్తూ, వారితో సన్నిహితమయ్యేందుకు కృషి చేస్తున్నారు.

తానా చరిత్ర ఘనం...

అమెరికా జాతీయ తెలుగు సంఘాల్లో మొట్టమొదటిదైన తానాకు ఘనమైన చరిత్ర ఉంది. ప్రపంచ తెలుగు సంఘాలకు మాతృసంస్థలా వ్యవహరిస్తుంటుంది. కమ్యూనిటీకి పెద్దన్నలాగా ఉంటుంది. వివిధ జాతీయ తెలుగు సంఘాలకు, ప్రాంతీయ తెలుగు సంఘాలకు తానా చేసిన కార్యక్రమాలే మార్గదర్శకాలుగా కనిపిస్తాయి. తానాలో ఉన్న సభ్యులే నేడు కొన్ని సంఘాలను ఏర్పాటు చేసుకుని స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారు. అమెరికాలో ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ప్రాంతీయ వాళ్ళు ఉన్నా అందరిలోనూ తెలుగుదనం కనిపిస్తుంటుంది. అలాగే అమెరికాలో ఎన్ని సంఘాలు ఉన్నా అందులో 'తానా' మార్క్ ఉంటుంది.

తానా కార్యక్రమాలు

లక్షలాదిమంది సభ్యులుగా ఉన్న తానా ఏ కార్యక్రమం చేసినా అందులో భారీతనం కనిపిస్తుంటుంది. అందుకే తానా కార్యక్రమాలు భారీగానే జరుగుతాయి. కోవిడ్ సమయంలో కూడా తానా చేసినంత సహాయ కార్యక్రమాలు ఏ తెలుగు సంఘం చేయలేదు. తానా ప్రతి రెండేళ్ళకోమారు నిర్వహించే మహాసభలకు ప్రపంచం నలుమూలల నుంచి అతిధులు, తెలుగువాళ్ళు హాజరవుతుంటారు. అలాంటి తానాలో సభ్యులుగా ఉండటమే అదృష్టమని చెప్పుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే అమెరికాలో చదువుకోవడానికి తల్లితండ్రులను వదలి వచ్చిన విద్యార్థులు, లేదా ఉపాధికోసం వచ్చిన ఉద్యోగులు ఎవరైనా సరే రోడ్డు ప్రమాదంలోనూ, ఇతర విపత్తుల్లోనూ గాయపడినా, మరణించిన వెంటనే ఆప్తుడిలా, బంధువులా స్పందించే సంస్థ తానా ఏర్పాటు చేసిన టీమ్స్వ్వేర్ మాత్రమే. ఆపదలో ఉన్నవాళ్ళకు ఆపన్నహస్తం అందించడంలో తానా ఎప్పుడూ ముందుంటుంది.

తానా ఆర్గనైజేషన్...ఎన్నికలు

తానా ఆర్గనైజేషన్ కూడా పటిష్టంగా ఉంటుంది. కార్యనిర్వాహక వర్గం (ఎగ్జిక్యూటివ్ కమిటీ), తానా ఫౌండేషన్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ విభాగాలు తానా నిర్వహణ సమర్థవంతంగా జరిగేలా చూస్తాయి. అన్నీ సంఘాలకు జరిగినట్లుగానే తానాలో కూడా కీలకమైన ఎగ్జిక్యూటివ్ కమిటీ పదవులకు, తానా ఫౌండేషన్ ట్రస్టీ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పదవులకు ఎన్నికలు జరుగుతుంటాయి. గతంలో ఇలాంటి పదవులకు పెద్దలు మాత్రమే పోటీ పడేవారు. కాలంతోపాటు తానాలో కూడా యువత ప్రాబల్యం పెరుగుతూ వచ్చింది. దాంతో ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు యువకులు కూడా ముందుకు వచ్చారు. దాంతో అప్పటివరకు తానా ఎన్నికలు నాలుగుగోడల మధ్యనే ప్రజాస్వామ్యబద్దంగా జరిగినా పెద్దగా దానిపైన ఎవరికీ ఆసక్తి ఉండేది కాదు. ఎప్పుడైతే యువతరం పోటీలకు సై అంటూ ముందుకు వచ్చిందో అప్పటి నుంచి తానా ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల్లాగా జరుగుతూ వస్తున్నాయి. ఎన్నికల ప్రచార సరళి మారిపోయింది. పబ్లిసిటీ, ఇ-మెయిల్స్ ప్రచారం, ప్రసారమాధ్యమాల్లో ప్రకటనలు, సామాజిక మాధ్యమాల్లో ప్రచారాలు, ప్రకటనలు ఇలా పోటాపోటీగా ఎన్నికల ప్రచారాలు తారా స్థాయికి చేరిపోయాయి. చివరకు ఫలితాలు వెలువడేంతవరకు ఉత్కంఠను కలిగించేలా పరిస్థితులు మారిపోయాయి.

2021 ఎన్నికలు ఏ విధంగా ఉండబోతున్నాయి...

తానా ఎగ్జిక్యూటివ్‌ కమిటీ పదవులకు, ఇతర పదవులకు 2021లో జరిగే ఎన్నికలు ఏ విధంగా ఉంటాయోనన్న ఆసక్తి ఇప్పటికే చాలామందిలో ఉంది. ఇప్పటికే తానా నాయకత్వం. సేవా కార్యక్రమాలలో పాల్గొనే వారికి తానా లో ఎదిగే అవకాశం ఉంటుందని, ఇస్తామని చెప్పటూ వున్నారు. అందువలన కూడా ప్రస్తుత కార్య వర్గ సభ్యులు చాల మంది తమ తమ ప్రాతాలలో గాని,  తెలుగు రాష్ట్రాలలో గాని ఎదో ఒక కార్య క్రమాం చెపాట్టినట్టు గా తెలుస్తోంది. ఎగ్జిక్యూటివ్‌ కమిటీ అధ్యక్ష పదవికి నలుగురైదుగురు పేర్లు ఇప్పటికే ప్రచారంలో ఉన్నాయి. ఇంకా ఒకరిద్దరు వున్నారని కూడా తెలుస్తోంది. ఇతర పదవులకు కూడా పోటీ పడేవారి సంఖ్య కూడా భారీగానే కనిపిస్తోంది. దానికితోడు ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే చాలామంది కోవిడ్‌ సమయంలో తానా నిర్వహించిన పలు సేవా కార్యక్రమాల్లో ముమ్మరంగా పాల్గొన్నారు. తాము చేసిన సేవా కార్యక్రమాలను పదిమందికి తెలిసేలా ప్రచారాన్ని కూడా చేసుకున్నారు.

ఇప్పటికే పలువురు తమ సన్నిహితులకు, మిత్రులకు, తానాలోని సభ్యులకు తాము పోటీ చేస్తున్నట్లు పరోక్షంగా చెప్పడంతోపాటు తమను గెలిపించాల్సిందిగా కోరుతూ లోలోపల ప్రచారాన్ని కూడా ప్రారంభించినట్లు సమాచారం.

-సి.వి. సుబ్బారావ్

 

తానా ఎన్నికలు పార్ట్ 2లో మరింత సమాచారం