మహేష్‌బాబు దాతృత్వం... మరో ఇద్దరు చిన్నారులకు హార్ట్ సర్జరీలు

Mahesh Babu helps two young kids undergo heart surgery

సూపర్‌స్టార్ మహేష్‌బాబు సినిమాల్లోనే కాదు... నిజజీవితంలోనూ శ్రీమంతుడినేనని నిరూపించుకుంటున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు ఆయన ఆపద్భాందవుడిగా నిలుస్తున్నారు. ఇప్పటికే ఏకంగా 1,020 మంది పిల్లలకు హార్ట్ సర్జరీలు చేయించిన ఆయన తాజాగా మరో ఇద్దరికి ప్రాణదానం చేశారు. ఈ విషయాన్ని ఆయన భార్య నమ్రతా శిరోద్కర్ సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు. చిన్నారులు పూర్తిగా కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయినట్లు తెలియజేస్తూ వారి ఫోటోలను షేర్ చేశారు.

‘మరో రెండు గుండెలు మా కుటుంబంతో కలిశాయి. ఇటీవల హార్ట్ ఆపరేషన్స్‌ చేయించుకున్న ఇద్దరు చిన్నారులు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారని తెలియజేయడానికి సంతోషపడుతున్నాం. క్లిష్ట సమయాల్లో కూడా ఉత్తమ ఆరోగ్య సేవలు అందించినందుకు ఆంధ్రా హాస్పిటల్స్‌ యాజమాన్యానికి ధన్యవాదాలు’ అని నమ్రత పేర్కొన్నారు. ఈ పోస్ట్ వైరల్ కావడంతో మహేష్‌ అభిమానులు తమ హీరో దాతృత్వం చూసి కాలరెగరేస్తున్నారు. ‘నువ్వు దేవుడివి సామీ.. ఆపదలో ఉన్నవారికి నువ్వు చేస్తున్న సాయం మరువలేనిది’ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.