US election polls tracker Will Donald Trump or Joe Biden win 2020 presidency

ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఇప్పుడు 20 రోజుల దగ్గరికి రావడం వలన సామాన్య ప్రజల దగ్గర నుంచి వివిధ దేశాల అధిపతులవరకు అందరిలోనూ ఆసక్తి, ఉత్కంఠ పెరుగుతోంది. అమెరికాలో పెద్ద మీడియా సంస్థలు, రాజకీయ విశ్లేషకులు, రీసెర్చ్ ఏజెన్సీస్ ప్రతి రోజు తమ తమ ఆలోచనలను మీడియా మూలంగా చెబుతున్నాయి. అమెరికా దేశం లో జరిగే ఎన్నిక పద్దతి ని, ప్రక్రియ ని వివరిస్తూ మొత్తం మీద ప్రస్తుతం ఉన్న పరిస్థితిని ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం ఇది.

ప్రెసిడెంట్ - వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలు

నాలుగేళ్ళకు ఒకసారి నవంబర్ మొదటి మంగళవారం ఎన్నికలు జరుగుతాయి. 1845 నుంచి ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. అమెరికాలోని 50 రాష్ట్రాలు, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియాతో ఉన్న రిజిష్టర్డ్ వోటర్స్ అందరూ ఆరోజు తమ వోటు హక్కును వుపయోగించి వోటు వేస్తారు. వీటిని పాపులర్ వోట్స్ అని అంటారు.ఎన్నికల రోజు ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ మాత్రమే కాకుండా ఫెడరల్, స్టేట్, లోకల్ ఎన్నికలలో ఏమన్నా పెండింగ్ ఉన్నా వాటిని కూడా ఈ అధ్యక్ష ఎన్నికలతో కలిపి నిర్వహిస్తారు. ప్రతి రాష్ట్రంలోనూ సెక్రటరీ ఆఫ్ ది స్టేట్ ఎన్నికలఅధికారిగా ఎన్నికలు నిర్వహిస్తారు. అమెరికాలోని అన్నీ రాష్ట్రాలలో ఉన్న జన సంఖ్యలో చాలా తేడాలు ఉంటాయి కాబట్టి ప్రజలు వేసే వోటును పాపులర్ వోటు అని చెబుతూ, ప్రతి రాష్ట్రం నుంచి ఎలెక్టర్స్ ద్వారా అంటే ఆ రాష్ట్రంలోని ప్రజలు దేశ అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు నిలబెట్టిన రిప్రజెంటెటివ్ ల ద్వారా ఎన్నుకొనే విధానాన్ని ఎలెక్టోరల్ వోట్ అని అంటారు. ఈ ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు డిసెంబర్ 12 వ తేదీ తరువాత వచ్చే సోమవారం నాడు దేశ అధ్యక్షుడిని ఎన్నుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

ఈ ఎలక్టొరల్ కాలేజీలో 538 మంది ఉంటారు. కాబట్టి 270 వోట్లు వచ్చిన అభ్యర్థి దేశ అధ్యక్షుడిగా ఎన్నికవుతారు. ప్రతి రాష్ట్రంలోనూ పాపులర్ వోట్ అంటే ఎక్కువమంది ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారో ఆ ప్రకారం వోటు వేస్తారు తప్పితే వారి వ్యక్తిగత అభిప్రాయాలు ఉండవు. దేశ అధ్యక్షుడు, ఉపాధ్యక్షులు ఎన్నిక అయ్యాక జనవరి 20వతేదీ నుంచి కొత్త అధ్యక్షుడు, కొత్త ప్రభుత్వం అధికారంలోకి వస్తాయి.

పాపులర్ ఓట్లే కీలకం

అమెరికాలోని అన్నీ రాష్ట్రాలలో కూడా పాపులర్ ఓట్లు ఏ పార్టీ, ఏ క్యాండిడేట్‌కు మెజారిటీగా వస్తుందో... ఎలక్టొరల్ వోట్ అదే సమర్థిస్తూ వోట్ వేస్తుంది అయితే మైనే, నెబ్రాస్కా వంటి రాష్ట్రాలలో ఈ నిబంధన వర్తించదు. నవంబర్ 3 వ తేదీ న ప్రజలు అందరూ వోట్ వేసిన తరువాత, డిసెంబర్ 12 తరువాత వచ్చే సోమవారంనాడు ఎలక్టొరల్ కాలేజీ వాళ్ళు వోటు వేస్తారు జనవరి మొదటివారంలో అప్పటి దేశ ఉపాధ్యక్షుని ఆధ్వర్యంలో వాటిని లెక్కించి ఫలితాలు వెల్లడిచేస్తారు. అయితే పాపులర్ వోట్ ప్రకారం ఎలక్టొరల్ వోట్ ఉంటుంది కాబట్టి ఈ లెక్కలు కేవలం లాంఛనమే అని చెప్పవచ్చు. పాపులర్ వోట్ల ఫలితాలు అందరికీ ముందే తెలిసిపోతాయి కాబట్టి.. ఈ లెక్కలపై పెద్దగా ఆసక్తి ఉండదు.

రెడ్ మరియు బ్లూ రాష్ట్రాలు

అమెరికా దేశంలోని 50 రాష్టాలను గత ఎన్నో సంవత్సరాలుగా వచ్చిన ఎన్నికల సరళి ని బట్టి రెడ్ స్టేట్ లేదా బ్లూ స్టేట్ గా పేర్కొంటారు. ఈ పద్దతి లో బ్లూ రంగు డెమొక్రాట్ పార్టీ ని రెడ్ రంగు రిపబ్లికన్ పార్టీ ని సపోర్ట్ చేసే రాష్ట్ర గా పేర్కొంటారు. చరిత్రాత్మకం గా అనేక ఎన్నికల సరళి చూసే వీటిని ఆ విధం గా నిర్ణయించారు. రిపబ్లికన్ పార్టీ ఇడాహో, వ్యోమింగ్, సౌత్ డకోటా, నార్త్ డకోటా, మోంటానా, ఉటా, కాన్సాస్, ఓక్లహోమా, మరియు నెబ్రాస్కా వంటి చాలా పర్వత రాష్ట్రాలు మరియు అలబామా, జార్జియా, మిసిసిపీ, లూసియానా లాంటి గ్రేట్ ప్లెయిన్స్, ఇంకా అర్కాన్సాస్, టేనస్సీ,సౌత్ కరోలినా,అలాస్కా రాష్టాలలలో పూర్తి మద్దతు సాధారణం గా తెచ్చుకొంటోంది కాబట్టి వీటిని బ్లూ స్టేట్స్ గా వర్ణిస్తారు.

అలాగే డెమొక్రాట్ పార్టీ సాధారణంగా మిడ్-అట్లాంటిక్ రాష్ట్రాలను, న్యూయార్క్, న్యూజెర్సీ, మేరీల్యాండ్ మరియు డెలావేర్లతో పాటు, న్యూ ఇంగ్లాండ్, వెర్మోంట్, మసాచుసెట్స్, రోడ్ ఐలాండ్, కనెక్టికట్, ఇంకా వెస్ట్ కోస్ట్ రాష్ట్రాలైన కాలిఫోర్నియా, ఒరెగాన్ మరియు వాషింగ్టన్ల లో పాటు హవాయి లలో పూర్తి మద్దతు తెచ్చుకొంటోంది కనుక వీటిని బ్లూ స్టేట్స్ గా వర్ణిస్తారు. ఇందులో కొన్ని రాష్ట్రాలు , అలాగే ఈ రెండు గ్రూప్ లలో లేని మరి కొన్ని రాష్టాలు ఈ రెండు పార్టీ లకు కొంచెం అనుకూలంగా ఉంటే ఆ రాస్త్రాలను లైట్ రెడ్ లేదా లైట్ బ్లూ రంగు వేసి చూపిస్తారు . రెండు పార్టీ లవాళ్ళు మొదటగా వారి వారి రాష్ట్రాలలో వున్నా మద్దతు ఏ విధంగా పెంచు కోవాలి, స్థిరం చేసుకోవాలి అనే పద్దతి లో ప్రణాళికలు సిద్ధం చేసుకొని అమలు చేస్తారు.

ప్రధాన అంశాలు: కోవిడ్ సంక్షోభం

కోవిడ్‌ని అరికట్టడంలో ట్రంప్ పాలనావిభాగం విఫలమైందని, ఇన్ని మరణాలు, ఇన్ని కేసులు రాకుండా ప్రభుత్వం కట్టడి చేయలేకపోయిందని డెమొక్రాట్స్ బాగా గట్టిగా తమ ప్రచారంలో పేర్కొంటున్నారు. అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న బైడెన్, ఉపాధ్యక్ష పదవిలో ఉన్న కమలాహారీస్ కూడా ఈ విషయాన్ని చాలా ముఖ్యమైన విషయంగా తమ ప్రసంగాలలోనూ, ప్రచారాల్లోనూ హైలైట్ చేస్తున్నారు. వారు చాలావరకు ఈ విషయంలో ప్రజలను ఒప్పించడంలో విజయం సాధించారని చెప్పవచ్చు. అయితే ఈ వాదనను రిపబ్లికన్స్ పార్టీ నాయకులు తిప్పికొడుతున్నారు. కోవిడ్ సంక్షోభం అధికంగా ప్రబలిన కాలిఫోర్నియా, న్యూయార్క్, న్యూజెర్సి రాష్ట్రాలు డెమొక్రాట్స్ చేతిలోనే ఉన్నాయి. ఆ రాష్ట్ర గవర్నర్లు తీసుకున్న నిర్ణయాలే ఆ రాష్ట్ర ప్రజలను కోవిడ్ బారిన పడేలా చేసిందని వారంటున్నారు. అంతేకాకుండా అమెరికా దేశంలో అన్నీ దేశాలకు చెందిన వ్యక్తులు నివసించడమే కాకుండా, ఆ దేశాల వారు అమెరికా పౌరులుగా కూడా ఉన్నారని, మొదటి నెలలోనే ఒక్క ఆర్డర్‌తో అమెరికాని మూసివేయలేమని వారు చెపుతున్నారు. ఉదాహరణకు ఒక్క కాలిఫోర్నియాలోనే 1,50,000 మంది చైనీయులు జనవరిలో చైనా వెళ్ళి ఫిబ్రవరిలో తిరిగి వచ్చారు. వారిలో చాలామంది అమెరికా పౌరసత్వం స్వీకరించినవారే. ఫిబ్రవరి లో కోవిద్ విషయం తెలియగానే వారిని రాకుండా ఆపలేమని , అమెరికాను మూసి వేయలేమన్న విషయాన్ని గమనించాలని రిపబ్లికన్లు అంటున్నారు.

ఎకానమీ

ప్రస్తుత ఎకానమి చాలా దారుణంగా పడిపోయిందని, దీనికి ట్రంప్ ప్రభుత్వం బాధ్యత వహించాలని డెమొక్రాట్స్ వాదిస్తున్నారు. అయితే జనవరి 2020 వరకు అమెరికా ఎకానామీ చాలా బావుందని తరువాత వచ్చిన కరోనా సంక్షోభంలో ట్రంప్ ప్రభుత్వం ఇతర దేశాల్లో ప్రకటించనన్ని ఆర్థిక ఉద్దీపనలను ఇచ్చిందని, దీనివల్ల చిన్న వ్యాపారుల నుంచి పెద్ద పారిశ్రామికవేత్తల వరకు అందరూ నిలదొక్కగలిగారని రిపబ్లికన్ పార్టీ వారు సమాధానం చెబుతున్నారు.

నిరుద్యోగ సమస్య

అమెరికా దేశం దాదాపుగా రెండవ ప్రపంచ యుద్ధం తరువాత పెద్దఎత్తున నిరుద్యోగ సమస్యను కోవిడ్ వలన ఎదుర్కొంటోంది. సెప్టెంబర్ నెలాఖరునాటికి నిరుద్యోగ భృతి కావాలి అని అడుగుతున్న వారి సంఖ్య దాదాపు 20 మిలియన్ దాటింది. ఈ సమస్య వలననే ఉద్యోగాలు కోల్పోయిన ఆఫ్రికన్ అమెరికన్లు పోలీసుల దురాగతం అంటూ పెద్దఎత్తున ప్రభుత్వంపై తిరగబడ్డారు. డెమొక్రాట్స్, బైడెన్ ఎన్నికల యంత్రాంగం ఇది ట్రంప్ ప్రభుత్వ వైఫల్యం అంటూ గట్టిగా ప్రచారం చేస్తోంది. అయితే జూన్ జూలై నుంచి ఆఫీస్ కార్యకలాపాలు, వాణిజ్య, వ్యాపార కార్యక్రమాలు కొంచెంకొంచెంగా మొదలవుడంతో ఉద్యోగావకాశాలు పెరగడం ప్రారంభమయ్యాయి. జూన్‌లో 14.7శాతంగా ఉన్న నిరుద్యోగ ఇండెక్స్ అక్టోబర్ మొదటివారానికి 7.9శాతానికి తగ్గిపోయింది. ఇంత వేగంగా ఈ సమస్య తగ్గటానికి కారణం మేము చేసిన ఆర్థిక ఉద్దీపనలే అని ట్రంప్ మద్దతుదారులు, రిపబ్లికన్ పార్టీ నాయకులు ప్రచారం చేస్తున్నారు.

స్వింగ్ రాష్టాల (తటస్థ రాష్ట్రాలు) ప్రభావం

అధ్యక్ష పదవి లో పోటీ చేస్తున్న ఇద్దరు అభ్యర్ధులకు ఈ తటస్థ రాష్టాలలో ఓట్లు సంపాదించటమే కీలకం అవుతుంది.. ఎవరు ఆ విషయం లో విజయం సాధిస్తారో, ఆ వ్యక్తి దాదాపు గా అధ్యక్షుడి గా ఎన్నిక అయినట్టే. ఇప్పుడు కూడా తటస్థ రాష్టాలయిన అరిజోనా, ఫ్లోరిడా, మైనే, మిచిగాన్, మిన్నెసోటా, నెబ్రాస్కా, నెవాడా, న్యూ హాంప్‌షైర్, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, మరియు విస్కాన్సిన్లలో జరిగే పోటీ, వచ్చే ఫలితాలు కీలకంఅని విశ్లేషకులు భావిస్తున్నారు. ఫ్లోరిడా, మిచిగాన్, పెన్సిల్వేనియా మరియు విస్కాన్సిన్లతో "బిగ్ ఫోర్" ఎక్కువగా ఎలక్టోరల్ కాలేజీని నిర్ణయిస్తుంది కాబట్టి ఆ రాష్టాలలో ఎన్నికలు మరింత కీలకం అని చెప్పొచ్చు

మతపరమైన సందేశాలు...ప్రమాణాలు

మనదేశంలో బిజెపి లేదా మోడీ అనగానే హిందుత్వవాది, మతతత్వవాది అని ఎలా అంటారో, అలాగే భారతీయ జనతా పార్టీ కూడా హిందుత్వ పేరుతో రామజన్మభూమి లాంటి కార్యక్రమాలను హైలైట్ చేస్తూ ప్రజలను ఎలా ఆకట్టుకుందో, అలాగే అమెరికాలో కూడా క్రిష్టియన్ కమ్యూనిటీని ఆకట్టుకునేలా కొన్ని పథకాలు, పనులను చేపడుతారు. కొన్ని ప్రణాళికలు ఇస్తారు. కొన్ని వాగ్దానాలు చేస్తారు. రెండు పార్టీలు ఈ పనిని చేస్తున్నాయి. రిపబ్లికన్ పార్టీ, డొనాల్డ్ ట్రంప్ ఈ విషయంలో ముందుంటున్నారని పరిశీలకులు అంటారు. అలాగే ట్రంప్ అన్ని దేశస్తుల మత పరమైన కార్య క్రమాలలకు మొదటి నుంచి మద్దతు ఇస్తూ వస్తున్నాడు. మన భారత దేశానికీ చెందిన హిందుత్వ మీద కూడా తన అభిప్రాయం చేప్పి , ప్రధాని మోడీ ని అభినదించిన వారిలో ట్రంప్ ఒకరు. ఇప్పుడు కూడా క్రిస్టియన్ మత పరమైన అన్ని వర్గాలకు , అన్ని రకాల కార్య క్రమాలకు ట్రంప్ యంత్రాంగం ప్రత్యక్షం గా లేదా పరోక్షం గా ప్రోస్తాహం ఇస్తుంది. అందు వలన ఈ మత పరమయిన నాయకులు ట్రంప్ ని ప్రోత్సహిస్తున్నారని తెలుస్తోంది.

సంపన్నులు - సామాన్యులు ...

సాధారణంగా రిపబ్లికన్ పార్టీకి సంపన్నులు, పెద్ద పారిశ్రామికవేత్తల మద్దతు ఉండగా, తక్కువ పన్నులు కట్టే చిన్న వ్యాపారవేత్తలు, ఉద్యోగులు డెమొక్రటిక్ పార్టీకి మద్దతు ఇస్తుంటారు. రిపబ్లిక్ పార్టీ పెద్ద వాణిజ్యాలు, పెద్ద పారిశ్రామిక పధకాలు, పెద్ద లాభాలు గురించి పాలసీ లు రూపొందించి ఎకానమీ ని పెంచాలి అనే అజెండా లో ఉంటుంది కనుక సంపన్నులు ఈ పార్టీ వెనుక వుంటారు. అలాగే డెమొక్రాట్ పార్టీ తక్కువ టాక్స్ లు, ఎక్కువ అవకాశాలు , ఎక్కువ ప్రొడక్టివిటీ మీద ఎకానమీ ని పెంచాలి అంటుంది కనుక చిన్న వాణిజ్యవేత్తలు, పారిశ్రామిక వేత్తలు ఆ పార్టీ వెనుక వుంటారు.

అయితే ట్రంప్ ట్రెడిషనల్‌గా డెమొక్రటిక్ పార్టీకి మద్దతుగా ఉండే బ్లూ కలర్ వర్కర్స్ (పెన్సిల్వేనియాలో మైన్స్ లో పనిచేసేవాళ్ళు, మిచిగన్‌లో అటోమొబైల్ ఇండస్ట్రీలో పనిచేసేవాళ్ళు) సంపాదన 60000 డాలర్ల కన్నా తక్కువ జీతం వచ్చే ఉద్యోగులను తన మాటలతో, వాగ్దానాలతో తనవైపునకు తిప్పుకున్నారు. 'మీ అందరినీ ఒబామా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది' అని మాటలతో నమ్మించాడు. అందుకనే 2012లో ఒబామా పార్టీ డెమొక్రటిక్కి వోటు వేసిన పెన్సిల్వేనియా, మిచిగన్ రాష్ట్రాలు, 2016లో అదే పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు వోటు వేయలేదు. ఆ రాష్ట్రాలు ట్రంప్‌కు మద్దతుగా నిలిచి ట్రంప్‌ను గెలిపించాయి. ఇప్పుడు 2020లో బైడెన్ ఎన్నికల యంత్రాంగం ఈ వర్గాన్ని మళ్ళీ తమవైపు తిప్పుకునేందుకు పెద్దగా ఎలాంటి పనులు, ప్రణాళికలు చేయకపోవడంతో, దాంతో వీరు ఈసారి కూడా ట్రంప్‌వైపు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు.

చిన్న చిన్న గ్రూపులను ప్రభావితం చేసే పద్ధతులు

దేశం మొత్తం యుద్ధ ప్రణాళికను మించి ఎన్నికల సమరం జరుగుతుండగా ట్రంప్ యంత్రాంగం ప్రతి పట్టణం, ప్రతి గ్రామంలోని చిన్న చిన్న గ్రూపులకు చేరేలా తన ప్రచారాన్ని నిర్వహిస్తోంది. 2016లో కూడా ట్రంప్ ఈ ప్రచారాన్ని విజయవంతంగా చేయగలిగాడు కనుకనే గెలిచాడని చాలామంది అంటారు. అంటే ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలోనూ ఉన్న గ్రూపుని కలిసి వారి సమస్యలు అర్థం చేసుకుని, వారికి కావాల్సిన విధంగా హామీలు ఇవ్వడం అనేది ఒక మైక్రో టార్గెటెడ్ ఎలక్షన్ స్ట్రాటజీగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఉదాహరణ కు అమెరికాలో ఉన్న భారతీయ ఓటర్లను ఆకర్షించేందుకు ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికే ఇండియన్ వాయిస్ ఫర్ ట్రంప్, సిఖ్ వాయిస్ ఫర్ ట్రంప్ లాంటి 30 గ్రూపులను తయారు చేసింది. ప్రతి గ్రూపులో దాదాపు 20 మంది సభ్యులు ఉండి వారు వారికి తెలిసినవారికి వాట్సప్ ద్వారా, స్వయంగా కలవడం ద్వారా ట్రంప్ ప్రభుత్వ పథకాలను తెలియజేస్తారు. ట్రంప్ ప్రభుత్వం భారతీయులకు ఏమి చేసింది? ఇండియాకి ఏమి చేసింది లాంటి విషయాలను తెలియజేస్తున్నారు.ఆ విధంగా అన్నీ మైనారిటీ గ్రూపులకు ట్రంప్ యంత్రాంగం కనెక్ట్ అవుతోంది. గత వారంరోజులలో అనేకమందితో మాట్లాడిన తరువాత సేకరించిన వివరాలు గమనించిన తరువాత పోటాపోటీగా ఉన్నా మళ్ళీ ట్రంప్ గెలవడం ఖాయమని తెలుస్తోందని చాలామంది చెబుతున్నారు.

అమెరికా మీడియా ఏమంటోంది?

మన రాష్ట్రంలో, మనదేశంలో మీడియా ఏ విధంగా ఏదో ఒక పార్టీకి లేదా రూలింగ్ పార్టీకి దగ్గరగా ఉంటుందో, అమెరికాలో కూడా రానురాను మీడియా సంస్థలు డెమొక్రాట్ లేదా రిపబ్లికన్ పార్టీలకు దగ్గరగా ఉంటున్నాయి. ఆయా కంపెనీల ఓవరాల్ పాలసీ ప్రకారం తమకు ఇష్టమైన పార్టీని వారి న్యూస్, విశ్లేషణల ద్వారా, ఇంటర్వ్యూల ద్వారా ప్రొజెక్ట్ చేయడంలోనూ ముందుంటున్నాయి. ప్రస్తుతం న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్ లాంటి ప్రపంచంలోనే పేరు పొందిన పత్రికలు, సిఎన్ఎన్, ఎంఎన్బిసిలాంటి అగ్ర టీవీ ఛానల్స్ డెమొక్రటిక్ పార్టీకి మద్దతుగా బైడెన్ గెలుస్తాడనే కథనాలను రాస్తున్నాయి. అలాగే వాషింగ్టన్ టైమ్స్, ఎల్ఎ టైమ్స్ లాంటి ప్రధాన దినపత్రికలు, ఫాక్స్ న్యూస్ లాంటి పేరుపొందిన టీవీ ఛానల్స్ రిపబ్లికన్ పార్టీకి మద్దతుగా కథనాలు రాస్తున్నాయి. వాల్‌స్ట్రీట్ జర్నల్ కూడా తటస్థంగా ఉన్నట్లు కనిపిస్తూనే రిపబ్లికన్ పార్టీకి మద్దతుగా ఉంటోంది.