గోచీ క‌ట్టిస్తా, మీట‌ర్లు పీకేస్తాః జ‌గ‌న్‌పై లోకేష్‌

Nara Lokesh Fires on CM YS Jagan

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీ తెలుగుదేశం యువ నేత, త‌దుప‌రి పార్టీలో నాయ‌క‌త్వ ప‌గ్గాలు అందుకోవాల్సిన నారా లోకేష్‌..అందుకు త‌గ్గ‌ట్టుగా పిద్ధ‌మ‌వుతున్నారు. ధాటికి, నోటికి ఒకేసారి ప‌నిచెప్పారు. సున్నితంగా వెళితే ప‌నికాద‌నుకున్నారో ఏమోమాట‌ల్లో ప‌ద‌ను పెంచారు. అవ‌స‌ర‌మైతే తాను కూడా ప‌రుష ప‌ద‌జాలం ఉప‌యోగించ‌గ‌ల‌న‌ని చెప్ప‌క‌నే చెప్పారు. తాజాగా ఆయన ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డిన తీరే అందుకు నిద‌ర్శ‌నం. ఆయ‌న మాట‌ల్లోనే...

నేను ఎద్దునైతే జ‌గ‌న్ ఏమిటి?
అధిక వర్షాలు, వరదలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు... గోదావరి జిల్లాల్లో వరి పంట మూడు సార్లు మునిగింది, రాయలసీమలో 10 లక్షల ఎకరాల వేరుశెనగ దెబ్బతిన్న‌ది. వరదలో మునిగితేనే సహాయం ఇస్తాం అంటారా.. మానవత్వం లేదా?.  రైతుల్ని ఆదుకోవడానికి మనసు ఉండాలి.. డబ్బులు కాదు.నేను  వరద బాధితుల్ని, రైతుల్ని పరామర్శించడానికి వెళితే..  ఎద్దు అని ఒక మంత్రి గేలి చేశార‌ని,   మరి ప‌రామ‌ర్శ పేరిట‌ గాల్లో తిరిగిన ముఖ్యమంత్రి జగన్‌ను ఏమనాలి? న‌న్ను ఏ హోదాతో తిరిగాడ‌ని ప్ర‌శ్నిస్తున్నారు. నాకు  హోదా లేదు. కానీ రైతుల క‌ష్టాల‌పై ఆవేదన ఉంది.

రైతుకు రిక్త‌హ‌స్తం...
తిత్లీ వస్తే మా ప్రభుత్వ హాయాంలో 28 రోజుల్లో శ్రీకాకుళం జిల్లాకు రూ.160 కోట్లు ఇచ్చాం. జగన్ అధికారంలోకి వచ్చాక రూ.25 లక్షల సహాయం మాత్రమే చేశారు. రైతుకు రూపాయి ఇవ్వకుండా రైతు రాజ్యం ఎలా అవుతుంది?. ఏడాదిన్నరలో 750మంది రైతులు ఆత్మహత్య చేసుకోవటమేనా రైతు రాజ్యమంటే.. నష్టం అంచనా 100శాతం చేయాలి. ఎకరాకు రూ.25వేలు పరిహారం చెల్లించాలి.. ఆక్వా రంగం కుదేలైనందున ఎకరాకు రూ.5లక్షలు ఇవ్వాలి.  దెబ్బతిన్న పంటలకు కనీస మద్దతు ధర , ముంపునకు గురైన ప్రతి కుటుంబానికి రూ.5వేలు పరిహారం ఇవ్వాలి.

ఎపీ సిఐడి చేత‌కానిదా?
లక్షల కోట్లు అవినీతి చేశానని అన్నారు.. చివ‌రికి ట్రాక్టర్ నడిపానని కేసులు పెట్టారు. ట్రాక్టర్‌తో ర్యాష్‌ డ్రైవింగ్ కూడా చేయొచ్చని నాపై కేసు పెట్టాకనే తెలిసింది. రాజధానిపై సీబీఐ విచారణ జరపాలని ప్రభుత్వం అంటోంది. అంటే ఏపీలో ఏసీబీ, సీఐడీ పనికిరాని విభాగాలని ప్రభుత్వం ఒప్పుకుంటుందా...మ‌రి జగన్ బాబాయి వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణను జగన్ ఎందుకు వద్దన్నారు?..

జ‌గ‌న్ కి గోచీ..మీట‌ర్లు పీకి..
రైతులను ఎగతాళి చేసిన‌ జగన్‌ను గోచీతో నిలపెట్టే రోజు దగ్గరలోనే ఉంది.  ప్ర‌పంచ బ్యాంకు నుంచి 4వేల కోట్ల అప్పు కోసం వ్యవసాయానికి మీటర్ల బిగింపు స‌రైంది కాదు. త‌మిళ‌నాడు రాజ‌ధాని చెన్నైలో జగన్ కొత్త ప్యాలెస్ కడుతున్నారు,  జగన్ త‌న ప్యాలెస్‌లు తనఖా పెట్టి అప్పు తెచ్చుకోవాలి. మేం మాత్రం మీటర్లను అంగీకరించబోవ‌డం లేదు, కాద‌ని వ్యవసాయానికి మీటర్లు బిగిస్తే వాటిని పీకేస్తాం. సైకిళ్లకు మీటర్లు కట్టి ఊరేగిస్తాం.

కేంద్రం మెడ‌లు వంచ‌లేదేం?
త‌మ‌కు అధికారం ఇస్తే కేంద్రం మెడ‌లు వంచి ప్ర‌త్యేక‌ హోదా తెస్తాన‌న్నారు. ఇప్పుడు  వైఎస్సార్‌సీపీకి 22మంది ఎంపీలు ఉన్నారు. కాని ప్రత్యేక హోదా ఏమైందో చెప్పడం లేదు. మ‌రోవైపు పోలవరం 70శాతం పూర్తయితే మీసం తీయించు కుంటానని చెప్పిన  మంత్రి ఎక్కడ?..త‌మ‌పై ఉన్న‌ కేసుల మాఫీ కోసమే పోలవరం అంచనాలు కుదించారు, చేతకాని 22మంది ఎంపీల వల్ల పోలవరానికి రూ.30వేల కోట్లు నష్టం వాటిల్లింది.