Ram Charan decides to work with Vamsi Paidipally

ప్ర‌స్తుతం రామ్‌చ‌ర‌ణ్ ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో ఎన్టీఆర్‌తో క‌లిసి న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత చ‌ర‌ణ్ ఎవ‌రి డైరెక్ష‌న్‌లో సినిమా చేస్తాడ‌ని అంద‌రూ ఎదురుచూస్తున్నారు. చిరంజీవి, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న ఆచార్య చిత్రంలో చ‌ర‌ణ్ ఓ ప్ర‌త్యేక పాత్ర పోషిస్తున్నాడు. ఆ సినిమా కూడా అత‌ను కంప్లీట్ చెయ్యాల్సి ఉంది. ప్ర‌స్తుతం షూటింగులు లేక‌పోయినా, థియేట‌ర్స్ ఓపెన్ కాక‌పోయినా మిగ‌తా హీరోలంతా తాము చేయ‌బోతున్న సినిమాల‌ను రెడీగా పెట్టుకున్నారు. చ‌ర‌ణ్ మాత్రం ఎవ‌రి డైరెక్ష‌న్‌లో సినిమా చెయ్యాల‌నే మీమాంస‌లో ఉన్నాడు. అత‌ని త‌ర్వాతి సినిమా కోసం సురేంద‌ర్‌రెడ్డి, వెంకీ కుడుముల, వంశీ పైడిప‌ల్లి పేర్లు వినిపించాయి. అయితే ఇప్ప‌టివ‌ర‌కు ఎవ‌రినీ క‌న్‌ఫ‌ర్మ్ చెయ్య‌లేదు. తాజా స‌మాచారం మేర‌కు వంశీ పైడిప‌ల్లి డైరెక్ష‌న్‌లోనే చ‌ర‌ణ్ నెక్స్‌ట్ సినిమా ఉంటుంద‌ని తెలుస్తోంది. చ‌ర‌ణ్‌కు వంశీ క‌థ వినిపించ‌డం అత‌నికి న‌చ్చ‌డం జ‌రిగిపోయాయ‌ని, చ‌ర‌ణ్ కూడా సినిమా చేసేందుకు ఓకే చెప్పాడ‌ని స‌మాచారం. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో ఇంత‌కుముందు ఎవ‌డు అనే సినిమా వ‌చ్చింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ కూడా ఒక కీల‌క పాత్ర పోషించిన విష‌యం తెలిసిందే.

గ‌త సంవ‌త్స‌రం మ‌హేష్‌తో వంశీ రూపొందించిన మ‌హ‌ర్షి మంచి విజ‌యాన్ని సాధించింది. ఆ త‌ర్వాత కూడా మ‌హేష్‌తోనే సినిమా ఉంటుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. దానికి సంబంధించి ఒక ప్ర‌క‌ట‌న కూడా విడుద‌ల చేశారు. అయితే వంశీ చెప్పిన క‌థ మ‌హేష్‌కి న‌చ్చ‌క‌పోవ‌డంతో ఆ ప్రాజెక్ట్ ప‌క్క‌న పెట్టారు. త‌న‌ని క‌న్విన్స్ చేసే మంచి క‌థ‌తో వ‌స్తే సినిమా చేస్తాన‌ని మ‌హేష్ చెప్ప‌డంతో ఆ ప్ర‌య‌త్నాన్ని విర‌మించుకొని మ‌రో హీరో కోసం వంశీ ట్రై చేస్తూ వ‌స్తున్నాడు. ఫైన‌ల్‌గా చ‌ర‌ణ్‌తో క‌థ‌ను ఓకే చేసుకున్నాడు వంశీ. అయితే ఇది మ‌హేష్‌కి చెప్పిన క‌థా? లేక మ‌రో క‌థ వినిపించాడా? అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి చ‌ర‌ణ్‌, వంశీ కాంబినేష‌న్‌లో ఓ భారీ చిత్రం రాబోతోంద‌నేది లేటెస్ట్ న్యూస్‌. దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లోనే వెలువ‌డే అవ‌కాశం ఉంది.