Jr NTR next movie after RRR

ఈమ‌ధ్య‌కాలంలో ప్యాన్ ఇండియా సినిమాల హ‌వా బాగా పెరిగింది. టాప్ హీరోలంతా నాలుగైదు భాష‌ల్లో త‌మ సినిమాలు రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ విష‌యంలో ఎన్టీఆర్ పూర్తి క్లారిటీతో త‌న సినిమాల‌ను సెట్ చేసుకుంటున్నాడు. ప్ర‌స్తుతం రామ్‌చ‌ర‌ణ్‌తో క‌లిసి రాజ‌మౌళి డైరెక్ష‌న్‌లో ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాలో రామ్‌చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజుగా, ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా ఎంతో గొప్ప‌గా ఉండే పాత్ర చేయ‌బోతున్నారు. లాక్‌డౌన్ కార‌ణంగా ఈ సినిమా షూటింగ్‌ను నిలిపివేశారు. ద‌స‌రా నుంచి ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించే అవ‌కాశాలు ఉన్నాయి. వీలైనంత త్వ‌ర‌గా ఈ సినిమాను పూర్తి చేసి వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌కి గానీ, ఆ త‌ర్వాత గానీ రిలీజ్ చేసేందుకు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమా త‌ర్వాత త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో ఎన్టీఆర్ ఓ సినిమా చేయ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాను క‌ళ్యాణ్‌రామ్‌, ఎస్‌.రాధాకృష్ణ క‌లిసి నిర్మిస్తారు. అయిన‌ను పోయిరావ‌లె హ‌స్తిన‌కు అనే టైటిల్‌తో రూపొందే ఈ సినిమా రాజ‌కీయ నేప‌థ్యంలో ఈ సినిమా ఉంటుంద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం దేశంలో ఉన్న రాజ‌కీయాల నేప‌థ్యంలో ఈ సినిమాను తెర‌కెక్కించ‌బోతున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ రాజ‌కీయ నాయ‌కుడిగా క‌నిపిస్తాడ‌ట‌. ఎన్టీఆర్‌కు, త్రివిక్ర‌మ్‌కు ఇది తొలి పొలిటిక‌ల్ మూవీ కావ‌డం విశేషం.

త్రివిక్ర‌మ్‌తో సినిమా పూర్త‌యిన వెంట‌నే ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ భారీ సినిమా చేయ‌బోతున్నాడు ఎన్టీఆర్‌. కెజిఎఫ్ వంటి భారీ క‌మ‌ర్షియ‌ల్ హిట్‌తో దేశ‌వ్యాప్తంగా పేరు సంపాదించుకున్న ప్ర‌శాంత్ నీల్... ఎన్టీఆర్ కోసం ఒక అద్భుత‌మైన క‌థ‌ను సిద్ధం చేశాడ‌ట‌. ఈ క‌థ ఎన్టీఆర్‌కు కూడా బాగా న‌చ్చి అత‌నితో సినిమా చేసేందుకు ఓకే చెప్పాడ‌ట‌. భార‌త దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత భారత్- పాకిస్థాన్ విడిపోయిన కాలం నాటి నుంచి ఆ తర్వాత భారత్, పాక్ యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనున్నట్టు సమాచారం. ఈ యుద్ధంలో మన భారత యోధులు ఏ విధంగా పోరాటం చేసారనే ఇతివృత్తంతో ఈ సినిమాను తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లోనే వెలువ‌డే అవ‌కాశం క‌నిపిస్తోంది.

త‌మిళ్‌లో సూప‌ర్‌హిట్ చిత్రాల ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకున్న అట్లీ కాంబినేష‌న్‌లో త‌న త‌ర్వాతి సినిమాను ప్లాన్ చేసుకున్నాడు ఎన్టీఆర్‌. అట్లీ త‌మిళ్‌లో రూపొందించిన సినిమాలు రాజారాణి, పోలీసోడు, అదిరింది, విజిల్ పేరుతో తెలుగులోకి అనువాద‌మై ఇక్క‌డ కూడా ఘ‌న‌విజ‌యం సాధించాయి. తొలిసారి తెలుగులో డైరెక్ట్ సినిమా చేయ‌బోతున్నాడు అట్లీ. ఈ సినిమాను వైజ‌యంతి మూవీస్ ప‌తాకంపై అశ్వినీద‌త్ నిర్మించ‌నున్నాడు.
ర‌చ‌యిత‌గా ఎన్నో బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీస్‌కి క‌థ‌లు అందించిన వ‌క్కంతం వంశీ డైరెక్ట‌ర్‌గా మాత్రం స‌క్సెస్ అవ్వ‌లేక‌పోయాడు. అల్లు అర్జున్‌తో రూపొందించిన నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రం డిజాస్ట‌ర్‌గా నిల‌వ‌డంతో అత‌నికి ద‌ర్శ‌కుడిగా హీరోలెవ‌రూ అవ‌కాశాలు ఇవ్వ‌డం లేదు. అయితే ఎన్టీఆర్ మాత్రం అత‌నితో ఒక సినిమా చేసేందుకు ఓకే చెప్పాడు. ఇప్ప‌టికే ఎన్టీఆర్‌కు వ‌క్కంతం ఒక క‌థ చెప్పాడ‌ని, ఆ క‌థ ఎన్టీఆర్‌తో ఎన్టీఆర్ శాటిస్‌ఫై అవ్వ‌లేద‌ని తెలుస్తోంది. త‌న‌ను మెప్పించే క‌థ‌తో వ‌స్తే త‌ప్ప‌కుండా సినిమా చేస్తాన‌ని వక్కంతం వంశీకి ఎన్టీఆర్ మాట ఇచ్చాడ‌ని స‌మాచారం.

ఈ సినిమాల‌నే కాకుండా ఎన్టీఆర్ త్వ‌ర‌లోనే డైరెక్ట్ హిందీ సినిమాలో న‌టించ‌బోతున్నాడ‌నేది అభిమానుల‌కు సంతోషం క‌లిగించే వార్త‌. బాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ సంజ‌య్ లీలా బ‌న్సాలీ కాంబినేష‌న్‌లో ఎన్టీఆర్ ఓ భారీ సినిమా చేయ‌బోతున్నాడ‌ని టాలీవుడ్‌లో వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే సంజ‌య్ లీలా బ‌న్సాలీతో ఎన్టీఆర్ సినిమా చేయ‌బోతున్నాడ‌నే వార్త‌లో ఎంత నిజ‌ముందో ఇప్ప‌టివ‌ర‌కు తెలియ‌లేదు గానీ త్వ‌ర‌లోనే ఎన్టీఆర్ హిందీలో ఓ సినిమా చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

ఇలా ఒకటి త‌ర్వాత ఒకటిగా ఎన్టీఆర్ త‌న ప్రాజెక్ట్స్‌ని సెట్ చేసుకుంటున్నాడు. ఈ సినిమాల‌న్నీ ప్యాన్ ఇండియా మూవీస్‌గా తెర‌కెక్క‌నుండ‌డం విశేషం. ఆర్ ఆర్ ఆర్ త‌ర్వాత ఎన్టీఆర్ చేయ‌బోయే సినిమాల‌న్నీ గ‌తంలోఅత‌ను చేసిన సినిమాల‌న్నింటికంటే భారీ బ‌డ్జెట్ సినిమాలే. కేవ‌లం టాలీవుడ్‌కే ప‌రిమితం కాకుండా దేశ‌వ్యాప్తంగా త‌న ఇమేజ్‌ను పెంచుకునేందుకు ఎన్టీఆర్ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు స‌మాచారం.