బాబు గుప్పిట్లో వ్య‌వ‌స్థ‌లు: కొడాలి నాని..

Kodali Nani Fires On Chandrababu

ఎదురు తంతున్న కోర్టు తీర్పుల నేప‌ధ్యంలో ఎదురుదాడినే ల‌క్ష్యంగా వైసీపీ పెట్టుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. చంద్ర‌బాబు అన్ని వ్య‌వ‌స్థ‌ల‌నూ త‌న గుప్పిట్లో పెట్టుకుని జ‌గ‌న్ పై కుట్ర‌ల‌కు పాల్ప‌డుతున్నాడ‌ని ఆ పార్టీ నాయ‌కులు వ‌రుస‌గా ధ్వ‌జ‌మెత్తుతండ‌డం క‌నిపిస్తోంది. తాజాగా శ‌నివారం మీడియాతో మాట్లాడిన మంత్రి కొడాలి నాని మాట‌లు దీనికి అద్దం ప‌డుతున్నాయి. విభిన్న ర‌కాలుగా విభిన్న అంశాల‌పై చంద్ర‌బాబు అండ్ కో ను విమ‌ర్శిస్తూ ఆయ‌నేమ‌న్నారంటే... 

కొంతమంది వ్యక్తుల స్వార్థ ప్రయోజనాల కోసం చిన్న చిన్న లొసుగులు అడ్డం పెట్టుకుంటున్నారు. కొన్ని వ్యవస్థలను కంట్రోల్లో పెట్టుకొని వాళ్లకు నచ్చినట్టు, వాళ్లకు లాభం చేకూరేట్టు పని చేస్తున్నారు. మిగిలిననటువంటి వ్యవస్థలన్నీ మాట్లాడకూడదు, చూడకూడదు,  చూసినా ఎవరికీ చెప్పకూడదు, మేమే  సుప్రీమ్, మా మాట కాదంటే ఈ భారతదేశంలో ఉన్న 140 కోట్ల ప్రజల్ని మేమేమైనా చేయగలమనే అహంకారపూరితంగా ఈరోజు కొన్ని వ్యవస్థలు ప్రవర్తిస్తున్నాయి. వాటిపై ధైర్యంగా, దమ్ముగా మాట్లాడగలిగే స్వేచ్ఛ  దేశంలో ప్రతి వ్యక్తికి ఉంటుందని తెలియజెప్పాల్సిన అవసరం  ఆసన్నమైంది.  జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఈరోజు వరకు జరుగుతున్న కొన్ని పరిణామాలను పరిశీలించినట్లయితే చాలా స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు కొన్ని అనుమానాలు రేకెత్తుతున్నాయి.  వాటిని నివృత్తి చూసుకోవాల్సిన అవసరం ప్రతి వ్యవస్థ, వ్యక్తులపై ఉంది.  ఈ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి  అధికారంలోకి రాకముందు అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకులు, చంద్రబాబు నాయుడు, ఆయన బినామీలు రాజధాని ప్రకటనకు ముందే వేల ఎకరాలు కొనుక్కొని లబ్ధి పొందారు.  దీని వల్ల అమరావతి ప్రాంతంలో వాళ్ల ఆస్తులను కాపాడుకోవడానికి ఈ రాష్ట్ర సంపద అంతా అక్కడే పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా ఆస్తుల వ్యాల్యూ పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు  మేము అధికారంలోకి వస్తే దానిపై విచారణ జరిపిస్తామ‌ని, దోషులు ఎంత వారైనా కూడా వదిలి పెట్టే ప్రసక్తే లేదనీ చట్టం ముందు, ఈ ప్రజల ముందు దోషులుగా నిలబెడతామని ఎన్నికల ముందే ప్ర‌జ‌ల‌కు హామీ ఇచ్చాం.  

దానికి అనుగుణంగా ఎంక్వయిరీ చేస్తామన్నప్పుడు నీకు దమ్ముంటే సీబీఐ, సిట్, సిఐడి ఎంక్వైరీలు చెయ్. మేము కడిగిన ముత్యంలా వస్తాం, మీరు అనవసరంగా మాపై ఆరోపణలు చేస్తున్నారని చంద్రబాబు   సొల్లు కబుర్లు చెప్పాడు.  స‌రే అని, జ‌గ‌న్‌ మంత్రివర్గ ఉపసంఘాన్ని అదే విధంగా సిట్ కూడా ఏర్పాటు చేసి ఎవరెవరు భూములు కొన్నారుణ‌? ఏమేం భూములు కొన్నారు? ఎన్ని వేల ఎకరాలు  ఇన్ సైడర్ ట్రేడింగ్ చేశారో నివేదికను రూపొందించాం. గత మార్చి నెల్లో దీన్ని బయటపెట్టి కోర్టు దృష్టికి తీసుకు వెళ్తే వ్యక్తిగతంగా,  పార్టీపరంగా ద్వేషంతో చేశారని అనుకుంటారని భావించాం.  చంద్రబాబునాయుడు ఆల్రెడీ చచ్చిన పాము. 23 సీట్లతో చచ్చాడు. అలాంటి చ‌చ్చిన పాముపై వ్యక్తిగతంగా దాడి చేయాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి లేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అంతకన్నా లేదు. తేదేపా క‌న్నా దిక్కుమాలిన పార్టీ ఈ దేశంలో ఏదీ లేదు. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. కేబినెట్లో నిర్ణయం తీసుకొని సిబిఐ ఎంక్వైరీ చేయించాలని ప్రధానమంత్రిని కూడా కోరారు. ఆరు నెలలైనా వారు స్పందించకపోతే సిఐడి ఎంక్వయిరీ చేసి కేసులు నమోదు చేయమని ఆదేశించడం జరిగింది. సిఐడి విచారణపై ఒక వ్యక్తి కోర్టుకు వెళ్లి నన్ను ఉద్దేశపూర్వకంగా ఇరికించారు. నా పరువు ప్రతిష్టలకు భంగం కలుగుతుంది. ఈ చార్జిషీట్లో అంశాలను గాని, ఎంక్వయిరీ గాని నిలుపుదల చేయమని అడిగితే ఎంక్వైరీని నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది.  

ఈ తెలుగుదేశం పార్టీ చవటలు ముందే ఏడ వచ్చు కదా. మేం దొంగలం మమ్మల్ని క్షమించమని అడగొచ్చు కదా. గతంలో చంద్రబాబు నాయుడు ఇటువంటి దొంగ పనులు చేసి రాజశేఖర్రెడ్డి గారి ఇంటికి పోయి తెల్లవారుజామున ఆయన కాళ్ళు పట్టుకొని నన్ను వదిలేయ్ మహాప్రభు అని వేడుకుంటే  ఆరోజు చేసిన దర్యాప్తులన్నీ పక్కన పెట్టి నీ కర్మ నువ్వు అనుభవిస్తావని వైయస్సార్ వదిలేశారు.  అలాగే చిదంబరం, రాజశేఖర్రెడ్డి కాళ్ళు పట్టుకున్నట్లుగా జగన్ మోహన్ రెడ్డి కాళ్ళు కూడా చీకట్లో వచ్చి పట్టుకు చావచ్చు కదా ఈ చంద్రబాబు? అలా చేయ‌కుండా విచార‌ణ చేసుకోమంటూ ప్ర‌గ‌ల్భాలు ప‌లికి...వర్ల రామయ్య, ఆలపాటి రాజా కోర్టుకు పోయి ఈ విచారణను ఆపేయండి. ఈ విచారణ వల్ల మా పరువు ప్రతిష్టలు పోతాయి. వ్యక్తిగతంగా మాపై ఉన్న ద్వేషంతో ఎంక్వైరీ వేశారని అడుగుతున్నారు.  కోర్టుకు వెళ్లి  సిట్, సిఐడి విచారణ ఆపారు. మంత్రివర్గ ఉప సంఘం నివేదికను కూడా పక్కన పెట్టించారు.       

చంద్రబాబు తన దగ్గర ఉన్న కొంత మంది ఎంపీలను బిజెపిలోకి పంపారు. వాళ్లను అడ్డం పెట్టుకొని సిబిఐ ఎంక్వయిరీ చేయనివ్వరు.  నిన్న మా ఎంపీలు పార్లమెంట్ లో ఆంధ్ర రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ వల్ల రాష్ట్ర ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. రాష్ట్రంలో ఉన్న ప్రజలకు మేలు చేయాలని చెప్పి ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటుంటే ఉద్దేశపూర్వకంగా పిటిషన్లు వేసి ఆ ప్రక్రియను ముందుకు సాగకుండా అడుగడుగునా అడ్డుపడుతున్నారు. కాబట్టి దీన్ని సుప్రీం కోర్టు దృష్టికి తీసుకువెళ్లాలి. కేంద్ర ప్రభుత్వం, పార్లమెంట్ కూడా స్పందించాలని కోరారు. సిగ్గు లేకుండా మిగిలిన ఇద్దరు ముగ్గురు ఎంపీలను అడ్డంపెట్టుకుని పార్లమెంటులో దీనిపై మాట్లాడకుండా చంద్రబాబు నాయుడు, ఆయన పార్టీ ఏవిధంగా అడ్డం పడిందో ఈ రాష్ట్ర ప్రజలు చూశారు.  నేనైతే జగన్ మోహన్ రెడ్డిని ఈ రాష్ట్ర ప్రజల తరఫున అభినందిస్తున్నాను. ఎందుకంటే ఎన్టీ రామారావు దగ్గర పని చేయలేక పోయాను. రాజశేఖర్ రెడ్డి  దగ్గర పని చేయలేక పోయాను. ఒక్క జగన్ మోహన్ రెడ్డి  అనే మగాడి దగ్గర, ఒక నీతిమంతుడు దగ్గర, ఒక నిజాయితీ పరుడు దగ్గర, అవతల పక్క కొండలు ఉన్నా కూడా ఢీ కొట్టగలగిన దమ్ము, ధైర్యం ఉన్నటువంటి ఒక మగాడి దగ్గర ప‌నిచేస్తున్నా. ఒక మగాడు లాంటి ముఖ్యమంత్రి దగ్గర, ఆయన మంత్రివర్గంలో ఈరోజు మంత్రిగా పని చేయడం నాకైతే చాలా ఆనందంగా ఉంది.  ఏ రాష్ట్ర ప్రభుత్వం గానీ, ఏ రాజకీయ నాయకుడు గాని ఇప్పటివరకు దమ్ము, ధైర్యంగా జగన్మోహన్ రెడ్డిలా నిర్ణయాలు తీసుకోలేదు. అవతలి వ్యక్తులు ఎంత గొప్పవాళ్ళైనా లేక చేయను తత్వం జగన్ మోహన్ రెడ్డి. పైన ఉన్న దేవుడిని, కింద ఉన్న ప్రజలను నమ్మి న్యాయం చేస్తానని ముందుకు అడుగు వేసిన జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రానికే కాదు దేశానికే ఆదర్శప్రాయుడు. అటువంటి వ్యక్తిని భావితరాలు ఇంకా చూస్తాయా, చూడవో తెలియదు. గతంలో అయితే ఇంత దమ్ము, ధైర్యంగా ముందుకు అడుగు వేసిన వ్యక్తులను అయితే ఇంతవరకు దేశ చరిత్రలో చూడలేదు.

భవిష్యత్తులో కూడా చూస్తామో, చూడమో.  మీడియా స‌హా అన్ని వ్య‌వ‌స్థ‌లూ.. ప్రజాస్వామ్యం అంటే ఎంతో నమ్మకంతో ఉన్నాం. అధికారులు అంటే గౌరవం ఉంది. ఆలస్యమైనప్పటికీ ఈ విషయంపై సుప్రీంకోర్టులో తెలుసుకుంటాం.  అవసరమైతే పార్లమెంట్ లో చర్చకు పెడతాం.  దీనిలో ఇన్వాల్వ్ అయిన పెద్దవాళ్ళ బెదిరింపుల వల్ల మాకేమీ కాదు. ఈ రాష్ట్ర భవిష్యత్తు, పేదల భవిష్యత్తును ఆలోచించి ఎవరైనా ఢీ కొట్టడానికి జగన్ మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. ఇటువంటి ఉడుత ఊపులకు, చిన్న చిన్న అడ్డంకులకు జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రభుత్వం ఆదరదు, బెదరదు.  ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను మీడియాలో ఉన్న ఒక్క సెక్షన్ నెగటివ్ గా చిత్రీకరిస్తుంది. ద్వేషంతో జగన్మోహన్ రెడ్డి గారిని నాశనం చేయాలి. ఈ ప్రభుత్వాన్ని దించేయాలి. ఇప్పటికిప్పుడు మిట్టమధ్యాహ్నం చంద్రబాబును తీసుకొచ్చి ఆ సీట్లో కూర్చో పెట్టేయాలి. ఎమ్మెల్యేలు ఉన్నా లేకున్నా, ప్రజల మద్దతు ఉన్నా లేకపోయినా మేము ఒక మూడు డబ్బా ఛానల్స్, నాలుగు సొల్లు పేపర్లు చెబుతున్నాం కాబట్టి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండాలి. ఆయనను అడ్డం పెట్టుకుని మేము బ్రోకర్ పనులు చేసుకోవాలి. ఈ రాష్ట్రాన్ని దోచుకు తినాలి. ఈ ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు. మేము, మా సామాజిక వర్గం, చంద్రబాబు నాయుడు, ఆయనకు తాన తందాన అనే భజన సంఘాలు మేం బాగు పడితే చాలనే దురుద్దేశంతో రోజూ ఏదో ఒక న్యూసెన్స్ వార్త రాస్తుంటారు.  రూపాయి డీజిల్ పై పెంచడం వల్ల ఒక పెట్రోల్ బాంబు జగన్మోహన్ రెడ్డి  ప్రజలపై వేశారని ఈనాడులో రాశారు.  మోడీ ప్రభుత్వం ఆరు నెలల్లోనే పది రూపాయల వరకు పెంచారు. ఈ వార్తను కనీసం జిల్లా పేపర్ లో గుడివాడ డివిజన్ లోనైనా ఎందుకు రాయలేదు. మోడీ తాట తీస్తారని భయమా?  చంద్రబాబు నాయుడు రాజధానికి రెండు రూపాయలు సెస్సు వేసి పెట్రోల్, డీజిల్ పై కన్నాలు వేసినప్పుడు ఈ గుడ్డి పేపర్లు, ఛానెల్స్ కు కనపడలేదా. అప్పుడు చాలా గొప్పగా రాజధాని కోసం రెండు రూపాయలు చంద్రబాబు నాయుడు వేశారు. జనం ఇంకా రెండు రూపాయలు వేయమని అడుగుతున్నారని ఈ సొల్లు కబుర్లు చెప్పే గుడ్డివాళ్లకు కనపడలేదా.

రెండేళ్లుగా వర్షాలు పడి రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. కాంట్రాక్టర్లకు డబ్బులు కూడా ఇవ్వకుండా 65 వేల కోట్ల రూపాయల బాకీలు పెట్టి పోయారు. 100 కోట్ల ఖజానా అప్పజెప్పి వెళ్లారు. ఆర్ అండ్ బి రోడ్లపై సైకిల్ కూడా తిరిగే పరిస్థితి లేదు. 3900 కోట్ల రూపాయల పాత బకాయిలు కట్టాలి. ఖజానాలో రూపాయి లేదు. కరోనా వల్ల ఆదాయం పూర్తిగా పడిపోయింది. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఒక రూపాయి సెస్సు విధించి దానిపై వచ్చేటటువంటి ఆదాయంతో రోడ్లకు మరమ్మతులు చేయించాలని జగన్ మోహన్ రెడ్డి గారు భావిస్తే అదేదో మహాపాపం అయినట్టుగా మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ డబ్బును పీక్కొని చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి బినామీ కంపెనీలకు ధారపోయడం లేదు. ఏం చేసినా తప్పేనని అంటున్నారు.  చంద్రబాబునాయుడు 2018లో బార్లకు లైసెన్సులు ఇచ్చారు. పదవి నుండి దిగి వెళ్ళిపోతాడని తెలిసినా ఐదేళ్లకు రెన్యువల్ చేశాడు. మా ప్ర‌భుత్వం  బార్లను తగ్గించాలని నిర్ణయం తీసుకుంటే ఇదే చంద్రబాబు నాయుడు, ఆయన బినామీలు కోర్టులకు వెళ్లి 2023 వరకు చంద్రబాబు ఇచ్చిన లైసెన్స్ ఆర్డర్లు కొనసాగాలని చెప్పి దుర్మార్గంగా బార్ల నడుపుతున్నారు. భారతదేశంలో మొత్తం బార్లు అన్ని నడుస్తున్నాయి. కోవిడ్ వల్ల ఆరునెలలు మూతపడ్డాయి. తిరిగి తెచ్చుకునేందుకు నిన్న పర్మిషన్ ఇస్తే మళ్లీ అదో పెద్ద వార్త.

జగన్ మోహన్ రెడ్డి  బార్లు ఓపెన్ చేశారంట. 840 బార్లను ఓపెన్ చేసి 5 ఏళ్లకు లైసెన్సులు ఇచ్చి, కన్నాలేసినట్టుగా డబ్బులు కొట్టేసిన దొంగ వ్యక్తి చంద్రబాబు నాయుడు. బార్లను తిరిగి కునేందుకు అనుమతులుస్తూ, కోవిడ్ కు కొంత ఫీజును నిర్ణయిస్తూ జగన్ మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటే, విచ్చలవిడిగా బార్లకు లైసెన్సులు ఇచ్చారని ఒక పేపర్ లో రాస్తారు. ఇవన్నీ ఎంతటి దుర్మార్గమైన చర్యలో మీరంతా ఆలోచించాలి.  దళిత శంఖారావం అని ఒక కొత్త ప్రోగ్రాం పెట్టాడు. చంద్రబాబు నాయుడుకు దళితులపై ఎనలేని ప్రేమ వచ్చింది. ఈయన చేసిన కార్యక్రమాలకు ఈ రాష్ట్రంలోని దళితులందరూ చెప్పుతో కొడితే పళ్లన్నీ రాలిపోయి 23 సీట్లు వచ్చి చమట దద్దమ్మలా ఇంటి దగ్గర కూర్చొని దళితులపై ఇప్పుడు ప్రేమ పలకబోస్తున్నారు.  ఎవరో ఒకరితో గవర్నర్ కు ఒక లేఖ రాయిస్తాడు. లేకపోతే మీడియా సమావేశాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అన్యాయం జరిగిపోయిందని మాట్లాడిస్తాడు.  దళితులపై ఎక్కడైనా పోలీసు వ్యవస్థ నుండి దాడి జరిగితే 70 ఏళ్ల దేశ రాజకీయ వ్యవస్థలో ఎక్కడైనా పోలీసులను అరెస్టు చేయించి జైలుకు పంపిన దాఖలాలు ఉన్నాయా. దళితుడికి శిరోముండనం చేసిన ఘటనలో ఒక సిఐ, ఎస్ఐని సస్పెండ్ చేయడమే కాదు, వారిపై కేసులు పెట్టి జైలుకు పంపిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిదే.  దళితులు, మైనారిటీలు, ఎస్సీ, ఎస్టి, బీసీ వర్గాలైనా, ఒక పేదవాడు పైనైనా ఎవరైనా ఒక చేయి వేస్తే జగన్మోహన్ రెడ్డి గారిపై చేయి వేసినట్టుగా భావిస్తున్నారు.

పేదలు,  బడుగు, బలహీన వర్గాలకు, గిరిజనులు, మైనార్టీలకు అండగా ఉంటూ, వారికి అన్యాయం చేసిన వారిపై చర్యలు తీసుకున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. దళిత ద్రోహి చంద్రబాబు నాయుడు. దళితుల్లో ఎవడైనా పుడతాడా అని ప్రశ్నించిన లుచ్చా గాడు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళితులను అవమానకరంగా మాట్లాడిన వారు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడే. దళితుల గురించి మాట్లాడాలంటే జూన్ యాప్ లో కాదు, నువ్వు వచ్చి విజయవాడ సెంటర్ లో అంబేద్కర్ విగ్రహానికి సాష్టాంగ నమస్కారం చేసి నా ప్రభుత్వం ఉండగా నేను, నా మంత్రులు, నా పార్టీ దళితులను అవమానించాం. దళితులను తక్కువ చేసి మాట్లాడాను. నేను చేసిన తప్పుకు చింతిస్తున్నాను. నన్ను క్షమించమని ఈ దేశంలో ఉన్న దళితులను కోరిన తర్వాతే వారి గురించి మాట్లాడాలి. జూమ్ యాప్లోను, హైదరాబాద్ లోని ఇంట్లో కూర్చుని దళితుల గురించి మాట్లాదవద్దు. గతంలో దళితులను వర్గాలుగా విడగొట్టాట్టావు. మళ్లీ దళితుల మధ్య చిచ్చులు పెట్టాలన్న తప్పుడు ప్రయత్నం చేస్తే దళితులే నీకు దేహశుద్ధి చేసి నీకు, నీ పార్టీని రాష్ట్రం ఎల్లలు దాటిస్తారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని దళితుల గురించి మాట్లాడాలి. అసలు నీకు మాట్లాడే హక్కు కూడా లేదు.  చంద్రబాబు కు ఇప్పుడు కొత్తగా గుళ్ళూ,  గోపురాల మీద ప్రేమ పుట్టింది. జగన్ మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంలో దేశంలోనే నెంబర్వన్.  కోవిడ్ సమయంలో కూడా ఆయన ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో భాగంగా 60 వేల కోట్ల సాయాన్ని ప్రజలకు అందించడం జరిగింది. ఇక జగన్ గురించి ఏం చెప్పాలో తెలియడం లేదు.

ఒకవైపు వయస్సు పెరుగుతూ వస్తోంది. పార్టీ చూస్తే రోజుకో ఎమ్మెల్యే బయటకు పోతున్నాడు. పార్టీ క్యాడర్ బిజెపిలోకి వెళ్ళిపోతుంది.  ఏం చేయాలో తెలియక కులాల మధ్య గొడవలు పెడుతున్నా వర్కవుట్ కావడం లేదు. ఇప్పుడేం చేయాలి అనుకుంటూ మతాల మధ్య గొడవలు పెట్టాలని అనుకుంటున్నాడు. ఎక్కడైనా చిన్న చిన్న సంఘటనలు జరిగినా ప్రభుత్వం వెంటనే స్పందిస్తోంది. అంతర్వేది ఘటనలో సిబిఐ ఎంక్వైరీ కోరాం. గుళ్ళూ, గోపురాల దగ్గర సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని చెబుతున్నాం.  పోలీసుల నిఘా పెంచాం.  దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ఆలయాలకు సెక్యూరిటీని కల్పిస్తున్నాం. చంద్రబాబు నాయుడు మాత్రం ఏ దేవుడు చేయి విరక్కొడదాం, ఏ దేవుడు గుడికి ఏరకంగా డ్యామేజ్ చేద్దాం, లేకపోతే ఎక్కడైనా ఏ తాగుబోతులు, సన్నాసులు డామేజ్ చేస్తే దాన్ని భూతద్దంలో పెట్టి జగన్ మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్, హిందువులకు వ్యతిరేకి కాబట్టి జగన్మోహన్ రెడ్డి వద్దని చంద్రబాబు అంటున్నాడు.  తల్లి,  తండ్రి చచ్చిపోతే గుండు కూడా చేయించుకోని, తలకొరివి పెట్టినటువంటి, దేవాలయాలకు వెళ్లి శంకుస్థాపనలు, పూజలు చేసేటప్పుడు బూట్లు కూడా తీయని లుచ్చా గాడు, నేను ఒక హిందువు ఉన్నాను. అందరూ ఓటేసి నన్ను గెలిపించండి. గుళ్ళూ గోపురాలను కాపాడుతానని మతాల మధ్య గొడవ పెట్టే ఒక దొంగ ఆలోచన చేస్తున్నాడు.  జగన్మోహన్రెడ్డిని చంద్రబాబు నాయుడు, చంద్రబాబు అండ్ కో ఆపాలని ప్రయత్నిస్తే అరచేతిని పెట్టి సూర్యకాంతిని ఆపినట్టే. ప్రజా బలంతో జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు.

మామను వెన్నుపోటు పొడిచి, పక్క వాళ్ళ పార్టీని లాక్కొని వచ్చి, మోదీ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళ కాళ్ళు పట్టుకొని సపోర్ట్ చేయమని చెప్పే దుర్భాగ్య పరిస్థితి చంద్రబాబుది.   జగన్ ను రాష్ట్ర ప్రజలు నమ్మారు. 151 సీట్లతో అధికారం ఇచ్చారు. ఎంత గొప్ప వాళ్ళు ఉన్నా, ఏ ముసుగులో ఉన్నా వాళ్లందర్నీ బయటకు తీసుకువచ్చి చట్టం, ప్రజల ముందు దోషులుగా నిలబెడతారు.  చంద్రబాబునాయుడు నీ చిల్లర రాజకీయాలు ఆపేయ్. నీ వయసు అయిపోయింది. జగన్మోహన్ రెడ్డిని నువ్వు ఏమి చేయలేవు. నీ కంఠశోష తప్పించి, జూమ్ యాప్ లో కుక్క మొరిగినట్టుగా మొరిగి మొరిగి మొరిగి సాయంత్రానికి అలసిపోయి పడుకోవడం తప్పించి. మళ్లీ ఉదయాన్నే రావడం మళ్లీ జూమ్ లో మొరగడం. ఇంకా నువ్వు బతికి ఉన్నంత కాలం ఇదే జరుగుతుంది. నువ్వు కోరుకున్నట్టు ఏ కార్యక్రమం జరగదు. జగన్ మోహన్ రెడ్డి గారు ఆయన ఉన్నంత కాలం దేవుడు, ప్రజల ఆశీస్సులతో ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తారు. రాష్ట్ర ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. రైతులు,  పేదలు, రాష్ట్రంలోని ప్రజలు సుభిక్షంగా ఉన్నారు. దేనికీ భయపడకుండా మాట్లాడే దమ్ము,  ధైర్యం ఉన్న జగన్మోహన్రెడ్డిపై ఉమ్ము వేస్తే మీ పైనే పడుతుంది ఆయనపై పడదు. ప్రజలకు న్యాయం చేసే, జరిగే విషయాలు, ప్రతి కార్యక్రమంలో మీడియా, న్యాయ వ్యవస్థలు ఆలోచన చేయాలి. మనం తీసుకునే నిర్ణయాల వల్ల కొన్ని కోట్ల మంది ఇబ్బందులు పడకూడదు. ప్రజలకు ఏం కావాలో ప్రజాప్రతినిధులకు తెలుస్తాయి.  ప్రజలకు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. దయచేసి వాటికి  అడ్డంపడి, ఈ పేద ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని దొంగ వార్తలు రాసే దొంగ మీడియాకు, పిటీషన్లు వేసి ప్రతి కార్యక్రమాన్ని ఆపే పిటిషన్ దారులకు చేతులు జోడించి నమస్కరిస్తున్నా.

 


                    Advertise with us !!!