Sajjala Ramakrishna Reddy reaction on Kodali Nani comments on PM Modi

గ‌త కొన్ని రోజులుగా ఆంధ్ర‌ప్రదేశ్‌లో న‌డుస్తున్న రాజ‌కీయ ర‌చ్చ మతం రంగు పులుముకోవ‌డం తెలిసిందే. ప‌లు ప్రాంతాల్లో ఆల‌యాల్లో జ‌రుగుతున్న సంఘ‌ట‌న‌లు, విగ్ర‌హాల ధ్వంసాలు వంటివి రాజ‌కీయాగ్నికి ఆజ్యం పోస్తున్నాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో అధికారంలో ఉన్న వారి మీదే ఎక్కువ బాధ్య‌త ఉంటుంది. సున్నిత‌మైన అంశాలు ఉద్రిక్త‌త‌ల‌కు దారి తీయ‌కుండా జాగ్ర‌త్త ప‌డాల్సిన అవ‌స‌రం కూడా ప్ర‌భుత్వ పెద్ద‌ల‌పై ఉంటుంది. సాధార‌ణంగా ప్రతిప‌క్షాలు ప్ర‌జ‌ల్లో కొద్దో గొప్పో అల‌జ‌డి పెర‌గాల‌ని, త‌ద్వారా ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త పెర‌గాల‌నే ఆలోచిస్తాయి. అధికారంలో తెదేపా ఉంటే వైసీపీ అలాగే ఆలోచిస్తుంది. కాబ‌ట్టి అధికార ప‌క్ష‌మే సంయ‌మ‌నం పాటించాల్సి ఉంటుంది. గ‌తంలో అదే జ‌రిగింది  కూడా. అయితే ఈ కాసింత విచ‌క్ష‌ణ కూడా అధికార  వైసీపీ నేత‌ల్లో లోపించిన‌ట్టు క‌నిపిస్తోంది. 

తిరుమ‌ల‌లో డిక్ల‌రేష‌న్ అంశం మీద ఎన్న‌డూ లేనంత రీతిలో జ‌గ‌న్ విష‌యంలో గంద‌ర‌గోళం చెల‌రేగింది. అత్యంత సున్నిత‌మైన ఈ అంశం మీద అంత‌టి ర‌గ‌డ చెల‌రేగ‌డంలో అధికార పార్టీకి చెందిన మంత్రి కొడాలి నాని ప‌రుష వ్యాఖ్య‌లు కూడా ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని చెప్పాలి. ఆ త‌ర్వాత కూడా నాని అదే విధంగా వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఏకంగా ప్ర‌ధాని మోడీ మీద కూడా ఆయ‌న వాగ్భాణాలు వ‌దిలారు. అయ‌న కంటే తామెందుకు వెనుక‌బ‌డి ఉండాల‌ని అనుకున్నారో ఏమిటో దేవాదాయ  శాఖ మంత్రి వెల్లంప‌ల్లి, ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు... త‌దిత‌రులు కూడా నోటికి ప‌ని క‌ల్పిస్తున్నారు. దీంతో వివాదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఈ నేప‌ధ్యంలో వైసీపీ నేత‌లను క‌ట్ట‌డి చేయాల్సిన అవ‌స‌రం క‌నిపిస్తోంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. దీనిని అధిష్టానం కూడా గుర్తించిన‌ట్టే క‌నిపిస్తోంది. 

మ‌తం ఉచ్చులో ప‌డొద్దు..

త‌మ నేత‌లు  ప్ర‌ధాని మోడీ మీద వ్యాఖ్య‌లు చేయ‌డం స‌రైన‌ది కాద‌ని  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అంగీక‌రించారు. కావాల‌ని రెచ్చ‌గొట్టి ఉచ్చులో ప‌డేలా చేస్తున్నార‌ని, ఈ విష‌యం త‌మ‌య నేత‌లు కూడా గుర్తించే ఉంటార‌ని తాను న‌మ్ముతున్నాన‌ని గురువారం  సజ్జల తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అన్నారు.  మతం పేరుతో టీడీపీ నీచ రాజకీయాలు చేస్తోందని ఆయ‌న విమర్శించారు. అమరావతి భూ కుంభకోణంపై నుంచి ప్ర‌జ‌ల‌ దృష్టి మరల్చడమే ఆ పార్టీ లక్ష్యమని ఆయన మండిపడ్డారు.  తమ రాజకీయ స్వార్థం కోసం టీడీపీ నేతలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. తమ అనుకూల మీడియా ద్వారా వార్తలు ప్రసారం చేసుకుంటున్నారని, కుట్రపూరితంగానే ఇలాంటి దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

దాడుల వెనుక ప్ర‌తిప‌క్షం...

హిందూ దేవాలయాలపై దాడుల వెనుక ప్రధాన ప్రతిపక్షం ఉందని సజ్జల రామకృష్ణరెడ్డి ఆరోపించారు. హిందూ మతంపై విశ్వాసంతో కాదని, అధికారంలో లేమనే బాధతో ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయని అన్నారు. అత్యంత భక్తి భావంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారని తెలిపారు. సంక్షోభం సృష్టించాలన్న తాపత్రయమే ప్రతిపక్షాల్లో కనిపిస్తోందని, ఇలాంటి చర్యలతో ప్రజల్లో ప్రతిపక్షాలే చులకనవుతున్నాయని పేర్కొన్నారు. అసత్య ప్రచారాలు చేసిన వారే చివ‌రికి అభాసుపాల‌వుతార‌ని చ‌రిత్ర చెబుతోంద‌న్నారు.