cm ys jagan meets home minister amit shah

ఓ వైపు తిరుమ‌లలో అన్య‌మ‌త‌స్తుల‌ డిక్ల‌రేష‌న్ వ్య‌వ‌హారంపై వాదోప‌వాదాలు చెల‌రేగుతున్నాయి. ఆల‌యాల ద‌గ్గ‌ర జ‌రిగిన సంఘ‌ట‌న‌ల‌ను భూత‌ద్ధంలో చూపుతూ భాజాపా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హిందుత్వ రాజ‌కీయాలు షురూ చేసింద‌ని వైసీపీ వ‌ర్గాలు ఆరోపిస్తున్నాయి. మ‌రోవైపు 3 రాజ‌ధానుల అంశం, అమ‌రావ‌తి భూ కుంభ‌కోణంపై విచార‌ణ జ‌రిపించాల‌ని ప్ర‌భుత్వం ప‌ట్టు ప‌డుతుండ‌డం, దీనిపై పార్ల‌మెంట్ స‌మావేశాల్లో వైసీపీ ఎంపీలు సిబిఐ ద‌ర్యాప్త‌ను డిమాండ్ చేయ‌డం... వీట‌న్నింటి నేప‌ధ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో భేటీ కావ‌డం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారింది.

గంట‌పాటు సాగిన చ‌ర్చ‌లు..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమిత్ షాను మంగళవారం సాయంత్రం ఢిల్లీలో కలిశారు. రాష్ట్రాభివృద్ధి అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. రాష్ట్ర ఆర్ధిక స్థితిగ‌తులతో పాటు ప‌లు స‌మ‌స్య‌ల‌ను అమిత్ షా కు జ‌గ‌న్ వివ‌రించి చెప్పిన‌ట్టు స‌మాచారం. వీరి భేటీ గంట‌కు పైగా సాగింది. రాష్ట్రంలో నెల‌కొన్న ప్ర‌త్యేక ప‌రిస్థితుల కోణంలో నుంచి చూస్తే.. వీరిద్ద‌రి భేటీ జ‌గ‌న్ విన‌తుల ప‌ట్ల అమిత్ షా సానుకూలంగా స్పందించి ఉంటే ఆ వివ‌రాలు మ‌రికొన్ని రోజుల్లోనే వెలుగు చూసే అవ‌కాశం ఉందని విశ్లేష‌కులు అంటున్నారు. సీఎం జగన్‌ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, బాలశౌరి ఉన్నారు. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం ఈ రోజు రాత్రి సీఎం జగన్‌ ఢిల్లీలోనే బస చేయ‌నున్నారు.