Bigg Boss Telugu 4 Audience Hope For Gangavva s Exit

'గంగ‌వ్వ‌ను గెలిపించ‌డ‌మే ఏకైక ల‌క్ష్యం' సోష‌ల్ మీడియాలో ఎక్క‌డ చూసినా ఇదే మాట వినిపించేది, ఇటువంటి పోస్టులే క‌నిపించేవి. ఇది మొన్న‌టి మాట‌. ఎప్పుడైతే హౌస్‌లో అనారోగ్యంతో అవ‌స్థ‌లు ప‌డుతున్న అవ్వ‌ను చూశారో అప్ప‌టి నుంచి చాలామంది మన‌సు మార్చుకున్నారు. మీ ఆట కోసం, టీఆర్పీల కోసం ఆమెను బ‌లి చేయ‌కండ‌ని వేడుకుంటున్నారు. తాజాగా సీఎం కేసీఆర్ పీఆర్వో ర‌మేశ్ హ‌జారి ఫేస్‌బుక్‌లోనూ ఇదే త‌ర‌హా పోస్టు పెట్టారు. గంగ‌వ్వ‌ను త‌క్ష‌ణ‌మే విడుద‌ల చేయాల‌ని క్యాంపెయిన్ చేప‌ట్టారు. ఈ మేర‌కు శ‌నివారం సుదీర్ఘ పోస్టును నెటిజ‌న్ల‌తో పంచుకున్నారు. అస‌లు జైలు లాంటి బిగ్‌బాస్ ఇంట్లోకి పొమ్మ‌ని ఎవ‌రు చెప్పార‌ని అవ్వ‌ను ప్ర‌శ్నించారు. అక్క‌డ అన్ని సౌక‌ర్యాలుంటాయి గానీ మ‌న‌సున్న మ‌నుషులు దొర‌క‌ర‌ని వాపోయారు.

న‌వ్వుకు, ఏడుపుకు కూడా రేటింగులుంటాయ‌ని, మాన‌వ సంబంధాల‌కు ప‌రీక్ష పెట్టే ప్ర‌యోగ‌శాల అని రాసుకొచ్చారు. అక్క‌డ అవ్వ‌ ఆరోగ్యాన్ని ఎవ‌రు చూసుకుంటార‌ని దిగులు చెందారు. క‌నిపించ‌కుండా కేవ‌లం విన‌బ‌డే బిగ్‌బాస్ ఎవ‌రి బాగోగులు కోరే వ్య‌క్తి కాద‌ని, నిన్ను బొమ్మ‌ను చేసి అడిస్తాడ‌ని, నీ శ‌క్తినంతా గుంజుకుంటాడ‌ని ఆవేద‌న చెందారు. నీ ఏడుపు అత‌నికి పైస‌లు కురిపిస్తాయ‌ని విమ‌ర్శించారు. బిగ్‌బాస్ జైలు నుంచి గంగ‌వ్వ‌ను త‌క్ష‌ణ‌మే విడుద‌ల చేయాల‌ని ఓ పెద్ద ఉద్య‌మం లేస్తే త‌ప్ప త‌న‌ను వ‌దిలేలా లేర‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. "మాన‌వ సంబంధాల‌ను బందీల‌ను చేసి ప‌రీక్ష పెడుతున్న బిగ్‌బాస్ జైలు నుంచి గంగ‌వ్వ‌ను విడుద‌ల చేయాల‌ని పోరాడుదాం. గంగ‌వ్వ‌ను జ‌న జీవ‌న స్ర‌వంతిలోకి తీసుకువ‌ద్దాం" అని పిలుపునిచ్చారు. ఈ పోస్టుకు ప‌లువురు నెటిజ‌న్లు మ‌ద్ద‌తు తెలుపుతున్నారు.