పాఠశాల అభివృద్ధికి 11.5లక్షలు విరాళమిచ్చిన వల్లేపల్లి ప్రియాంక

nri donates 11 5 lakhs for school development work

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఫౌండేషన్‌ కోశాధికారి వల్లేపల్లి శశికాంత్‌ సతీమణి వల్లేపల్లి ప్రియాంక పాఠశాల అభివృద్ధిపనులకోసం 11.5 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఆ విరాళంతో చేసిన పనులను ఆమె ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లా బ్రాహ్మణగూడ ప్రాథమిక పాఠశాల పూర్తయిన అభివృద్ధి పనులను ఆమె తన భర్తతో కలిసి ప్రారంభించారు. ఆమె ఇచ్చిన విరాళంతో పాఠశాల యాజమాన్యం పాఠశాలలో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడంతోపాటు కంప్యూటర్‌లు, సోలార్‌ విద్యుత్‌ పరికరాలు, డిజిటల్‌ తరగతులను ఏర్పాటు చేసింది.  వల్లేపల్లి శశికాంత్‌తో కలిసి స్కూల్‌ను సందర్శించిన ప్రియాంక.. పాఠశాలలో పూర్తైన అభివద్ధి పనులను ప్రారంభించి మాట్లాడుతూ, సేవ చేసేందుకు అవకాశం కల్పించిన యునైటెడ్‌ వే ఆఫ్‌ హైదరాబాద్‌ ఛైర్మన్‌ కాజ రమేష్‌, తెలంగాణా ప్రభుత్వం ఐటీ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ తదితరులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో చేపడుతున్న సేవా కార్యక్రమాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ రవి, యునైటెడ్‌ వే ఆఫ్‌ హైదరాబాద్‌ సేవా సంస్థ ప్రతినిధులు భూషణ్‌ రెడ్డి, భాను ప్రసాద్‌, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు తిరుమలేష్‌, విద్యార్థులు పాల్గొన్నారు.