Sajjala Ramakrishna Reddy Fires On TDP And  Media

ఓ వైపు విప‌క్షాల ఎత్తులూ పై ఎత్తులు మ‌రోవైపు కోర్టు తీర్పులుకు తోడుగా మీడియాలో వ‌స్తున్న క‌ధ‌నాలు కూడా వైసీపీ ప్ర‌భుత్వానికి టెంప‌రేచ‌ర్ పెంచేస్తున్నాయి. ఎన్నిక‌ల ముందు నుంచే మీడియా వైసీపీ అనుకూల‌, వ్య‌తిరేక వ‌ర్గాలుగా చీలిపోయిన విష‌యం తెలిసిందే. ఆ వైరం ఎన్నిక‌ల త‌ర్వాత ఇంకా ముదిరిందే త‌ప్ప త‌గ్గ‌లేదు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని రెండు ప్ర‌ధాన దిన‌ప‌త్రిక‌లు ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి త‌ర‌చుగా ప్ర‌భుత్వ వ్య‌తిరేక క‌ధ‌నాలు కావాల‌ని రాస్తున్నాయ‌ని ఆ పార్టీ నేత‌లు ఆరోపిస్తున్నారు. ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక క‌ధ‌నాలు వ‌స్తాయ‌ని ఊహించిందే అయినా..వాటిని అంత‌గా ప‌ట్టించుకోవాల్సిన ప‌నిలేద‌ని వైసీపీ పెద్ద‌లు తొలుత భావించారు. ఇంకా ముదిరితే న్యాయ‌ప‌ర‌మైన చ‌ర్య‌లు చేప‌ట్ట‌వ‌చ్చున‌నుకున్నారు. అయితే ఈ త‌ర‌హా క‌ధ‌నాలు కోర్టుల్ని సైతం ప్ర‌భావితం చేస్తాయ‌నే ఆందోళ‌న వైసీపీలో వ్య‌క్త‌మ‌వుతోంది. ప్ర‌స్తుతం ప్ర‌భుత్వంపై ముప్పేట దాడి జ‌రుగుతున్న ప‌రిస్థితిలో.. రాను రానూ త‌మ‌పై వ‌చ్చే క‌ధ‌నాల్లో వేగం పెరుగుతోంద‌ని భావిస్తున్న పార్టీ అధిష్టానం ఇక వీటిపై స్పందించాల్సిందేన‌ని నిర్ణ‌యించింది. దీనిలో భాగంగా ఏ రోజుకారోజు ఈ క‌ధ‌నాల‌ను ఖండిచాల్సిందిగా నేత‌ల‌కు సూచించిన‌ట్టు తెలుస్తోంది.

అందులో భాగంగానే సోమ‌వారం ప్ర‌భుత్వ స‌ల‌హాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ దిన‌ప‌త్రిక‌ల క‌ధ‌నాల‌పై దుమ్మెత్తి పోశారు. రాజధాని అంశంపై.. హైకోర్టులో వాయిదా వచ్చినప్పుడల్లా ఎప్పటిలాగే, ఆ (ఈనాడు, ఆంధ్రజ్యోతి) రెండు పత్రికలు, రెండు (ఈటీవీ, ఏబీఎన్‌) టీవీ ఛానల్స్‌ హడావుడి చేస్తున్నాయని ఆయ‌న ఆరోపించారు. కోర్టులో విచారణ జరిగేటప్పుడు వక్రీకరణలో, అవాస్తవాలతో కథలు వండి పేజీలు నింపటం అనేది న్యాయస్థానాలను ప్రభావితం చేయటం కాదా? అంటూ ప్ర‌శ్నించారు. గతంలో శంకర్రావు, అచ్చెన్నాయుడు తదితర టీడీపీ నేతలు శ్రీ జగన్ గారి మీద అక్రమ కేసులు బనాయించినప్పుడు కోర్టులను ప్రభావితం చేసేలా కథనాలు వండివార్చిన సంగతి అందరూ గమనించారని, పత్రికలు వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలే త‌ప్ప‌ కోర్టులో కేసు జరుగుతున్నప్పుడు ఇలా పత్రికల్లో కథనాలు రాసి, కోర్టులను ప్రభావితం చేయాలని చూడటం అనైతికం, చట్ట వ్యతిరేకంగా భావిస్తున్నామన్నారు. త‌మ‌కూ పేపర్, టీవీ ఉంది. కానీ ఏనాడూ కోర్టులో విచారణ వస్తుందంటే.. వాస్తవాలు చెబుతూ.. ఏం జరుగుతుందో రాశామే తప్ప ఇలా అడ్డగోలుగా అవాస్తవాలు రాయలేదన్నారు.

ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం సుదీర్ఘం కాలంపాటు చర్చలు జరిపి, ప్రజల మద్దతుతో చట్టం చేస్తే.. దానిపై అడ్డగోలు ఛాలెంజ్‌ చేయటం ఒక తప్పు. కోర్టులో తగిన ఆధారాలతో రావాలి తప్ప అడ్డమైన కథనాలతో రావటం తప్పు అని స్ప‌ష్టం చేశారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు వెంచర్లు వేస్తూ, మనుషులు ఎవ్వరూ లేని చోట బ్రోచర్లలో రంగుల కలల ప్రపంచం చూపించి వాటిని అమ్మేస్తారని కానీ వాస్తవానికి సమాధి రాళ్లు తప్ప అక్కడ ఏమీ ఉండదనీ, ఐదేళ్ల తర్వాత అదే బ్రోచర్‌తో రియల్‌ ఎస్టేట్ వాళ్లు మ‌ళ్లీ వస్తే పుండుపై కారం రాసినట్లు ఉంటుందన్నారు. తాజాగా ఈనాడు రాసిన కథనం ర్చువల్ రియాల్టీలో తిరిగి చూపించడం అలాగే ఉంద‌ని ఎద్దేవా చేశారు. ప్ర‌జాస్వామ్య ప‌ద్ద‌తిలో ఎన్నుకోబ‌డిన ప్ర‌భుత్వం, రాజ్యాంగ బ‌ద్దంగా నిర్ణ‌యం తీసుకుంటే వ్య‌తిరేకిస్తున్నారని కాని ఓడిపోయిన‌ చంద్ర‌బాబు రంగుల క‌లను ఈనాడు పేప‌ర్ లో పేజీలకు పేజీలు రాస్తున్నారన్నారు. అలాంటి రంగుల క‌ల‌ను న‌మ్ముకునే చంద్ర‌బాబు నిండా మునిగారని వ్యాఖ్యానించారు.

ఆంధ్ర‌జ్యోతి...అబ‌ద్ధాలు...

ఆంధ్రజ్యోతి ఇవాళ రాసిన కథనంలో ఇన్‌సైడర్ ట్రేడింగే లేదని రాసిందనీ అయితే అది జ‌రిగిందో లేదో తెలుసుకోవ‌డానికి పెద్ద విషయ పరిజ్ఞానం అవసరం లేదన్నారు. వ్యవసాయదారులు కాకుండా.. ఎక్కడెక్కడినుంచి వచ్చినవాళ్ళో ఇక్కడ భూములు ఎందుకు కొన్నారు? ఏం ఆశించి కొన్నారు? ఎప్పుడు కొన్నారు? వీరి చేత ఎవరు కొనిపించారు? వ‌ంటి ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలే అమరావతిలో ల్యాండ్ స్కాం జరిగిందనటానికి ప్రత్యక్ష సాక్ష్యాలని చెప్పారు. మొదట నూజివీడులో రాజధాని వస్తుందని ప్రచారం చేసి, ఇవే పత్రికలు కథనాలు రాయటం వల్లే రియల్ ఎస్టేట్ వ్యాపారులు రూ.400-500 కోట్ల పెట్టుబడి పెట్టి నష్టపోయారని ఆరోపించారు. అమరావతి ప్రాంతంలో వాస్తవంగా రైతులు మిగిలింది 30% కూడా లేరు. మిగిలిన వారు అంతా పెట్టుబడిదారులు, రియల్ ఎస్టేటే వాళ్ళేన‌న్నారు.