టాలీవుడ్ లో భారీ ఈవెంట్స్ వైభవం కొనసాగేనా?

Corona Effect on big events in tollywood

ఏడు నెలల ముందు చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా ఆడియో ఫంక్షన్స్ గాని ప్రీ రిలీజ్ ఈవెంట్స్ , ప్రెస్ మీట్స్, సక్సెస్ మీట్స్  లక్షలు వెచ్చించి ఎంతో ఘనంగా చేసేవారు. అటు ఎలక్ట్రానిక్ మీడియాకు, ఇటు ప్రింట్ మీడియాకు, సోషల్ మీడియాకు  ఫుల్ స్టఫ్ దొరికేది. అభిమానుల కేరింతలు సరేసరి... !  మాయదారి కరోనా మహమ్మారీ ఎంత పెద్ద దెబ్బ కొట్టింది? ఒకే ఒక్క దెబ్బకు  సినిమా  సందడి అంతా చటుక్కున మాయమైంది.  కరోనా లాక్ డౌన్ కి ముందు.. లాక్ డౌన్ తర్వాత అని మాట్లాడుకునే రోజులు వచ్చాయి. టాలీవుడ్ లో అప్పటివరకూ ప్రీరిలీజ్ లు ఆడియో వేడుకలు సక్సెస్ మీట్లు అంటూ ఒకటే హంగామా కొనసాగేది. నిరంతరం 150 మంది సినీజర్నలిస్టులు ప్రెస్ మీట్ల పేరుతో ఎప్పుడూ ఒకటే హడావుడిగా ఉండేవారు. ఒకే ఒక్క దెబ్బకు అన్నీ ఝామ్ అయిపోయాయి. మార్చి చివరిలో మొదలైంది మహమ్మారీ. ఇప్పటికి ఐదారు నెలలు అయ్యింది. టాలీవుడ్ లో షూటింగులు బంద్.. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు బంద్.. టోటల్ ప్రపంచమే బంద్ అయ్యింది. అన్ని పరిశ్రమలతో పాటు టాలీవుడ్ కూడా మూత పడిపోయింది. ఇది తీరని ఎడబాటు అందరికీ. ఇక నిరంతరం ప్రెస్ మీట్లు ఈవెంట్లు అంటూ తిరిగే సినీజర్నలిస్టులకు అయితే అసలు ఏదీ లేకుండా అయిపోయింది.

కోవిడ్ ఉన్నా ఫ్రంట్ లైన్ వారియర్స్ అంటూ జనరల్ .. పొలిటికల్.. హెల్త్ వింగ్ జర్నలిస్టులు పరుగులు పెడుతున్నా సినీజర్నలిస్టులకు మాత్రం కావాల్సినంత విశ్రాంతి లభించింది. బయట తిరిగే పని లేకుండా ప్రింట్ మీడియా జర్నలిస్టులు ఆఫీసుల్లో కామ్ గా పని చేసుకుంటున్నారు. సెలబ్రిటీల జూమ్ ఇంటర్వ్యూలతో సరిపెట్టుకుంటున్నారు. ఈమీడియా .. ఫోటో జర్నలిస్టులకు కొన్నిటికి తప్పలేదు కానీ వాళ్లు కూడా సైలెంట్ గానే ఉన్నారు. ఇక సీసీసీ సరుకుల పంపిణీ వేళ క్రిటిక్స్ మీట్లకు మాత్రం వెళ్లారు కొందరు. అయితే ఇటీవల ఏమైందో కానీ పిడుగు పాటులా అడపా దడపా ప్రెస్ మీట్లు పెడుతున్నారండోయ్. కరోనాకు ముందు ఎప్పుడూ ఓపెనింగుల హడావుడి ఉండేది. కానీ ఇప్పుడు సినిమాల ఓపెనింగులన్నీ వాట్సాప్ లలోనే సమాచారం వచ్చేస్తోంది. పూజ ఠెంకాయ కార్యక్రమం అంటూ ఏదో ఒకటి పంపేస్తున్నారు. మొన్న ఒక్క ఓపెనింగ్ వేడుక జరిగిందటగా!! అని జర్నలిస్టులు ఆరాలు తీసుకునే పరిస్థితి. అంతగా 150 మంది జర్నలిస్టులు ఎటు మాయమయ్యారో ఎవరికీ తెలీదు. ఇందులో కొందరు మాత్రమే ఆఫీసులకు వెళితే చాలా మంది ఊళ్లకు జంప్. ఇక కంటెంట్ రైటర్ల వరకూ ఇండ్ల నుంచే స్టోరీలు వార్తలు రాస్తూ కాలక్షేపం చేస్తున్నారు తప్ప బయట తిరిగేందుకు సాహసించలేదు. ఒకప్పుడు సినిమా వస్తుందంటే ఫస్ట్ లుక్ పోస్టర్ నుండి విడుదలకు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ వరకు ఏదో ఒక ఫంక్షన్ చేస్తూ హడావిడి చేసేవారు. భారీ స్థాయిలో పొలిటికల్ మీటింగ్స్ పెట్టినట్లుగా సినిమాల ఫంక్షన్స్ కూడా జరిపేవారు.

ఈ వేడుకలు నిర్వహణకు మేకర్స్ భారీగానే ఖర్చు చేసి ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలకు ఫంక్షన్ నిర్వహణ బాధ్యతలు అప్పగించేవారు. ప్రముఖ యాంకర్స్ తో హోస్ట్ చేపించేవారు. తమ అభిమాన నటీనటులను చూడటానికి పెద్ద ఎత్తున ఫ్యాన్స్ తరలి వచ్చి కరతాళధ్వనులతో సందడి సందడి చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. సినిమా ఆడియో వేడుకలు.. ప్రీ రిలీజ్ ఈవెంట్లు చూసి చాన్నాళ్ళై పోయింది. ఇకపై అలాంటి ఈవెంట్స్ చూడబోతున్నామో లేదో అనే సందేహాలు కలుగుతున్నాయి.వాస్తవానికి బాలీవుడ్ లో ఇలాంటి సినిమా కోసం భారీ ఈవెంట్స్ చేయడం బంద్ చేసి చాలా ఏళ్లయింది. సింపుల్ గా ఓ ప్రెస్ మీట్ పెట్టి ప్రమోషన్స్ కానిచ్చేస్తుంటారు. ఇప్పుడు టాలీవుడ్ లో కూడా ఇలాంటి మార్పులే చోటు చేసుకోబోతున్నాయి అంటున్నారు.

ఇప్పటికే ఇలాంటి ప్రోగ్రామ్స్ పై ఆడియెన్స్ తో పాటు హీరోలకి కూడా బోర్ కొట్టేసిందని తెలుస్తోంది. అందుకే ఇకపై భారీ సినిమా ఈవెంట్స్ కాకుండా సింపుల్ అండ్ స్వీట్ గా మీటింగ్స్ ఉండాలని సినీ ప్రముఖులు ఆలోచిస్తున్నారట. ఇటీవల ఓటీటీ లో రిలీజ్ అయ్యే సినిమాల ప్రమోషన్స్ కి సంబంధించిన అన్ని కార్యక్రమాలు ఆన్లైన్ లో జరిపిన సంగతి తెలిసిందే. హీరో హీరోయిన్ ల ఇంటర్వ్యూ లు కూడా జూమ్ ద్వారా కొనసాగుతున్నాయి  'ఒరేయ్ బుజ్జిగా' ఈవెంట్ కూడా చాలా సింపుల్ గా చేయడం చూసాం. అయితే ఈ నిర్ణయం వల్ల టాలీవుడ్ లో సినీ ఈవెంట్స్ కి పేరుగాంచిన ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలకు పెద్ద దెబ్బ అనే చెప్పవచ్చు. మళ్ళీ  టాలీవుడ్ లో భారీ ఈవెంట్స్  వైభవం కొనసాగేనా? 

 


                    Advertise with us !!!