Sai Pallavi Demand 2 crores For Movie

దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌బెట్టుకోవాలి అంటారు. హీరోల మాట ఎలా ఉన్నా హీరోయిన్లు మాత్రం దీన్ని తు.చ‌. త‌ప్ప‌కుండా పాటిస్తారు. ఇది చాలా మంది హీరోయిన్ల విష‌యంలో రుజువైంది. ఒక‌టి, రెండు సినిమాలు క‌మ‌ర్షియ‌ల్ హిట్ అయితే చాలు వారి రెమ్యున‌రేష‌న్‌కి రెక్క‌లొచ్చేస్తాయి. త‌మ సినిమా చేయ‌మ‌ని వ‌చ్చే నిర్మాత‌ల‌కు ప‌గ‌లే చుక్క‌లు చూపిస్తారు. ఇప్పుడు సాయిప‌ల్ల‌వి కూడా అదే దారిలో ఉంద‌ని తెలుస్తోంది. మొద‌ట్లో స‌హ‌న‌టిగా న‌టించిన ఆమె మ‌ల‌యాళంలో `ప్రేమ‌మ్‌` చిత్రంతో వెలుగులోకి వ‌చ్చింది. హీరోయిన్ల‌ను ప్ర‌త్యేకంగా చూపించి ఒక ఫ్యామిలీ లుక్ తీసుకొచ్చే శేఖ‌ర్ క‌మ్ముల దృష్టి ఆమెపై ప‌డ‌డం, `ఫిదా` సినిమాలో తెలంగాణ అమ్మాయిగా ఒక అద్భుత‌మైన క్యారెక్ట‌ర్ ఇవ్వ‌డం, ఆ క్యారెక్ట‌ర్‌ను అత్య‌ద్భుతంగా పోషించి హీరోయిన్‌గా నూటికి నూరు మార్కులు కొట్టేసింది సాయిప‌ల్ల‌వి. ఆ సినిమా ఘ‌న‌విజ‌యం సాధించ‌డంతో తెలుగులో ఆమెకు వెల్లువ‌లా అవ‌కాశాలు వ‌చ్చాయి. ఎంసిఎ, ప‌డి ప‌డి లేచే మ‌న‌సు, క‌ణం వంటి సినిమాల్లో విభిన్న‌మైన పాత్ర‌లు పోషించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆమ‌ధ్య ధ‌నుష్‌తో క‌లిసి న‌టించిన మారి 2లో రౌడీ బేబీ పాట‌తో హీరోయిన్‌గా ఆమెకు ఉన్న క్రేజ్ రెట్టింపయ్యింది. స్వ‌త‌హాగా మంచి డాన్స‌ర్ అయిన సాయిప‌ల్ల‌వి ఆ పాట‌లో వేసిన స్టెప్స్‌కి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఆ పాట యూ ట్యూబ్‌లో రికార్డులు సృష్టించింది.

తాజాగా నాగ‌చైత‌న్య‌, శేఖ‌ర్ క‌మ్ముల కాంబినేష‌న్‌లో రూపొందుతున్న ల‌వ్‌స్టోరీ చిత్రంలో సాయిప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టిస్తోంది. అలాగే ద‌గ్గుబాటి రానా హీరోగా రూపొందుతున్న విరాట‌ప‌ర్వం కూడా చేస్తోంది. ఇవే కాకుండా టాక్సీవాలా ద‌ర్శ‌కుడు రాహుల్ సంకృత్యాన్ ద‌ర్శ‌క‌త్వంలో నాని న‌టిస్తున్న శ్యామ్ సింగ‌రాయ‌ చిత్రంలో అవ‌కాశం ద‌క్కించుకుంది. ఇదిలా ఉంటే హీరోయిన్‌గా త‌న క్రేజ్‌ని, రేంజ్‌ని పెంచుకున్న సాయిప‌ల్ల‌వి రెమ్యున‌రేష‌న్ కూడా అమాంతం పెంచేసింద‌ట‌. శ్యామ్ సింగ‌రాయ చిత్రం కోసం ఏకంగా రెండు కోట్ల రూపాయ‌లు డిమాండ్ చేసింద‌ని స‌మాచారం. ఇంత పారితోషికం ఏ తెలుగు సినిమా హీరోయిన్ తీసుకోలేదు. ఒక విధంగా సౌత్‌లోనే ఇంత భారీ రెమ్యున‌రేష‌న్ ఏ హీరోయిన్‌కి ముట్ట‌జెప్ప‌లేదు. మ‌రి సాయిప‌ల్ల‌వి డిమాండ్ చేసిన ఎమౌంట్‌ను ఇచ్చి త‌మ సినిమాలో ఆమెను ఫిక్స్ చేసుకున్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది.