Amitabh Bachchan who is bigger than Balu conquers What happened in the case of SPB

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా బారిన పడి మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన 70 ఏళ్లు దాటినా ఆయనకంటే వయసులో పెద్దవారు కరోనా నుంచి కోలుకున్నారు. దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా బారిన పడ్డారు అని తెలియగానే చాలా మంది అంత సీరియస్‌గా తీసుకోలేదు. అందరికీ వచ్చినట్లే ఆయనకీ వచ్చింది.. క్వారంటైన్‌లో ఉంటే వారం రోజుల్లో తగ్గిపోతుంది అనుకున్నారు. బాలు కూడా తనకు కాస్త జలుబు, జ్వరంగా ఉందని.. కఫం వస్తోందని అంతకు మించి పెద్దగా లక్షణాలు ఏమీ లేవని స్వయంగా చెప్పడంతో అభిమానులు ఏం పర్వాలేదు అనుకున్నారు.కానీ, బాలు ఈ విషయం చెప్పిన రెండు మూడు రోజుల్లో పరిస్థితి మారిపోయింది. ఆగస్టు 5న ఆయన చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌లో చేరాల్సి వచ్చింది.  ఆగస్టు 13న ఆయన్ని ఐసీయూకు మార్చారు. ఆ తరవాత రోజే ఆయన్ని వెంటిలేషన్ మీదకు మార్చారు. ఇలా 42 రోజులపాటు ఆయన ఐసీయూలోనే ఉండి చివరకు ప్రాణాలు వదిలారు.

నిజానికి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. వీరిలో 65 సంవత్సరాలు దాటినవారు చాలా మంది ఉన్నారు. వారంతా కరోనాను జయించారు. బాలు కన్నా వయసులో పెద్ద అయివుండి దీర్ఘకాలిక అనారోగ్యం వున్నా అమితాబ్ బచ్చన్ (77 ఏళ్లు) కూడా కరోనాతో పోరాడి గెలిచారు. దురదృష్టవశాత్తు 74 ఏళ్ల బాలు కొవిడ్-19ను జయించలేకపోయారు. దీనికి డాక్టర్లు అనేక కారణాలు చెబుతున్నారు. బాలు కరోనాను జయించలేకపోవడానికి వయోభారం ఒక్కటే కారణం కాదని.. ఇతర ఆరోగ్య సమస్యలు కూడా అని అంటున్నారు డాక్టర్లు. ‘‘వయసు అనేది ఒక అంశం. కానీ, ఇతర ఆరోగ్య సమస్యలు.. ఇన్ఫెక్షన్ తీవ్రత వంటి ముఖ్యమైన అంశాలను మనం విస్మరించకూడదు’’ అని ఒక డాక్టర్ అన్నారు.

నిజానికి బాలుకి వెంటిలేటర్‌తో పాటు ఎక్‌ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సీజనేషన్ (ఎక్మో) అనే అధునాతన మెకానికల్ సపోర్ట్ సిస్టమ్‌తో వైద్యం అందించారు. గుండె-ఊపిరితిత్తుల మధ్య పనితీరును పెంచేందుకు ఈ ఎక్మో ఎంతగానో సహకరిస్తుంది. ఊపిరితిత్తులు పనితీరు దారుణంగా పడిపోతో ఎక్మో సిస్టమ్ కృత్రిమ ఊపిరితిత్తులు, గుండె మాదిరిగా పనిచేస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. అయితే, 65 ఏళ్లు పైబడిన రోగుల్లో ఎక్మో ద్వారా బయటపడిన వాళ్లు 30 శాతం కన్నా తక్కువే ఉన్నారని పరిశోధనలు చెబుతున్నాయి.

సాధారణంగా ఎక్మోను ఐదారు రోజులు మాత్రమే రోగికి వాడతారని.. చాలా అరుదుగా 30 రోజుల వరకు ఉంచుతారని ఓ డాక్టర్ వెల్లడించారు. సుదీర్ఘంగా ఎక్మోపై ఆధారపడే రోగుల్లో అనారోగ్య సమస్యలు ఎక్కువయ్యే అవకాశమే ఎక్కువగా ఉంటుందన్నారు. బాలు విషయంలో ఇదే జరిగిందా అనే అనుమానం రాక తప్పడం లేదు. ఆయన్ని ఎక్కువ రోజుల పాటు ఎక్మోపై ఉంచడం వల్ల కూడా ఇతర ఆరోగ్య సమస్యలు తిరగబెట్టాయా? అనే అనుమానం కలుగుతోంది.నిజానికి బాలు కోలుకుంటున్నారని, ఫిజియోథెరపీ కూడా చేస్తున్నారని ఎంజీఎం డాక్టర్లు, తనయుడు చరణ్ ఎప్పటికప్పుడు తెలియచేస్తూ వచ్చారు.  నిజానికి బాలు ఆక్సీజనేషన్‌ను పెంపొందించడానికి డాక్టర్లు ఈ ఫిజియోథెరపీని బెడ్ మీద ఉంచి చేయించారని అర్థమవుతోంది. ఈ ఫిజియోథెరపీకి సంబంధించిన వీడియో కూడా తాజాగా బయటికి వచ్చింది.

అయితే, ఊపిరితిత్తుల్లో ఉండే ఇన్ఫెక్షన్ ఎప్పుడూ ఒకలా ఉండదని.. ఎప్పటికప్పుడు అప్ అండ్ డౌన్ అవుతూనే ఉంటుందని మరో డాక్టర్ అన్నారు. బాలు విషయంలో వయోభారం మాత్రమే కాకుండా ఊపిరితిత్తుల పనితీరు, బ్లడ్ సుగర్, ఒబెసిటీ వంటి సమస్యలు కూడా కారణం కావచ్చని అభిప్రాయపడ్డారు. ఈ సమస్యలన్నింటి వల్లా గుండెపోటు వచ్చే అవకాశం కూడా ఉంటుందన్నారు.

ఇదిలా ఉంటే, ఊబకాయంతో బాధపడిన ఎస్పీ బాలు 2012లో బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్నారు. ఈ సర్జరీ ద్వారా 135 కిలోల బరువున్న ఆయన 96 కిలోలకు తగ్గారు. అనారోగ్యం తీవ్రరూపం దాల్చడానికి అదీ ఒక కారణమై ఉంటుందని డాక్టర్లు అంటున్నారు. గతంలో దాసరి నారాయణరావు, ఆర్తి అగర్వాల్ కూడా బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్నారు. వారు కూడా పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొని చివరికి కన్నుమూశారు. కాబట్టి, బాలు కరోనాను జయించలేకపోవడానికి ఇదే కారణం అని కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఏదేమైనా ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి ఈరోజు మన మధ్య లేకపోవడం బాధాకరం. ఏ లోకంలో ఉన్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం.