Telangana RTC resumes operations in the outskirts of Hyderabad after 6 months

రాష్ట్రంలో న‌గ‌రాల ప‌రిధిలో తిరిగే ఆర్టీసీ బస్సులపై తెలంగాణ ప్రభుత్వం గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నుంచి గ్రేటర్ ప‌రిధిలో  సిటీ బస్సులను నడిపేందుకు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ విష‌యంపై చ‌ర్చించేందుకు గురువారం గ్రేటర్‌ పరిధిలోని ఎమ్మెల్యేలతో సిఎం కెసియార్‌ సమావేశం అయ్యారు. స‌మావేశం ముగిసిన‌ అనంతరం సిటీ బస్సులను న‌డిపేందుకు అనుమతిస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు.  అదే స‌మ‌యంలో లాక్‌డౌన్‌ మార్గదర్శకాలను పాటిస్తూ.. 25 శాతం సర్వీసులు  మాత్ర‌మే నడపాలని నిర్ణయించారు. దీనిపై మరికాసేపట్లో తెలంగాణ‌ ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేయనుంది. 

పొరుగు రాష్ట్రాల‌న్నింటికీ ర‌య్‌..ఏపీకి మాత్రం నై..

లాక్‌డౌన్‌ కారణంగా హైదరాబాద్‌ పరిధిలో ఆర్టీసీ సేవలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఆరు నెలల తరువాత‌ నగరంలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. అలాగే మార్చి ఉంచి నిలిచిపోయిన మహారాష్ట్ర, కర్ణాటక బస్సులు కూడా నడిపేందుకు సీఎం అంగీకారం తెలిపారు. ఈ మేరకు రవాణాశాఖ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. అయితే మరోవైపు ఎంతో మంది ప్ర‌యాణీకుల ఎదురు చూపుల‌ను అల‌క్ష్యం చేస్తూ... ఏపీ సర్వీసులపై మాత్రం తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం. దీంతో నిత్యం తెలుగు రాష్ట్రాల మ‌ధ్య అనేక అవ‌స‌రాల నిమిత్తం రాక‌పోక‌లు సాగించే వేలాది మంది ప్ర‌యాణీకులు నిరాశ‌కు గుర‌య్యారు.