Tungabhadra Pushkaralu to start from nov 20 to dec 1

తుంగభద్ర నదీ పుష్కరాలను నవంబర్‍ 20 న ఉంచి డిసెంబర్‍ 1 వరకూ కోవిడ్‍ నిబంధనలకు అనుగుణంగా ఘనంగా నిర్వహిస్తామమని ఆంధప్రదేశ్‍ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్‍కుమార్‍ యాదవ్‍ చెప్పారు. కర్నూలు జిల్లా పరిధిలో తుంగభద్ర నదిపై 17 చోట్ల ఘాట్లను నిర్మిస్తామన్నారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయం నుంచి పుష్కరాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. పుష్కరాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పుష్కర ఘాట్లు, మౌలిక సదుపాయాల ఏర్పాట్లు వంటి పనులను పారదర్శకంగా, నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలన్నారు.

దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‍, ఇంజనీర్‍ ఇన్‍ చీఫ్‍ సి.నారాయణరెడ్డితో కలిసి కర్నూలు జిల్లా కలెక్టర్‍ వీరపాండ్యన్‍, కార్పొరేషన్‍ కమిషనర్‍ డీకే బాలాజీ తదితర అధికారులతో వీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు.  కర్నూలు జిల్లాలో తుంగభద్ర పుష్కరాలను నిర్వహించేందుకు జిల్లా అధికారులతో 18 కమిటీలు వేశామని కలెక్టర్‍ వీర పాండ్యన్‍ తెలిపారు. ఘాట్లు, ఇతర పనులకు బడ్జెట్‍ ప్రతిపాదనలను ఇదివరకే ప్రభుత్వానికి పంపామన్నారు. దీనిపై మంత్రి అనిల్‍ స్పందిస్తూ.. తక్షణ, స్వల్పకాలిక, దీర్ఘకాలిక అవసరాలు, పనులపై బడ్జెట్‍ ప్రతిపాదనలను పంపాలని సూచించారు. వచ్చే వారం కర్నూలులో పుష్కారాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహిస్తామన్నారు.