
అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి తప్పదనుకున్నాడో ఏమోగానీ, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం నాటి పోలింగ్ తరువాత ఓట్ల లెక్కింపును సవాలు చేయనున్నట్లు సూచనప్రాయంగా తెలిపారు. మంగళశారం పోలింగ్ నిర్వహిస్తున్నప్పటికీ చాలామంది అంతకుముందే మెయిల్ ఇన్ బ్యాలెట్ల ద్వారా ఓట్లేశారు. 9 కోట్ల 20 లక్షల మంది ఈ పద్ధతిలో ఓట్లు వేసేసిన నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో వీటిని లెక్కబెట్టేందుకు కొన్ని వారాల సమయం పడుతుందని అంచనా. ఫలితంగా కొత్త అధ్యక్షుడు ఎవరన్నది సృష్టమయ్యేందుకు మరింత సమయం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపులో జరుగుతున్న జాప్యాన్ని తాము సవాలు చేసే అవకాశం ఉందని ట్రంప్ చెబుతున్నారు.
కంప్యూటర్ల యుగంలో ఎన్నికల జరిగిన రోజు రాత్రికల్లా ఫలితాలు తేలకపోవడం ఘోరమైన విషయమన్నారు. మెయిల్ ఇన్ బ్యాలెట్ల పద్ధతిలో మోసాలు జరిగే అవకాశాలు ఎక్కువని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఒకవేళ అమెరికన్లు ఓట్లు వేయాలని అనుకుని ఉంటే చాలా ముందుగానే ఆ పని చేసి ఉండాల్సిందని అన్నారు. అందరూ ఒకే రోజు ఓటేయాల్సిన అవసరం లేదు. నెల రోజుల క్రితం ఓటేసి ఉండవచ్చు అని ట్రంప్ వ్యాఖ్యానించారు.