‘స్థానికం’పై ఢీ నేడే ఏపీలో రాజకీయ భేటీ

AP SEC Nimmagadda Ramesh Kumar vs YSRCP Govt on Local Elections

సాధారణంగా ఎన్నికలు, ఫలితాలు వగైరాలన్నీ ఉత్కంఠ రేకెత్తిస్తాయి. కాని ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఎన్నికలు జరగకుండానే అదే అంశం అత్యంత ఆసక్తికరంగా మారడం విశేషం. ఎన్నికలు జరిగిన అనంతరం మాత్రమే పార్టీల జయాపజయాలు గురించి మాట్లాడతాం. అయితే చిత్ర విచిత్రాల నడుమ స్థానిక ఎన్నికల నిర్వహణ అనేదే గెలుపోటముల అంశంగా మారడం మరీ చెప్పుకోదగ్గ విశేషం. బుధవారం ఏపీలో సిఇసి అధ్యక్షతన అన్ని పార్టీల సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. 

ఎన్నికలపై తెగని పేచీ...

స్థానిక ఎన్నికల సమరం ఆంధ్రప్రదేశ్‌లో రకరకాల మలుపులు తిరుగుతోంది. తొలుత ఈ ఎన్నికలు ప్రారంభమై మార్చి నెలలో కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. అయితే కరోనా కారణాన్ని చూపించి స్థానిక సమరాన్ని ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ కావాలనే రద్దు చేశారంటూ సాక్షాత్తూ ఏపీ సిఎం వైఎస్‌ జగన్‌ ప్రెస్‌మీట్‌ పెట్టి బహిరంగంగా విమర్శించారు. ఇది తన సామాజిక వర్గ నేత కోసమే చేశారని నేరుగానే ఆయన ఆరోపణలు చేశారు. అక్కడ నుంచి ఈ వివాదం రకరకాల మలుపులు తిరిగింది. ఊహించని ఎన్నో చర్యలకు తావిచ్చింది.

ఏదేమైనా.. ఎన్నికల కమిషన్‌ వర్సెస్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గొడవ నానాటికీ ముదురుతూనే వచ్చింది.  ఇది అందరికీ తెలిసినవే. ఈ నేపధ్యంలో  ఎన్నికల ప్రక్రియను చేపట్టాలని సిఇసి సిద్ధం కావడం దానికి ఈ సారి ప్రభుత్వం ససేమిరా అంటుండడంతో మళ్లీ ఈ అంశంపై చర్చోపచర్చలు విశ్లేషణలు వాదోపవాదాలు హోరెత్తుతున్నాయి. 

కరోనా కీలకం...

కరోనా తగ్గుముఖం పట్టిందని, అన్‌ లాక్‌ ప్రక్రియ ఊపందుకుందని ఇప్పటికే ఆలస్యం అయింది కాబట్టి స్థానిక ఎన్నికలు నిర్వహించడం మేలని ఎన్నికల కమిషన్‌ అంటోంది. బీహార్‌ ఎన్నికలు కూడా జరుగనుండడాన్ని తన వాదనకు మద్ధతుగా చేసుకుంటోంది. అయితే ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేవని, కరోనా కేసు ఒక్కటి ఉన్నప్పుడు వాయిదా వేసి ఇప్పుడు వేలు, లక్షల సంఖ్యలో ఉన్నప్పుడు ఎన్నికలు నిర్వహించాలనడం ఏమిటని వైసీపీ సర్కార్‌ వాదిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పలు సమస్యల కారణంగా ప్రభుత్వ యంత్రాంగం కూడా ఎన్నికల నిర్వహణకు సన్నధ్ధంగా లేదని చెబుతోంది. 

పట్టు వీడం..మెట్లు దిగం..

మేం కరెక్ట్‌ అంటే మేం కరెక్ట్‌ అంటూన్న రెండు ప్రజాస్వామ్య వ్యవస్థల మధ్య  తలెత్తిన ఘర్షణ మరోసారి కోర్టు మెట్లెక్కింది. ఓవైపు దీనిపై కోర్టులో విచారణ సాగుతుండగానే పాలక పక్షం వర్సెస్‌ విపక్షాలుతో జతకలిసిన సిఇసి పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. మరో ఐదు నెలల్లో తన పదవీ కాలం ముగియనుండడంతో ఈలోపే స్థానిక ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని రమేష్‌కుమార్‌ భావిస్తున్నట్టు కనిపిస్తోంది. దీనిపై వైసీపీ శ్రేణుల్లో సందేహాలు రేకెత్తుతున్నాయి. తనకు కావాల్సిన పార్టీలకు వీలైనంతగా మేలు చేసేందుకే ఆయన ఇంత పట్టుదలగా ఉన్నట్టు ప్రభుత్వం భావిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన కోరుకున్నట్టు ఎన్నికలు నిర్వహించ కూడదని జగన్‌ సర్కార్‌ నిర్ణయించుకుంది. ఇది అర్ధమైపోతుండడంతో విపక్షాలు ఎన్నికల నిర్వహణ వైపే మొగ్గు చూపుతున్నాయి. 

ఏం జరగబోతోంది...

వీటన్నింటి నేపధ్యంలో బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ రాజకీయ పార్టీల ప్రతినిధులతో చర్చించనుంది. అయితే ఎప్పటిలా కాకుండా ఒక్కో పార్టీ ప్రతినిధితో విడివిడిగా సిఇసి సమావేశం కానున్నారు. ఇప్పటికే తెలుగుదేశం తాను ఎన్నికలకు అనుకూలమని చెప్పేసింది. భాజాపా, జనసేన కూడా ఎన్నికల నిర్వహణకే ఓటేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇక వామపక్షాలు కూడా అదే బాట పట్టొచ్చు. అయితే అధికార పార్టీ వైకాపా మాత్రం ఖచ్చితంగా ఎన్నికల నిర్వహణను వ్యతిరేకించనుంది. ప్రస్తుతం కృష్ణాజిల్లా వంటి ప్రాంతాల్లో కరోనా సెకండ్‌ వేవ్‌ కనిపిస్తోందని ఈ పరిస్థితులలో ప్రభుత్వం ఎన్నికలను నిర్వహించే సాహసం చేయబోదని తేల్చి చెప్పనుంది.  ధాటిగా మాట్లాడే సత్తా ఉన్న అంబటి రాంబాబు వైకాపా తరపున ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఏదేమైనా..బుధవారం సాయంత్రం వెల్లడయ్యే ఈ సమావేశ ఫలితాలు ఎలా ఉంటాయనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.