తాగుడుకు కోట్లు వెచ్చిస్తున్న జనాలు

Record liquor sale in Telangana for Dasara

కరోనా వచ్చిన తరువాత విధించిన లాక్‍ డౌన్‍ తో  ఆదాయం లేక ఎంతోమంది ఇబ్బందులపాలయ్యారు. ఇప్పడిప్పుడే పరిస్థితులు కుదుటపడుతున్న స్థితిలో జనాలు ఆదాయాన్ని వ్యవసాలకు వెచ్చించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దసరా పండుగ సందర్భంగా మద్యాన్ని ప్రజలు తెగతాగేశారు. తెలంగాణలో బతుకమ్మ దసరానే పెద్ద పండుగ. ఈరెండు వరుసగా ఒక రోజు తర్వాత మరొకటి వస్తాయి. ఈ క్రమంలోనే మాంసాహారం మద్యం ఈ పండుగకు కంపల్సరీ. దీంతో ఈసారి తెలంగాణలో మద్యం ఏరులై పారింది. ఈసారి రికార్డ్ సేల్స్ జరిగాయి.  ప్రతీసారి దసరాకు ముందు ఆ తరువాత కోట్లలో మద్యం విక్రయాలు సాగుతుంటాయి. ఈసారి కూడా తెలంగాణలో మద్యం ఏరులై పారిందని లెక్కలు చెబుతున్నాయి.

దసరా బతుకమ్మ సందర్భంగా దాదాపు మూడు నాలుగు రోజులు మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. ఈసారి ఆదివారం దసరా పండుగ సందర్భంగా రెండు రోజుల ముందు నుంచే అమ్మకాల్లో ఊపు వచ్చింది. తెలంగాణలో శుక్రవారం రూ. 131 కోట్ల మద్యం విక్రయించగా శనివారం రూ. 175 కోట్ల లిక్కర్‍ అమ్మకాలు జరిగాయి. ఇక దసరా రోజున ఆదివారం రూ. 100 కోట్ల ఆదాయం వచ్చినట్లు లెక్కలు చెబుతున్నాయి. సోమవారం నాడు ప్రభుత్వ సెలవు దినం కావడంతో ఆరోజు కూడా మద్యం విక్రయాలు బాగానే సాగాయి.  మొత్తంగా ఈ నాలుగు రోజుల్లో రూ. 406 కోట్ల మద్యం విక్రయించినట్టు  తెలుస్తోంది. గతేడాది వారం రోజుల్లో రూ. 1374 కోట్ల ఆదాయం వచ్చింది. ఈసారి రూ. 1979 కోట్ల ఆదాయం వచ్చినట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కరోనా సమయంలోనూ అమ్మకాలు పెరిగాయని అధికారులు చెబుతున్నారు. కష్టకాలంలోనూ మద్యం విక్రయాలు తక్కేవేం కాలేదని గతేడాది కంటే ఎక్కువగానే సాగాయని వారు పేర్కొంటున్నారు.