Donald Trump riles up thousands of supporters at Jacksonville

విదేశాల్లో జరిగే యుద్ధాల్లో అమెరికా పాల్గొనబోదని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍ తెలిపారు. ఫ్లోరిడాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగిస్తూ విదేశాల్లో జరిగే యుద్ధాలకు తమ బలగాలను పంపమని, అవన్నీ అంతులేని నిరర్ధక యుద్ధాలని అన్నారు. ఇప్పటికే పలు దేశాల్లో ఉన్న తమ సైనికులను వెనక్కు రప్పిస్తామన్నారు. కేవలం తమ దేశానికి ప్రమాదమైన టెర్రరిస్టులను మట్టుపెట్టేందుకు మాత్రమే ఈ సైన్యాన్ని ఉపయోగిస్తామన్నారు. అమెరికా రాజకీయవేత్తలు విదేశాల పునర్‍నిర్మాణం, విదేశీయుద్ధాల్లో పోరాడటం, విదేశీ సరిహద్దులను కాపాడడం వంటి పనులపై లక్షల కోట్ల డాలర్లు వెచ్చించారన్నారు. కానీ ప్రస్తుతం అమెరికా సేనలు అమెరికాను, అమెరికా నగరాలను రక్షించేందుకు పరిమితమవుతున్నాయని, అమెరికా బలగాలు స్వదేశాలకు వస్తున్నాయని చెప్పారు.

విదేశాల్లో జరిగే అనవసర యుద్ధాలకు సైన్యం వెళ్లదని, కానీ దేశానికి ముప్పుగా భావించే ఉగ్రవాదులను మాత్రం వదిలిప్టెటదని చెప్పారు. తమకున్నంత సైనిక సంపత్తి ఎవరికీ లేదని, బలం చూపించే శాంతిని పరిరక్షిస్తామని వివరించారు. ఈ ర్యాలీకి జనం భారీగా హాజరయ్యారు.  కరోనా నిబంధనలను పక్కనబెట్టిమరీ జనం హాజరుకావడం ట్రంప్‍నకు మంచి ఉత్సాహాన్నిచ్చింది.