AP High Court notices to YCP Leaders Over Contempt of The Court

గత కొంత కాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు అటు రాజకీయ పరంగానే కాకుండా ఇటు న్యాయ వ్యవస్థ, రాజ్యాంగ పరంగా కూడా అనేక రకాల ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన దగ్గర్నుంచి వరుసగా కోర్టుల్లో మొట్టికాయలు, ప్రభుత్వ ఉత్తర్వులు కొట్టివేతలు జరుగుతున్నాయి. ప్రభుత్వం జారీ చేసిన దాదాపు ప్రతి ఆదేశాన్నీ, తీసుకున్న ప్రతి నిర్ణయాన్నీ ప్రతిపక్షం వ్యతిరేకించడం న్యాయ స్థానాలను ఆశ్రయించడం  తర్వాత తీర్పులు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రావడం సాధారణ విషయమైపోయింది.

స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం, సచివాలయాలకు వేసిన రంగులు, ఎన్నికల కమిషనర్ పదవీకాలం తగ్గింపు వ్యవహారం, కోవిడ్ కేర్ సెంటర్ అగ్నిప్రమాదం, తాజాగా అమరావతి భూముల కుంభకోణం దర్యాప్తు... ఇలా దాదాపు 60కిపైగా అంశాలకు సంబంధించి రాష్ట్ర హైకోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేక తీర్పులు వచ్చాయి. పలు మార్లు చీవాట్లు, మొట్టికాయలు కూడా పడ్డాయి. ఇవన్నీ ఒకెత్తయితే తాజాగా రాజధాని భూ కుంభకోణంపై వచ్చిన తీర్పుతో ఒక్కసారిగా అగ్గి రాజుకుంది.  రెండు రాజ్యాంగబద్ధమైన వ్యవస్థల మధ్య చిచ్చు రగిలింది.  మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాసరావును భూ కుంభకోణంలో పాత్రధారిగా ఆరోపిస్తూ ప్రభుత్వం అతనిపై ఎసిబి కేసు నమోదు చేసింది. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించడంతో ఎసిబి దర్యాప్తుపై హైకోర్టు స్టే విధించింది. అంతేకాకుండా మరో అడుగు ముందుకేసి సదరు కేసుకు సంబంధించిన వివరాలు, సమాచారం ప్రచురించకూడదంటూ కూడా ప్రధాన మీడియా, సోషల్ మీడియాలకు  సైతం ఆంక్షలు విధించింది.

వరసుపెట్టి వస్తున్న వ్యతిరేక తీర్పులతో తలబొప్పి కట్టిన ప్రభుత్వం తరపు పెద్దలు ఈ స్టే పై ప్రత్యక్షంగానే స్పందించడం మొదలుపెట్టారు. దానికి తోడు మీడియాపై విదించిన ఆంక్షలకు దేశవ్యాప్తంగా మీడియా పెద్దలు నిరసన తెలపడంతో మరింత బలంగా వైసీపీ వర్గాలు తమ వ్యతిరేకతను తెలియజేయడానికి సాహసిస్తున్నాయి. పలువురు వైసీపీ నాయకులు, మంత్రులు హైకోర్టు తీర్పులపై బాహాటంగానే తమ వైఖరిని వెల్లడిస్తున్నారు ఇక వైసీపీ సోషల్ మీడియా అయితే సరేసరి. గతంలో కూడా కోర్టు తీర్పులను ఇష్టారాజ్యంగా తప్పు పట్టిన వైసీపీ సోషల్ మీడియా మళ్లీ అదే బాటలో నడుస్తోంది. ఇప్పటికే ఒకసారి కోర్టు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది కూడా. అంతకు ముందుగా న్యాయమూర్తుల ఫోన్లు ట్యాపింగ్ జరుగుతోందని కూడా కధనాలు రావడం దీనిపై న్యాయస్థానాలు ఆగ్రహంగా స్పందించడం తెలిసిందే.  

గతంలో చంద్రబాబు ప్రభుత్వం న్యాయ వ్యవస్థకు చెందిన ప్రముఖులకు భూములు పంచినట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇస్తే తప్పేమిటంటూ బాబు ప్రశ్నిస్తున్నారు. తాము భిన్న రంగాలకు చెందిన 372 మందికి భూములు ఇచ్చామని  అందులో వారూ ఉన్నారని దీనిపై యాగీ చేయడం అంటే జడ్జీలను నేరుగా లక్ష్యంగా చేసుకున్నట్టేనని బాబు అంటున్నారు. అయితే ఇస్తే తప్పేమిటన్న బాబు ప్రకటనను కూడా వైసీపీ తమ వాదనకు మద్ధతుగా మార్చుకుని రెట్టించిన ఉత్సాహంతో విమర్శలకు పదను పెట్టింది. 

ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రభుత్వం, ప్రతిపక్షంతో పాటు న్యాయస్థానాలతోనూ పెనవేసుకుపోయినట్టు కనపడుతోంది. ఏ విషయంలోనైనా పోరాటానికే సిద్ధపడే అధినేత ఆధ్వర్యంలో ఉన్న పార్టీ, ప్రభుత్వం కావడంతో కోర్టుల పట్ల కూడా అదే పంధాను ఎంచుకుంటున్నట్టు కనపడుతోందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి అనుగుణంగానే భూముల వ్యవహారాన్ని బయటకు తెచ్చారంటున్నారు. అంత‌టితో ఆగ‌కుండా రాజ్య‌స‌భ‌లో ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ఈ అంశాన్ని లేవనెత్త‌డం కూడా ప్ర‌భుత్వ వైఖ‌రికి అద్దం ప‌డుతోంది. ఈ నేపధ్యంలో రెండు వ్యవస్థల మధ్య ఘర్షణ ప్రజా సమస్యల పరిష్కారానికి ఆటంకం కావచ్చునని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్త‌వాలెలా ఉన్నా ప్ర‌జ‌ల్లో న్యాయస్థానాల గౌరవాన్ని కాపాడుతూనే తాము అమలు చేయాలనుకున్న కార్యక్రమాలను చేయాల్సిన బాధ్యత వైసీపీ ప్రభుత్వంపై ఉంద‌ని గుర్తించాలని కోరుతున్నారు.