జ‌మిలికి జై కొట్టిన‌ జ‌గ‌న్‌, బాబూ సై..

YS Jagan And KTR Supports Jamili Election

దేశ‌వ్యాప్తంగా జ‌మిలి ఎన్నిక‌లు దాదాపు ఖాయ‌మే. రానున్న 2022లో అటు పార్ల‌మెంట్‌, ఇటు శాస‌న‌స‌భ‌ల‌కు ఒకేసారి ఎన్నిక‌ల న‌గారా మోగ‌నున్న‌ట్టు స్ప‌ష్టంగా తెలుస్తోంది. గ‌త కొంత కాలంగా చోటు చేసుకుంటున్న ప‌రిణామాల‌తో పాటు, తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ఊపందుకున్న రాజ‌కీయ కార్య‌క‌లాపాలు.. తాజాగా   ఆంధ్ర‌ప్ర‌దేశ్ విప‌క్ష నేత 40 ఏళ్ల సీనియారిటీ ఉన్న‌ చంద్ర‌బాబు నోట వ‌చ్చిన జ‌మిలి ఎన్నిక‌ల మాట‌తో... రెండున్న‌రేళ్ల‌లో దేశంలో మ‌రో విప్ల‌వాత్మ‌క ప్ర‌జాస్వామ్య మార్పు జ‌ర‌గ‌డం ఖాయంగా అనిపిస్తోంది. ఈ నేప‌ధ్యంలో జ‌మిలి ఎన్నిక‌ల‌ గురించి...

వ‌న్ నేష‌న్‌..వ‌న్ ఎల‌క్ష‌న్‌...

 గ‌త 1967 ఎన్నికలలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ ఏక ఛత్రాధి పత్యం అంతమైంది. ప్రాంతీయపార్టీల ప్రాభవం పెరిగింది. సంకీర్ణ యుగం మొదలయింది. ఈ కారణాల వల్ల స‌హ‌జంగానే అస్థిరత చోటు చేసుకున్నది. పరిపాలనకు గండి పడింది. అతుకుల బొంతల సంకీ ర్ణ ప్రభుత్వాలు ఏర్పరచడం, పార్లమెంటులో అడుగుపెట్టకుండానే ప్రధాని రాజీనామా సమర్పించిన సందర్భం కూడా చోటు చేసుకుంది. దీంతో ఈ జిమిలి ఎన్నిక‌ల ఆలోచ‌న అంకురించింది. 

ఎన్నో క్లిష్ట‌మైన ప‌రిపాల‌నా సంస్క‌ర‌ణ‌ల‌కు ఓటేసిన భాజాపా ప్ర‌భుత్వం జ‌మిలి ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ ఘ‌న‌త‌ను కూడా త‌న ఖాతాలో వేసుకోవాల‌ని నిర్ణ‌యించుకుంది.  అటు కేంద్రంలోనూ (లోక్‌సభ), ఇటు అన్ని రాష్ట్రాల్లోనూ (శాసనసభలు) ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల వృధా ఖర్చు, పరిపాలన స్తంభనను, ఇతరత్రా సమస్యలను అటు కేంద్రంలోనూ (లోక్‌సభ), ఇటు అన్ని రాష్ట్రాల్లోనూ (శాసనసభలు) ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల వృధా ఖర్చు, పరిపాలన స్తంభనను, ఇతరత్రా సమస్యలను అధిగమించవచ్చని నీతి అయోగ్ 4 ఏళ్ల క్రిత‌మే కేంద్రానికి నివేదించింది. ఇదే అంశంపై గతంలో పార్లమెంటరీ స్థాయీసంఘం, కేంద్ర ఎన్నికల సంఘం, ఇతర సంస్థలు, మేధావులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, సలహాలు, సూచనలన్నింటినీ క్రోడీకిరిచిన నీతి ఆయోగ్ దేశమంతా ఒకేసారి ఎన్నికల నిర్వహణపై కేంద్రానికి  నివేదిక సమర్పించింది. ఎన్నికల నియమావళి పేరుతో నిష్క్రియాపరత్వం పాటించవలసిన రోజుల సంఖ్య తగ్గుతుందనీ, ప్రతి సంవత్సరం రెండు, మూడు రాష్ట్రాలలో ఎన్నికలు వల్ల కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ సైతం కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి సంకోచిస్తుందనీ, ఒకేసారి అన్ని ఎన్నికలు జరిగితే ప్రభుత్వాలన్నీ పాలన పైన దృష్టి పెట్టవచ్చుననీ ఈ ప్రతిపాదనను బ‌ల‌ప‌రుస్తున్న వారి అభిప్రాయం ఈ నివేదిక‌కు బల‌మిచ్చింది. 

చ‌ట్ట స‌వ‌ర‌ణ త‌ప్ప‌నిస‌రి...

సమాంతర ఎన్నికలపైన 2018 ఆగస్టులో లా కమిషన్‌ ఒక ముసాయిదా నివేదిక సమర్పించింది. దాని ప్రకారం చట్టానికి సవరణ చేసిన తర్వాత దానిని దేశంలోని సగం  రాష్ట్రాల శాసనసభలు ఆమోదించాలి. బీజేపీ సగానికి పైగా రాష్ట్రాలలో అధికారంలో ఉన్న కారణంగా అది తేలికే. అయితే జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే కొన్ని శాసనసభల పదవీ కాలాన్ని పొడిగించాలి. మరి కొన్ని శాసనసభల గడువును  కుదించవలసి రావచ్చు. ఇటువంటి పని ఏది చేయాలన్నా రాజ్యాంగ సవరణ అవసరం. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సవరణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందాలంటే ఉభయ సభలూ మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆమోదించాలి. నేషనల్‌ డెమొక్రాటిక్‌ అలయెన్స్‌ (ఎన్‌డీఏ)కి లోక్‌సభలో మూడింట రెండు వంతుల ఆధిక్యం ఉన్నది కానీ రాజ్యసభలో లేదు. అందుకే కేంద్రంలోని పెద్ద‌లు ప్రాంతీయ పార్టీలను ప్రసన్నం చేసుకోవడానికీ లేదా చీల్చడానికీ ప్రయత్నిస్తున్నారనే ఆరోప‌ణ‌లున్నాయి.

రెండేళ్లు..మూడేళ్లు...

జ‌మిలి పుణ్య‌మాని ప‌లు రాష్ట్ర ప్ర‌భుత్వాల ప‌ద‌వీ కాలం 2 నుంచి మూడేళ్ల లోపే ముగియ‌నుంది. ఇంకా మూడేళ్లు ఉండ‌గానే మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్‌లో  2022లో  మళ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. అలాగే... 2020లో ఢిల్లీ, బీహార్, పాండిచ్చేరి, 2021లో బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోంలో ఎన్నికలు జరిపినా... కేవ‌లం ఏడాదిన్న‌ర‌ తర్వాత జమిలిలో భాగంగా మరోసారి ఎన్నికలు నిర్వహించాల్సి వ‌స్తుంది.  ఇక 2022లో గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, హిమాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్‌లో జరిగే ఎన్నికల్ని జమిలిలో భాగంగా నిర్వహిస్తారని సమాచారం. అలాగే... 2023లో జరిగే తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు, 2024లో జరిగే ఆంధ్రప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్ని కూడా 2022లో ముందస్తుగా జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి.

జ‌గ‌న్‌, కెసియార్‌.. ఓకే..

దేశంలో సగం రాష్ట్రాలు ఒప్పుకుంటే చాలు జమిలికి వెళ్లొచ్చు. లోక్ సభతోపాటూ... అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకూ ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా  రాష్ట్రాలనూ ఒప్పించేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే చాలా రాష్ట్రాలు ఇందుకు ఒప్పుకున్నాయట‌. ఏపీలో కొత్తగా అధికారంలోకి వచ్చిన వైసీపీ తాను దాదాపు రెండేళ్ల ప‌ద‌వీ కాలాన్ని త్యాగం చేయ‌డానికి కూడా సిద్ధ‌ప‌డుతూ  ఓకే చెప్పిందనే ప్ర‌చారం జ‌రుగుతోంది. అలాగే తెలంగాణ లోని కెసియార్ ప్ర‌భుత్వం కూడా జ‌మిలికి రెడీ అంటోంద‌ని తెలుస్తోంది. ప్రస్తుతం బీజేపీ 16 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఈ రాష్ట్రాలన్నీ జమిలి ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాయి. వీటితోపాటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయంటున్నారు.  అందువల్ల ఇక రాజ్యాంగంలో సవరణలు చెయ్యడమే బీజేపీకి మిగిలివున్న సమస్య. అందుకే ఇతర పార్టీల నుంచీ వలసల్ని ప్రోత్సహిస్తూ... రాజ్యసభలో సంఖ్యను పెంచుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇక‌ 2021లో బీజేపీకి రాజ్యసభలో కూడా మెజార్టీ పెరుగుతుంది. ఆ తర్వాత ఆ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా, దాన్ని ఆపే శక్తి ఏ పార్టీకీ ఉండదు. కాబట్టి 2022లో జమిలి ఎన్నికలు జ‌రిపి తీరుతామ‌ని బీజేపీ ధీమాగా ఉంది. ఈ నేప‌ధ్యంలో తాజాగా ఏపీ ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు సైతం త‌న పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు జ‌మిలి ఎన్నిక‌ల‌కు సిద్ధంగా ఉండాలంటూ పిలుపినిచ్చారు. సో.. ఏ ర‌కంగా చూసినా మ‌రో రెండున్న‌ర ఏళ్ల‌లో దేశ‌వ్యాప్తంగా ఎన్నిక‌ల పండుగ త‌ప్ప‌క‌పోవ‌చ్చు.