అధ్యక్ష ఎన్నికల్లో రికార్డు...పోలింగ్ శాతం పెరిగింది...

62 Million And Counting Americans Are Breaking Early Voting Records

ముందస్తు ఓటింగ్‍లో పాల్గొన్న ట్రంప్‍

ఇదివరకు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎప్పుడూ ఇంతగా పోలింగ్‍ జరగలేదు. కోవిడ్‍ నేపథ్యంలో ఎంతోమంది ఇప్పటికే ముందస్తు ఓటింగ్‍లో పాల్గొనడం విశేషం. 9రోజుల గడువు ముందటే దాదాపు 5.9 కోట్ల మంది ఓటేసేశారు. మొత్తం 24 కోట్ల మంది ఓటర్లలో దాదాపు నాలుగోవంతు ఓటర్లు ముందస్తుగా ఓటుహక్కు వినియోగించుకోవడం అమెరికా చరిత్రలోనే ఓ రికార్డుగా పేర్కొంటున్నారు. 2016లో పడిన మొత్తం ఓట్లలో 42 శాతం ఈసారి ఎన్నికల్లో ముందస్తుగానే బ్యాలెట్లకు చేరాయి. 16 కీలక రాష్ట్రాల నుంచే ఈ మొత్తం ఓట్లు పడ్డాయి.  కరోనావైరస్‍ ఉధృతంగా కాటేస్తుండడంతో బయటకు- అంటే పోలింగ్‍ కేంద్రాలకు రావడానికి సాహసించని ఓటర్లు ఈసారి పోస్టల్‍, ఈమెయిల్‍ బ్యాలెటింగ్‍కు మొగ్గుచూపారు. ఈ ముందస్తు ఓటింగ్‍ ఎక్కువగా ఉన్న కారణంగా ఫలితాల వెల్లడి ఆలస్యం కావొచ్చని,  ఎందుకంటే మొత్తం పోలింగ్‍ పూర్తయ్యాకే పోస్టల్‍, మెయిల్‍ ఓట్ల లెక్కింపు కూడా మొదలవుతుందని, ఈ లెక్కింపునకు కాస్త ఎక్కువ సమయం పడుతుందని, పోలింగ్‍ జరగిన రోజు రాత్రే ఫలితాలు వెలువడడం అసాధ్యమని, కొన్ని రోజులపాటు సాగొచ్చని ఫెడరల్‍ ఎలక్షన్‍ కమిషన్‍ వర్గాలను ఉటంకిస్తూ సీఎన్‍ఎన్‍ తెలిపింది.

కాగా ఈ ఎన్నికల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍ తన ఓటు హక్కును ముందస్తు బ్యాలెట్‍ లో వినియోగించుకున్నారు. ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్‍ బీచ్‍ లోని పోలింగ్‍ కేంద్రంగా ఉన్న లైబ్రరీలో ఓటు వేశారు. గత ఏడాది నూయార్క్ నుంచి ఫ్లోరిడాకు తన నివాసాన్ని ఆయన మార్చారు. ఈ నేపథ్యంలో ట్రంప్‍ ఇక్కడ ముందస్తు ఓటును వినియోగించుకున్నారు. అనంతరం బయటకు వచ్చిన తర్వాత.. ‘ట్రంప్‍ అనే పేరున్న వ్యక్తికి ఓటు వేశాను’ అని నవ్వుతూ చెప్పారు. సాధారణంగా మాస్కుకు దూరంగా ఉండే  ట్రంప్‍ దీనికి భిన్నంగా వ్యవహరించారు. మాస్కు ధరించి ఓటు వేశారు. ‘ఇది చాలా సురక్షితమైన ఓటు. మీరు బ్యాలెట్లో పంపినప్పుడు కంటే చాలా సురక్షితమని నేను మీకు చెప్పగలను’ అని ట్రంప్‍ అన్నారు. ఆధారాలు లేని మెయిల్‍-ఇన్‍ ఓటింగ్‍ మోసానికి దారితీస్తుందని ఆయన గట్టిగా చెబుతున్నారు. కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటం తో అమెరికన్లు ముందస్తు ఓటింగ్‍ కి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది.