రివ్యూ : వామ్మో! అనిపించే 'ఒరేయ్ బుజ్జిగా...'

Orey Bujjiga Movie Review

తెలుగుటైమ్స్.నెట్  రేటింగ్ : 2/5
బ్యానర్ : శ్రీ సత్య సాయి ఆర్ట్స్
నటీనటులు : రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్, హెబా పటేల్‌, వాణీ విశ్వనాథ్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళి, అజయ్ ఘోష్, సప్తగిరి, అన్నపూర్ణ, రాజా రవీంద్ర , భద్రం తదితరులు
సినిమాటోగ్రఫీ : ఆండ్రూ; ఎడిటర్ : ప్రవీణ్ పూడి; మ్యూజిక్ : అనూప్ రూబెన్స్; సమర్పణ : లక్ష్మి రాధా మోహన్
నిర్మాత : కె.కె.రాధా మోహ‌న్
కథ,  స్క్రీన్ ప్లే, దర్శకత్వం : కొండా విజయ్‌కుమార్‌

గుండె జారి గల్లంతయ్యిందే లాంటి ప్రేమ కథతో అభిరుచి ఉన్న దర్శకుడిగా పరిచయమైన విజయ్ కుమార్ కొండా, వరుస  పరాజయాలు తో కొట్టుమిట్టాడుతున్న  రాజ్ తరుణ్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ఒరేయ్ బుజ్జిగా. నిర్మాత కేకే రాధామోహన్ రూపొందించిన ఈ చిత్రం మార్చ్ 25న  విడుదల చేయడానికి ప్లాన్ చేసారు అయితే లాక్‌డౌన్ కారణంగా విడుదల నిలిచిపోయింది. ఈ క్రమంలో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు వారి యాప్ ఆహా ‌ ద్వారా రిలీజైన ఈ  చిత్రం ఎలా ఉందొ సమీక్షా లో  తెలుసుకుందాం.

కథ :
శ్రీను అలియాస్ బుజ్జి (రాజ్‌ తరుణ్) కృష్ణవేణి (మాళవిక నాయర్) ఒకే ఊరికి చెందిన వాళ్లు. ప్రేమను దక్కించుకోవడానికి శ్రీను.. ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం కష్టంగా భావించిన కృష్ణవేణి ఒకే సమయంలో ఒకే ట్రైన్‌లో ఊరి నుంచి పారిపోతారు. ట్రైన్‌లో ఒకరికొకరు పరిచయం కాగా బుజ్జి తన పేరు శ్రీను అని, కృష్ణవేణి తన పేరు స్వాతి అని పరిచయం చేసుకొంటారు. వారిద్దరూ లేచిపోయారనే పుకారుతో శ్రీను, కృష్ణవేణి కుటుంబాల మధ్య చిచ్చు రేపుతుంది. హైదరాబాద్‌కు వెళ్లిన ఇద్దరు ఫ్రెండ్లీగా ఉంటారు. అయితే ఈ క్రమంలో ఊర్లో రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయనే విషయంతో కృష్ణవేణిని వెతికేందుకు శ్రీను ప్రయత్నిస్తుంటాడు. అయితే తన ఇమేజ్‌ను డామేజ్ చేసిన బుజ్జిగాడంటే కృష్ణవేణి కోపం పెంచుకొంటుంది. అయితే స్వాతిగా పరిచయమైన కృష్ణవేణికి, శ్రీనుగా పరిచయమైన బుజ్జిగాడికి మధ్య ప్రేమ పుడుతుంది. చివరకు వీరికి ఒకరికి ఒకరు ఎవరనేది ఎలా తెలుస్తోంది. అంతలో సృజన (హెబ్బా పటేల్)తో బుజ్జిగాడి సిల్లీ ఫెయిల్యూర్ లవ్ స్టోరీ ఏమిటి ? ఈ మధ్యలో కృష్ణవేణికి బుజ్జికి వచ్చిన సమస్యలు ఏమిటి ? వీరిద్దరూ ఆడిన చిన్న అబద్దాలు కారణంగా వీరి జీవితాల్లో ఎలాంటి డ్రామా నడిచింది ? అంతిమంగా వీరు ఎలా ఒకటి అయ్యారు ? అనేదే మిగిలిన కథ.అనేదే మిగిలిన కథ.

నటీనటుల హావభావాలు :
ఇక రాజ్ తరుణ్‌ విషయానికి వస్తే కొత్తగా చేయడానికి విషయం లేకపోయింది. ఇలాంటి పాత్రల్లో ఆయనను ఎన్నో సినిమాల్లో చూశారు. టాలీవుడ్‌లో ఇలాంటి కథలు చాలానే వచ్చాయి. రాజ్‌ తరుణ్‌ను విభిన్నంగా చూడాలనుకొనే ప్రేక్షకులకు కాస్త నిరాశనే. లవర్ బాయ్‌గా, సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా, ప్రేమ కోసం పరితపించే యువకుడిగా డిఫరెంట్ షేడ్ పాత్ర అయినప్పటికీ.. కథలో వెరైటీ లేకపోవడం, కొత్తగా కథ చెప్పకపోవడంతో శ్రీనుగాడి రూపంలో బుజ్జిగాడు ఆకట్టుకోలేకపోయాడు. ఇక మాళవిక విషయానికి వస్తే.. రాజ్ తరుణ్‌కు ఎదురైన పరిస్థితే కనిపించింది. బేసిగ్గా పాత్రలో ఎమోషన్స్ కొత్తగా లేకపోవడం, ప్రేక్షకులను మైమరిపించే విధంగా పాత్ర లేకపోవడంతో మాళవిక నటన కూడా ఓ పరిధి మేరకే పరిమితమైందనే ఫీలింగ్ కలుగుతుంది. కొన్ని సీన్లలో తప్ప ఓవరాల్‌గా మెప్పించినట్టు ఎక్కడా కనిపించదు. హెబ్బా పటేల్ ఆధునిక భావాలున్న యువతిగా అతిథి పాత్రకే పరిమితమైంది. ఈ సినిమాకు పెద్దగా ఉపయోగపడే పాత్ర కాదని కచ్చితంగా చెప్పవచ్చు. వాణి విశ్వనాథ్ పాత్ర రకరకాల రోల్స్, కథ, కథనాల మధ్య నలిగిపోయిందనే చెప్పవచ్చు.పోసాని, సప్తగిరి, సత్య, రాజా రవీంద్ర, సత్యం రాజేశ్, వీకే నరేష్, మధుసూదన్, అనిష్ కురివిల్లా లాంటి పాత్రలు ఎక్కువగానే ఉన్నప్పటికీ.. ఏ ఒక్క పాత్ర కూడా బ్రహ్మండంగా అనిపించలేదు. వీకే నరేష్ కొంతలో కొంత ఫర్వాలేదనిపించారు.

సాంకేతిక వర్గం పనితీరు :
విజయ్ కుమార్ కొండా విషయానికి వస్తే.. ఒకే రకమైన పార్మాట్‌నే నమ్ముకొని సినిమా తీసినట్టు కనిపిస్తుంది.   ఫేస్‌బుక్, ఫోన్లతో మరోసారి మ్యాజిక్ చేద్దామనే ప్రయత్నం అంతగా సఫలం కాలేదనే చెప్పవచ్చు. రొమాంటిక్ సన్నివేశాలు రాసుకోవడంలోనూ, కథను కొత్తగా చెప్పడంలో తడబాటుకు లోనయ్యాడు.  హాస్పిటల్‌లో సన్నివేశాలను మరీ మూసగా చిత్రీకరించారనిపిస్తుంది. అలాంటి నాసిరకం సీన్లు ఎక్కువగానే ఉన్నాయని చెప్పవచ్చు.సాంకేతిక విషయాలకు వస్తే.. అనూప్ రూబెన్స్ సంగీతం బాగుంది. మాస్ పాటలు తెరపై మంచి హుషారు రేకెత్తించాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వల్ల కొన్ని సీన్లు మెరుగ్గా కనిపించాయి. ప్రవీణ్ పుడి ఎడిటింగ్‌కు ఇంకా స్కోప్ ఉంది.  అండ్రూ సినిమాటోగ్రఫి ఒకే అని చెప్పవచ్చు. నిర్మాత కేకే రాధామోహన్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.

విశ్లేషణ :
రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ అంటూ వచ్చిన ఈ సినిమా.. అక్కడక్కడా కొన్ని కామెడీ సీన్స్ తో మరియు కొన్ని లవ్ సీన్స్ తో కొన్ని చోట్ల బాగానే అలరిస్తుంది. ఇక మాళవిక నటన, రాజ్ తరుణ్ కామెడీ ఈజ్, హెబ్బా గ్లామర్ సినిమాకి ప్లస్ అయ్యాయి. కానీ నెమ్మదిగా సాగే కథనం, చాలా సన్నివేశాలు మరీ నాటకీయంగా ఉండటం, దీనికి తోడు బోరింగ్ ట్రీట్మెంట్ తో సినిమా ఇంట్రస్ట్ గా సాగదు.  ప్రేయసి సృజన ప్రేమను పొందేందుకు శ్రీను ఇంటి నుంచి పారిపోవడం, అలాగే సొంత బావను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని కృష్ణవేణి నిడదవోలు నుంచి హైదరాబాద్‌కు ఓకే ట్రైన్‌లో పారిపోవడంతో కథ  మొదలవడం. హైదరాబాద్‌లో వారిద్దరి కలిసి తిరుగుతూనే కృష్ణవేణి కోసం శ్రీను.. బుజ్జిగాడి కోసం కృష్ణవేణి వెతకడమనే చిన్న ట్విస్టుతో సినిమా బాగా  సాగదీసినట్టుగా అనిపిస్తుంది.  కృష్ణవేణి ఎవరో తెలిసిన తర్వాత బుజ్జిగాడు ఎవరో తెలియడానికి, కృష్ణవేణికి తానే బుజ్జిగాడినని శ్రీను చెప్పడానికి సినిమా అనేక మలుపు తిరుగుతుంది. అయితే ఈ కథ చెప్పే విధానం రొటీన్‌గా ఉండటం, నాసిరకమైన కామెడీ కారణంతో ఓ దశలో సహనానికి పరీక్షగా మారుతుంది. డ్రామా మోతాదు మించడం ఇబ్బందిగా ఉంటుంది. చివర్లో కథను ఫీల్‌గుడ్‌గా మార్చడంతో ఒరేయ్ బుజ్జిగా పర్వాలేదనే ఫీలింగ్ కలుగుతుంది. మొత్తం మీద ఈ సినిమాలో యూత్ కి నచ్చే అంశాలు కొన్ని ఉన్నా.. మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను మాత్రం ఈ సినిమా అంతగా ఆకట్టుకోదు.