తెలంగాణలో మరో రెండు సంస్థలు భారీ పెట్టుబడులు

granules-india-ltd-and-laurus-labs-invest-in-telangana

తెలంగాణలో మరో రెండు సంస్థలు భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. లారస్‍ ల్యాబ్స్, గ్రాన్యూల్స్ ఇండియా కంపెనీలు రాష్ట్రంలో పెట్టబోయే పెట్టుబడులకు సంబంధించిన విషయాలను ప్రకటించారు. ప్రగతి భవన్‍లో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‍ను కంపెనీల ప్రతినిధులు ఈ మేరకు వెల్లడించారు. ఈ రెండు సంస్థలు జినోమ్‍ వ్యాలీలో రూ.700 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు మంత్రి కేటీఆర్‍కు తెలిపారు. ఇందులో రూ.400 కోట్లతో తయారీ పరిశ్రమను గ్రాన్యూల్స్ ఇండియా నెలకొల్పనుండగా.. తయారీ రంగంలోనే లారస్‍ ల్యాబ్స్ రూ.300 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు కంపెనీల ప్రతినిధులు కేటీఆర్‍ దృష్టికి తీసుకొచ్చారు. ఈ మేరకు ఆయా కంపెనీల స్థాపన ద్వారా రాష్ట్రంలో 1,750 మందికి ఉపాధి లభించే అవకాశం ఉన్నట్లు కంపెనీల ప్రతినిధులు తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన లారస్‍ ల్యాబ్స్, గ్రాన్యూల్స్ ఇండియా సంస్థల ఆలోచనను మంత్రి కేటీఆర్‍ స్వాగతించారు. ఈ మేరకు పరిశ్రమల స్థాపనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని కంపెనీల ప్రతినిధులకు మంత్రి కేటీఆర్‍ హామీ ఇచ్చారు.