After rumours on SP Balasubrahmanyam's treatment

మ‌ధుర గాయ‌కుడు, భార‌త‌దేశం గ‌ర్వించ‌ద‌గ్గ మ‌ధుర గాయ‌కుడు ఎస్‌.పి.బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఇప్పుడు మ‌న మ‌ధ్య లేర‌న్న విష‌యం ఎవ‌రూ జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఆయ‌న అభిమానులు క‌న్నీరు మున్నీర‌వుతున్నారు. ఆయ‌న మృతికి దేశ ప్ర‌ధాని నుంచి సామాన్యుల వ‌రకు అంద‌రూ త‌మ సంతాపాన్ని, సానుభూతిని తెలియ‌జేశారు. గ‌త శుక్ర‌వారం క‌న్ను మూసిన బాలు అంత్య‌క్రియ‌లు శ‌నివారం జ‌రిగాయి. ఆయ‌న‌కు తెలుగు జాతి క‌న్నీటి వీడ్కోలు ప‌లికింది. ఇదిలా ఉంటే ఓ కొత్త వివాదాం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. బాలుకి చికిత్స చేసిన ఎంజిఎం యాజ‌మాన్యంతో బాలు కుటుంబానికి బిల్లు విష‌యంలో వివాదం ఏర్ప‌డింద‌ని, ఆ బిల్లును భార‌త ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు కుమార్తె చెల్లించార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. సోష‌ల్ మీడియాలో పెద్ద చ‌ర్చ‌గా మారిన ఈ అంశం గురించి బాలు కుమారుడు ఎస్‌.పి. చ‌ర‌ణ్ స్పందించారు. ``

``నాన్న‌గారి మ‌ర‌ణం త‌ర్వాత ఇలాంటి వార్త సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం కావ‌డం దుర‌దృష్ట‌క‌రం. ఆ వార్త‌లో ఎంత‌మాత్రం నిజం లేదు. ఎవ్వ‌రూ న‌మ్మొద్దు. ఎంజిఎం ఆస్ప‌త్రిలోని వైద్య సిబ్బంది నాన్న‌గారికి మెరుగైన వైద్యం అందించారు. ఆయ‌న ప్రాణాలు కాపాడేందుకు అన్ని విధాలా ప్ర‌య‌త్నించారు. అందులో వారి వైఫ‌ల్యం ఏమీ లేదు. అంతేకాదు ట్రీట్‌మెంట్‌కి సంబంధించిన బిల్లు విష‌యంలో కూడా ఆస్ప‌త్రి యాజ‌మాన్యంతో ఎటువంటి వివాదం చోటు చేసుకోలేదు. ఎవ‌రో ఇది కావాల‌ని ప్రచారం చేస్తున్నారు. నాన్న‌గారికి ఎటువంటి ట్రీట్‌మెంట్ ఇచ్చారు, ఫైన‌ల్‌గా బిల్ ఎంత అయ్యింది, దాన్ని ఎవ‌రు చెల్లించారు వంటి విష‌యాలు దుష్ప్ర‌చారం చేస్తున్న ఆ వ్య‌క్తికి తెలీదు. ఇలాంటి ప్ర‌చారం చేస్తున్న వారు నాన్న‌గారి అభిమానులు కానే కారు. అయితే హాస్పిట‌ల్‌కి సంబంధించిన విషయాలు, బిల్లు వివ‌రాలు ఇప్పుడు నేను చెప్పాల‌నుకోవ‌డం లేదు. త్వ‌ర‌లోనే ఆస్ప‌త్రి యాజ‌మాన్యంతో క‌లిసి ఓ ప్రెస్‌మీట్ పెట్టి అన్ని వివ‌రాలు తెలియ‌జేస్తాను`` అన్నారు ఎస్‌.పి.చ‌ర‌ణ్‌.