
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌కు అంతా రెడీఅయింది. అన్నీ రాష్ట్రాలకన్నా ముందుగా న్యూ హాంప్‌షైర్ రాష్ట్రంలోని డిక్సివిల్లే నాచ్ నగరంలో పోలింగ్‌ను అధికారులు ప్రారంభించారు. ప్రతీసారి ఈ రాష్ట్రంలోనే ఎన్నికల ఓటింగ్ మొదటగా జరగడం సంప్రదాయంగా వస్తోంది. ఫలితాల వెల్లడి కూడా ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. డిక్సివిల్లే నాచ్ బల్సామ్స్ రిసార్ట్‌లో బ్యాలెట్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. మంగళవారం మధ్యాహ్నం 1 గంటలకు ఓటింగ్ పక్రియ మొదలైంది. న్యూ హాంప్‌షైర్‌లో తొలి ఓటు నమోదైంది. ఈ నగరంలో కేవలం ఐదుగురు మాత్రమే ఓటర్లు ఉండటం గమనార్హం. 2016 ఎన్నికల సమయంలో ఈ నగరంలో మొత్తం ఆరుగురు ఉన్నారు. అమెరికాలోని మొత్తం 50 రాష్ట్రాల్లో 538 ఎలక్ట్రోరల్ ఓట్లు ఉన్నాయి. వీటిల్లో సగానికి సగం దక్కించుకున్నవారినే అధ్యక్షుడిగా ప్రకటిస్తారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పలు జాగ్రత్తల నడుమ పోలింగ్ సాగుతోంది. అమెరికాలో మొత్తం 23.9 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. ఇప్పటికే ముందస్తు ఓటింగ్‌లో సగం ఓట్లు పోలైయ్యాయి. దాదాపు 10 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. హవాయ్, టెక్సాస్, మోంటానా రాష్ట్రాల్లో భారీగా ముందస్తు ఓట్లు పోలైయ్యాయి.
పోలింగ్ నేపథ్యంలో రక్షణ చర్యలు చేపట్టిన వాణిజ్య సముదాయాలు
అమెరికాలో పోలింగ్ ప్రారంభమవుతుంటే , మరోవైపు వ్యాపారులు మాత్రం తమ షాపులను రక్షించుకునే పని చేపట్టారు. ఎన్నికల అనంతరం పెద్ద ఎత్తున అల్లర్లు జరగొచ్చనే పుకార్లు అమెరికాలో షికారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలోని వ్యాపారస్తులు తమ వాణిజ్యసముదాయాలను రక్షించుకునే పనిలో పడ్డారు. అమెరికాలోని ప్రధాన నగరాల్లోని వాణిజ్య సముదాయాల యజమానులు తమ షాపులకు ఫ్లైవుడ్‌తో రక్షణ కవచాన్ని ఏర్పాటు చేయిస్తున్నారు. నిరసనకారులు రాళ్లు రువ్వినా ఎటువంటి నష్టం వాటికల్లకుండా కీటికీలను, డోర్లను ఫ్లైవుడ్‌తో క్లోజ్ చేయిస్తున్నారు. కోవిడ్ 19 నేపథ్యంలో అమెరికాలో చాలామంది ఉద్యోగాలు కోల్పోయిన నేపథ్యంలో అల్లర్లు జరగవచ్చేమోనన్న అనుమానాలు ఉన్నాయి.