Indian Teen Chosen For UN Sustainable Development Goals Programme

రెండేళ్లకోసారి ఐక్యరాజ్య సమితి ప్రకటించే ప్రతిష్ఠాత్మక సుస్థిరాభివృద్ధి లక్ష్యాల యువ నేతల బంధం (ద యంగ్‍ లీడర్స్ ఫర్‍ ద సస్టెయినబుల్‍ డెవలప్‍మెంట్‍ గోల్స్) లో భారత్‍కు చెందిన 18 ఏళ్ల ఉదిత్‍ సింఘాల్‍ చోటు సంపాదించారు. ప్రపంచ వ్యాప్తంగా యువతకు లభించే అత్యంత ఉన్నతమైన గుర్తింపుగా దీన్ని భావిస్తారు. సమాజం ఎదుర్కొంటున్న సవాళ్ల పరిష్కారానికి కృషి చేసేవారికి ఈ బృంద సభ్యులుగా ఎంపిక చేస్తారు. 2020కి సంబంధించి మొత్తం 17 మంది యంగ్‍ లీడర్స్ను ఎంపిక చేసినట్టు ఐరాస ప్రధాన కార్యదర్శి యువజన వ్యవహారాల రాయబారి జయాత్మా విక్రమనాయకే తెలిపారు.

ఐరాస 75వ వార్షికోత్సం సందర్భంగా ఈ బృందాన్ని ఎంపిక చేయడం ఆనందంగా ఉందన్నారు. ఢిల్లీలోని బ్రిటిష్‍ స్కూల్‍లో చదువుకున్న సింఘాల్‍.. గ్లాస్‍2శాండ్‍ సంస్థను స్థాపించాడు. పర్యావరణానికి హాని కలిగించే గాజు సీసాలను ఖాళీ ప్రదేశాల్లో పారేయకూడదంటూ ప్రచారం చేపట్టాడు. ఇప్పటివరకూ సుమారు 8 వేల బాటిళ్లను ఇసుకలో పారేయకుండా అడ్డుకున్నాడు.