వరద ప్రభావిత ప్రాంతాల్లో లోకేశ్ పర్యటన

Nara Lokesh Visits Rajahmundry Flood Affected Area

వరదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకునే తీరిక రాష్ట్ర ప్రభుత్వానికి లేకుండా పోయిందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‍ విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లాలో వరద ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఉదయం జగ్గయ్యపేట చేరుకున్న ఆయనకు టీడీపీ నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. జగ్గంపేట మండలం రామవరం నుంచి తన పర్యటనను ప్రారంభించి లోకేశ్‍, వరదలకు కూలిన ఇళ్ల, ముంపులో ఉన్న పొలాల్ని పరిశీలించారు. అనంతరం కిర్లంపూడి మండలం గోనెడలో ఏలేరు వరద ముంపులో ఉన్న పంట పొలాల్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు.

ఈ సందర్భంగా లోకేశ్‍ మాట్లాడుతూ వరదకు సంబంధించి అధికారులు ఎలాంటి ముందస్తు సమచారం ఇవ్వలేదని ఆరోపించారు. వేల ఎకరాల్లో పంట నీట మునిగి కౌలుదారులు, రైతులు తీవ్రంగా నష్టపోయారని లోకేశ్‍ ఆవేదన వ్యక్తం చేశారు. వరద ఉధృతికి కుప్పకూలిన ఇళ్లు, నీట మునిగిన పంట పొలాలను చూస్తుంటే మనసు చలించిపోయిందన్నారు. ఈ ఖరీఫ్‍ సీజన్‍లో ఏలేరుకు భీకర వరదలు వచ్చినా ప్రభుత్వం కనీసం పరిహారం కూడా అందించలేదంటూ బాధిత రైతులు లోకేశ్‍ వద్ద వాపోయారు.