'శ్రీదేవి సోడా సెంటర్' పెట్టిన సుదీర్ బాబు

Sridevi Soda Center Motion Poster

యంగ్ హీరో సుధీర్ బాబు చేస్తున్న కొత్త సినిమా 'శ్రీదేవి సోడా సెంటర్'. క‌రుణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ మూవీ నుంచి తాజాగా మోషన్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. కెరీర్ ఆరంభం నుంచే జయాపజయాలతో కలిసి ప్రయాణం చేస్తున్న యంగ్ హీరో సుధీర్ బాబు ఇటీవలే మల్టీస్టారర్ మూవీ 'V'తో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. అదే స్పీడుతో ప్రస్తుతం 'శ్రీదేవి సోడా సెంటర్' సినిమా చేస్తున్నారాయన. తాజాగా ఈ మూవీ ఫ‌స్ట్‌లుక్, మోష‌న్ పోస్టర్‌ రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు మేకర్స్. ''మనోడు లైటింగ్ ఎడితే ఊరంతా మెరిసిపోద్ది'' అని పేర్కొంటూ ఈ మోష‌న్ పోస్టర్‌ను తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశారు సుధీర్ బాబు.

ఇప్పటికే విడుదల చేసిన ప్రీలుక్‌లో గోలీ సోడాల కేస్, జిమ్కీ లైట్లు, వైర్లు, మ‌ల్లెపూలు వంటి ఎలిమెంట్స్‌తో ఆడియెన్స్‌ చూపును తమ వైపుకు తిప్పుకున్న చిత్ర యూనిట్‌.. మళ్ళీ అదే పంధాని కొన‌సాగించారు. 'శ్రీదేవి సోడా సెంట‌ర్' మోష‌న్ పోస్ట‌ర్‌లో సుధీర్ బాబు సోడా ప‌ట్టుకొని ఉన్న స్టైలిష్ స్టిల్ అందరినీ బుట్టలో వేసుకుంటోంది. ఇందులో హీరో సుధీర్ బాబు లైటింగ్ మెన్ పాత్ర పోషిస్తున్నారు. చిత్రానికి సంబంధించిన రెగ్యుల‌ర్ షూటింగ్ న‌వంబ‌ర్‌ నెలలో మొద‌లు పెడుతున్న‌ట్లుగా నిర్మాత‌లు వెల్లడించారు.ప‌లాస 1978 సినిమాతో అరంగేట్రంలోనే మంచి పేరు సంపాదించిన క‌రుణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ 'శ్రీదేవి సోడా సెంటర్' సినిమా తెరకెక్కుతోంది. 70 ఎమ్ ఎమ్ ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై ప్రొడ‌క్ష‌న్ నెం 4గా నిర్మితమవుతున్న ఈ చిత్రానికి విజ‌య్ చిల్లా, శ‌శిదేవిరెడ్డి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ఈ ఇద్దరి నిర్మాణంలో వచ్చిన తొలి సినిమా 'భ‌లే మంచి రోజు'లో హీరోగా సుధీర్ బాబే నటించారు. మళ్ళీ అయిదేళ్ల తర్వాత ఇప్పుడు‌ సుధీర్ బాబు ఇదే బ్యాన‌ర్‌లో 'శ్రీదేవి సోడా సెంటర్' చిత్రం చేస్తున్నారు. మెలోడి కింగ్ మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు.